ఆస్కారం ఎవరికి? | Hollywood prepares for the 98th Academy Awards | Sakshi
Sakshi News home page

ఆస్కారం ఎవరికి?

Mar 15 2026 12:54 AM | Updated on Mar 15 2026 12:55 AM

Hollywood prepares for the 98th Academy Awards

హాలీవుడ్‌ అంచనా నిజమవుతుందా?

హాలీవుడ్‌లో ఆస్కార్‌ సందడి మొదలైంది. 98వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఈ నెల 15న జరగనున్న సంగతి తెలిసిందే. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం జరుగుతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఆస్కార్‌ అవార్డు సాధించే ఆస్కారం ఎవరికి మెండుగా ఉంది? అనే చర్చ జరుగుతోంది. ఆస్కార్‌ చరిత్రలోనే ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించి, అత్యధికంగా 16 నామినేషన్స్‌ దక్కించుకున్న ‘సిన్నర్స్‌’ సినిమాకు ఫైనల్‌గా ఎన్ని అవార్డులు వస్తాయి? అనేది ప్రస్తుతం హాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌.

అలాగే 13 నామినేషన్స్‌ దక్కించుకున్న ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమా ‘సిన్నర్స్‌’ సినిమాను డామినేట్‌ చేసి, ఎక్కువ అవార్డులు దక్కించుకునే అవకాశం లేకపోలేదని హాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇక ‘ఫ్రాకింగ్‌స్టన్, మార్టీ సుప్రీం, సెంటిమెంటల్‌ వాల్యూ’ చిత్రాలకు తొమ్మిది నామినేషన్స్‌ లభించగా, ‘హామ్నెట్‌’ చిత్రానికి 8 నామినేషన్స్‌ దక్కాయి. మరి... ఈ చిత్రాల్లో ఏ చిత్రం ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది? అనే చర్చ జరుగుతోంది. ఇక ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు... ఈ ప్రధాన విభాగాల్లో హాలీవుడ్‌ కథనాల ప్రకారం అవార్డు దక్కే ఆస్కారం ఎవరికి ఉందనే విషయం తెలుసుకుందాం...

జోస్యం నిజమవుతుందా?
ఉత్తమ నటుడు విభాగంలో అవార్డు కోసం తిమోతి చాలమేట్, లియోనార్డ్‌ డికాప్రియో, ఈథన్‌ హాక్, మైఖేల్‌ బి జోర్డాన్, వాగ్నర్‌ మౌరా పోటీ పడుతున్నారు. అయితే ఈ ఐదుగురిలోనూ తిమోతి చాలమేట్‌ (‘మార్టీ సుప్రీం’ సినిమాకుగానూ)కే ఉత్తమ నటుడు అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్‌ హాలీవుడ్‌లో వినిపిస్తోంది. కానీ ఈ ఏడాది జరిగిన 83వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును ‘ది సీక్రెట్‌ ఏంజెంట్‌’ చిత్రానికిగానూ వాగ్నర్‌ మౌరా గెలుచుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి బ్రెజిలియన్‌ యాక్టర్‌గా వాగ్నర్‌ నిలిచారు.

అది మాత్రమే కాదు... ఉత్తమ నటుడిగా కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ వాగ్నర్‌ మౌరా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌’ అందించే అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచున్నారు మైఖేల్‌ బి. జోర్డాన్‌. పైగా ఆస్కార్‌లోనే అత్యధిక నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘సిన్నర్స్‌’ సినిమాలో నటించిన యాక్టర్‌ కాబట్టి మైఖేల్‌ బి. జోర్డాన్‌పై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ‘బ్లూ మూన్‌’ సినిమాలో ఈథన్‌ హాక్, ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రంలో లియోనార్డ్‌ డికాప్రియో సూపర్బ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు.

దీంతో ఈ ఏడాది పోటీ కాస్త గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మెజారిటీ మాత్రం తిమోతి చాలమేట్‌కే అవార్డు వస్తుందని అంచనా వేస్తున్నారు. పైగా 30 ఏళ్ల వయసులోనే మూడుసార్లు ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన అతి పిన్న వయస్కుడిగా తిమోతి పేరిట రికార్డు ఉంది. 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు విభాగంలో ‘ఏ కంప్లీట్‌ అన్‌నోన్‌’ సినిమాకుగాను తిమోతికి నామినేషన్‌ దక్కినప్పటికీ అవార్డు రాలేదు. ఈ మూడో ప్రయత్నంలో తిమోతికి అవార్డు ఖాయం అని హాలీవుడ్‌ జోస్యం చెబుతోంది..

పాతికేళ్ల తర్వాత... 
గత ఏడాది జరిగిన 97వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను అందించారు. అయితే ఈ ఏడాది జరగనున్న 
98వ అవార్డ్స్‌ ప్రదానోత్సవంలో కొత్తగా ‘బెస్ట్‌ క్యాస్టింగ్‌’ అనే విభాగాన్ని ఆస్కార్‌ అకాడమీ కమిటీ ప్రవేశపెట్టింది. 2001లో ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మళ్లీ పాతికేళ్లకు ‘బెస్ట్‌ క్యాస్టింగ్‌’ పేరుతో మరో విభాగాన్ని చేర్చారు.

