మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లి పోయాడు డ్రాగన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ జోర్డాన్‌లో ముగిసింది. ఎన్టీఆర్, టోవినో థామస్ పాల్గొనగా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది.
కొత్త షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు పెద్ద సెట్స్‌ను క్రియేట్ చేశారని, ఇందులో విలన్ ఇంటి సెట్ కూడా ఉందని, ఈ సెట్స్‌లోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని సమాచారం. ఇక్కడ షూట్ పూర్తి చేసిన తర్వాత ‘డ్రాగన్’ టీమ్ శ్రీలంక వెళ్లనుందనే టాక్ వినిపిస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.


