జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ | nepali couple steals rs2 crore jewellery in jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

Mar 15 2026 5:56 AM | Updated on Mar 15 2026 5:56 AM

nepali couple steals rs2 crore jewellery in jubilee hills

8 డైమండ్‌ నెక్లెస్‌లు, పది రోలెక్స్‌ వాచీలు, నగల దొంగతనం

 ఓ ఇంట్లో పనిమనుషులుగా చేరిన 

నేపాలీ దంపతుల చేతివాటం  

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే ఓ నేపాలీ దంపతులు కన్నం వేశారు. పనిమనుషులుగా చేరిన నెలన్నరకే చేతివాటం ప్రదర్శించారు. యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 8 డైమండ్‌ నెక్లెస్‌లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్‌ వాచీలను దోచుకుని పరారయ్యారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాలు... 

జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–25లోని ప్లాట్‌ నెంబర్‌ 305లో పింగళి అనురు««ద్‌రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్‌ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్‌కు చెందిన మహేష్‌ షాయి(30), అప్సర(25) దంపతులు పనిమనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురుచూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటిపై రెక్కీ నిర్వహించారు.  

రాత్రంతా అల్మారా, లాకర్లను పగులకొడుతూ.. 
యజమానులు అనిరు«ధ్‌రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను శనివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్‌ నెక్లెస్‌లు, 10 రోలెక్స్‌ వాచీలు, బంగారు నగను బ్యాగ్‌లో సర్దుకుని ఉడాయించారు.

 ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్‌  గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్‌సింగ్, రీమాసింగ్‌ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు పేరు మోసిన కుటుంబానికి చెందినది కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నేపాల్‌ సరిహద్దులకు ముంబై, బిహార్‌లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. కాగా, హరత్‌సింగ్‌ గదిలో కూడా మహేశ్‌సాయి దంపతులు కొంత సామాను తస్కరించడం గమనార్హం.  


 

Advertisement
 
Advertisement
Advertisement