ఇలా 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉత్తమ క్యాస్టింగ్‌ విభాగంలో నీనా గోల్డ్‌ (‘హామ్నెట్‌’ సినిమా), జెన్నిఫర్‌ వెండెట్టి (మార్టీ సుప్రీం), వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ (కాసాండ్రా కులుకుండిస్‌), గాబ్రియేల్‌ డొమింగ్యూస్‌ (ది సీక్రెట్‌ ఏజెంట్‌), ఫ్రాన్సిన్‌ మైస్లర్‌ (సిన్నర్స్‌) మధ్య పోటీ నెలకొంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధాన పోటీ ‘సిన్నర్స్, వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రాల మధ్య ఉన్నట్లే, ఈ  కొత్త విభాగంలోనూ ప్రధాన పోటీ ఫ్రాన్సిన్‌ మైస్లర్‌ (సిన్నర్స్‌), వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ (కాసాండ్రా కులుకుండిస్‌)ల మధ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే యాక్టింగ్‌ విభాగంలో ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమాకు నాలుగు నామినేషన్స్‌ దక్కగా, ‘సిన్నర్స్‌’కు మూడు నామినేషన్స్‌ దక్కాయి. అయితే ఈ విభాగంలో ‘సిన్నర్స్‌’కే అవార్డు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే... ఆస్కార్‌ చరిత్రలోనే అత్యధికంగా నామినేషన్స్‌ దక్కించుకున్న రికార్డు ‘సిన్నర్స్‌’కే దక్కింది కాబట్టి ఈ సినిమాకే ఈ విభాగంలో అవార్డు వస్తుందంటున్నారు హాలీవుడ్‌ సినీ నిపుణులు. అలాగే జెన్నిఫర్‌ వెండెట్టి (మార్టీ సుప్రీం) అవార్డు అందుకునే చాన్స్‌ లేకపోలేదంటున్నారు.

సిన్నర్స్‌ వర్సెస్‌ వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం 10 చిత్రాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి. ఆస్కార్‌ హిస్టరీలోనే అత్యధికంగా 16 నామినేషన్స్‌ను దక్కించుకుని, చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్‌’ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది. అలాగే 13 నామినేషన్స్‌ దక్కించుకున్న ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రానికి కూడా ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ ఉంది. ఉత్తమ చిత్రం విభాగంలో ప్రధానంగా ఈ రెండు చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందనే టాక్‌ హాలీవుడ్‌లో వినిపిస్తోంది. నామినేషన్స్‌ పరంగా ‘సిన్నర్స్‌’దే పై చేయి అయినప్పటికీ ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమాకు రావచ్చొనే టాక్‌ హాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది.

ఈ ఏడాది జరిగిన బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అవార్డు (బాఫ్తా), గోల్డెన్‌ గ్లోబ్, ్ర΄÷డ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ చిత్రంగా ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ సినిమా అవార్డులు సొంతం చేసుకుంది. ఈ కారణంగానే ఆస్కార్‌లోనూ ఉత్తమ చిత్రం విభాగంలో ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’కు అవార్డు దక్కుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కానీ ‘సిన్నర్స్, హామ్నెట్‌’ చిత్రాలను కూడా తేలికగా తీసివేయలేమని హాలీవుడ్‌ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రాలను దాటుకుని ఈ విభాగంలో బరిలో ఉన్న ‘బగోనియా, ఎఫ్‌1, ఫ్రాంకిన్‌స్టన్, మార్టీ సుప్రీం, ది సీక్రెట్‌ ఏజెంట్, ట్రైన్‌ డ్రీమ్స్‌’ వంటి సినిమాల్లో ఏదైనా సర్‌ప్రైజింగ్‌గా ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? అనే విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

ఈ ఇద్దరిలో ఎవరు?
ఉత్తమ నటి విభాగంలో ‘హ్యామ్‌నెట్‌’ చిత్రానికిగాను జస్సీ బక్లీ, ‘బగోనియా’ చిత్రానికిగాను ఎమ్మా స్టోన్, ‘సెంటిమెంటల్‌ వేల్యూ’ చిత్రానికి రెనాటా రైన్సావా, ‘ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌ ఐ ఉడ్‌ కిక్‌ యు’ చిత్రానికి నురోజ్‌ బర్న్, ‘సాంగ్‌ సంగ్‌ బ్లూ’ మూవీకి గాను కేట్‌ హడ్సన్‌లు నామినేషన్స్‌ దక్కించుకున్నారు. అయితే ‘క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డు, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు, బాఫ్తా అవార్డ్స్‌’లో నటిగా అవార్డు గెలుచుకుని, ఉత్తమ నటి విభాగంలోని ఆస్కార్‌ అవార్డు కోసం రేసులో ముందు వరుసలో ఉన్నారు జస్సీ బక్లీ. కాగా రెనాటా రైన్సావా, రోజ్‌లు తమ కెరీర్లో తొలిసారి ఆస్కార్‌ అవార్డుకు నామినేషన్‌ దక్కించుకున్నారు.

