మనశంకర వరప్రసాద్‌గారు మూవీ సూపర్ హిట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మెగాస్టార్ తన పోస్ట్‌లో రాస్తూ..'మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
మీరు వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. ఇట్లు మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు.
కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్‌గారు జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన రీజినల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.
From the heart,
with love & gratitude 🙏🏻 pic.twitter.com/LJ2g32x3qC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2026