అలాగే గతంలో ‘ఆల్మోస్ట్‌ ఫేమస్‌’ అనే చిత్రంలో సహాయ నటిగానూ ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు కేట్‌ హడ్సన్‌. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె మళ్లీ ఆస్కార్‌ అవార్డుకు నామినేషన్‌ దక్కించుకున్నారు. కానీ ఈసారి ఉత్తమ నటి విభాగంలో కేట్‌ హడ్సన్‌కు నామినేషన్‌ దక్కింది. కేట్, రెనాటా... ఈ ఇద్దరిలో ఆస్కార్‌ అదృష్టం ఎవర్ని వరిస్తుంది అనేది చూడాలి.

భారత్‌కు నిరాశ 
ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో మన దేశానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలోని అవార్డు కోసం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా భారతదేశం తరపున హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్‌’ను పంపింది. ఈ సినిమా ఆస్కార్‌ నామినేషన్‌ కోసం షార్ట్‌ లిస్ట్‌ అయింది కానీ నామినేషన్‌ దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో బ్రెజిల్‌ దర్శకుడు క్లెబర్‌ మెండోన్సా ఫిల్హో తీసిన ‘ది సీక్రెట్‌ ఏజెంట్‌’, ఫ్రాన్స్‌ దర్శకుడు జాఫర్‌ పనాహి తెరకెక్కించిన ‘ఇట్‌ వాజ్‌ జస్ట్‌ ఎ యాక్సిడెంట్‌’, నార్వే డైరెక్టర్‌ జోచిమ్‌ ట్రైయర్‌ తీసిన ‘సెంటిమెంటల్‌ వేల్యూ’, స్పెయిన్‌ డైరెక్టర్‌ ఆలివర్‌ లాక్సే రూపొందించిన ‘సిరాట్‌’, ట్యూనిషియా డైరెక్టర్‌ కౌథర్‌ బెన్‌ హనియా దర్శకత్వం వహించిన ‘ది వాయిస్‌ ఆఫ్‌ హింద్‌ రజబ్‌’ సినిమాలు నామినేషన్‌ దక్కించుకున్నాయి.

ఇంకా ఆస్కార్‌ కన్సిడరేషన్‌ విభాగంలో ‘మహావతార్‌ నరసింహా, కాంతార: ఏ లెజెండ్‌ చాప్టర్‌1, తన్వీ: ది గ్రేట్, టూరిస్ట్‌ ఫ్యామిలీ, సిస్టర్‌ మిడ్‌నైట్‌’ వంటి సినిమాలు పరిశీలన జాబితాలో ఉన్నప్పటికీ నామినేషన్‌ను దక్కించు కోవడంలో విఫలమయ్యాయి. అయితే ఆస్కార్‌ అవార్డుల ప్రజెంటర్స్‌లో భారతీయ నటి ప్రియాంకా చో్రపా కూడా ఉండటం అనేది భారతీయ ప్రేక్షకులను ఆనందపరిచే విషయం.

పద్నాలుగో సారైనా అవార్డు వస్తుందా?
దర్శకుడు పాల్‌ థామస్‌ ఆండర్‌సన్‌ ఇప్పటికి 14 సార్లు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క అవార్డు వచ్చింది లేదు. ఈ ఏడాది ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ చిత్రానికి గాను పాల్‌ థామస్‌ ఆండర్‌సన్‌ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు. పైగా ఈ ఏడాది జరిగిన బాఫ్తా, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్, డైరెక్టర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా, క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఉత్తమ దర్శకుడి అవార్డు పాల్‌ థామస్‌కే దక్కింది.

దీంతో ఆస్కార్‌ అవార్డు కూడా ఆయనకే రావొచ్చన్నది హాలీవుడ్‌ బలమైన నమ్మకం. మరోవైపు రేయాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్‌), ట్రియర్‌ (సెంటిమెంటల్‌ వేల్యూ), జాష్‌ షాఫ్టీ (మార్టీ సుప్రీం), క్లోయి జావ్‌ (హ్మామ్నెట్‌) లను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే...ఈ చిత్రాలకు ప్రధాన విభాగాల్లో నామినేషన్స్‌ దక్కింది. ఇంకా బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ విభాగంలో సీన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌) అమీ మాడిగన్‌ (వెపన్స్‌), బెస్ట్‌ మ్యూజిక్‌ (ఒరిజినల్‌ స్కోర్‌) విభాగంలో లుడ్విగ్‌ గోరాన్సన్‌ వంటి వారు అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా హాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. 

ఆస్కార్‌ అవార్డుని ఏ స్టార్‌ చేజిక్కించుకుంటారు? ఉత్తమ చిత్రం అవార్డు ఏ సినిమాకి దక్కుతుంది? అనే సస్పెన్స్‌ మరికొన్ని గంటల్లో వీడిపోతుంది. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement