జనవరిలో సినిమాల జాతర
క్యాలెండర్‌లో కొత్త సంవత్సరం కనిపించే సమయం ఆసన్నమైంది. అలాగే టాలీవుడ్ వెండితెర కూడా ప్రేక్షకులకు జోరుగా హుషారుగా సినిమాలు అందించేందుకు సిద్ధమైంది. ఆడియన్స్‌కు మస్త్ మజానిచ్చే సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. సో... జనవరిలో సినిమాల జాతర అనొచ్చు. మరి... న్యూ ఇయర్ రోజు ఏయే సినిమాలు రెడీ అవుతున్నాయి... సంక్రాంతి బరిలో నిలిచిన స్టార్స్ సినిమాలు, వాటి ఫైనల్ రిలీజ్ డేట్‌లపై ఓ లుక్ వేయండి.
మీలాంటి యువకుడి కథ
శ్రీనందు, యామినీ భాస్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్‌ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబరు 12న ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమా విడుదల కావడంతో ‘సైక్ సిద్ధార్థ్’ను జనవరి 1కి వాయిదా వేశారు. ఓ కుర్రాడి ప్రేమ, వ్యాపారం, వ్యాపారంలో అతని ఫెయిల్యూర్, అతని కెరీర్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నరసింహా, ప్రియాంకా, రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ, సాక్షి ఆత్రీ చతుర్వేది ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
వన వీర
అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘వన వీర’. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్రిస్మస్ ఫెస్టివల్‌కు ఆరేడు సినిమాలు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను జనవరి 1కి వాయిదా వేశారు.
అలాగే ఈ సినిమాకు తొలుత ‘వానర’ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ సెన్సార్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ‘వన వీర’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నందు విలన్ రోల్ చేశారు. కోన వెంకట్, సత్య, ఆమని, ‘ఖడ్గం’ పృథ్వీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఓ కుర్రాడి ప్రేమ, ఆ కుర్రాడి బైక్ దొంగతనం జరగడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలిసింది.
సీఐడీ ఆఫీసర్
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ సినిమాకు రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మించిన ఈ సినిమా జనవరి 2న రిలీజ్ కానుంది. యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీనివాస్, రాజేంద్రన్, అషు రెడ్డి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వరుస మిస్సింగ్ కేసులను సీఐడీ శివానీ రాథోడ్ ఎలా సాల్వ్ చేసింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివానీగా సన్నీ లియోన్ నటించారు.
చేయని తప్పుకు నిందిస్తే...
బాలనటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. తాను తప్పు చేయకపోయినా ఊరు ఊరంతా హీరోని నిందిస్తే, ఆ హీరో తనపై పడిన నిందను ఎలా తుడిపేసుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఎమ్. మమత, ఎమ్. రాజరాజేశ్వరిల సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మించారు. రాకేశ్ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ది రాజా సాబ్ రెడీ
జనవరి నెల అంటే సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా పండగ. వెండితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ అనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో ముందుగా రాజా సాబ్‌గా ప్రభాస్ థియేటర్స్‌లోకి వస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపోందిన ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇందులో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్,
బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.
టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ హారర్ కామెడీ సినిమా ప్రధానంగా తాతా–మనవడి ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో తాతగా సంజయ్ దత్, మనవడిగా ప్రభాస్ నటించారని తెలిసింది. అలాగే వారసత్వపు ఆస్తి అనేది కూడా ఈ సినిమాలోని ప్రధాన కథాంశమని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమౌతోంది.
మన శంకర వరప్రసాద్‌గారు వస్తున్నారు
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్‌గా చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, శశిరేఖ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలు భార్యాభర్తలుగా కనిపిస్తారు. హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, క్యాథరీన్, వీటీవీ గణేశ్ ఇతర పాత్రల్లో నటించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ తొలిసారిగా సిల్వర్‌స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబినేషన్‌లో ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కూడా ఉంది. ఈ పాట అభిమానులకు వెండితెరపై ఓ ఫీస్ట్ అనే చెప్పవచ్చు. అలాగే చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఈ సినిమాలో విలన్స్‌పై చేసే ఫైట్ కూడా హైలైట్‌గా ఉండనుందని సమాచారం. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఈ సంక్రాంతి పండక్కి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు రవితేజ. ఆ విజ్ఞప్తి ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. హాస్యనటుడు సత్య, వెన్నెల కిశోర్, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించారు. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామసత్య నారాయణ అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. రవితేజ, డింపుల్ హయతి భార్యా భర్తలుగా కనిపిస్తారు. ఆల్రెడీ వివాహం చేసుకున్న రామసత్యానారాయణ స్పెయిన్ వెళ్లడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం కావడం, అలా పరిచయమైన అమ్మాయి రామసత్యనారాయణ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయడం వంటి ఆసక్తికర, వినోదాత్మక సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.
నారీ నారీ నడుమ మురారి!
ఒకే ఆఫీసులో మాజీ ప్రేమికురాలు, ప్రజెంట్ లవర్ ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో చూడొచ్చంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన ఈ వినోదాత్మక చిత్రం జనవరి 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
రాజుగారి కథ ఏంటో!
‘అనగనగా ఒక రాజు’ అంటూ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో వినోదాల విందు పంచబోతున్నాం అంటున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో నటించిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమ, పెళ్లి, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుసాయని తెలిసింది.
ఓం శాంతి శాంతి శాంతిః
భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు... వంటి అంశాలతో రూపోందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. సృజన్ ఎర్రబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్, కిశోర్, బాల సౌమిత్రి నిర్మించిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది.
ఇలా జనవరి నెలలో రిలీజ్ కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
⇒ 2025లో రీ రిలీజ్‌ల హవా జోరుగా సాగింది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం’, నాగార్జున ‘శివ’, మహేశ్‌బాబు ‘ఖలేజా’, ప్రభాస్ ‘వర్షం’ వంటి టాప్ హీరోల సినిమాల రీ–రిలీజ్‌లు బాగానే జరిగాయి. ఇక 2026 ఏడాది ప్రారంభంలోనే రీ–రిలీజ్‌ల హవా మొదలైపోయింది. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ సినిమా 2026 జనవరి 1న రీ రిలీజ్ కానుంది.
అలాగే మహేశ్‌బాబు హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ 4కే వెర్షన్‌ను న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందుగానే... అంటే ఈ డిసెంబరు 31న రీ రిలీజ్ కానుంది. అంటే... జనవరి 1న కూడా ‘మురారి’ సినిమా థియేటర్స్‌లో ఉంటుంది. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సోనాలీ బ్రిందే హీరోయిన్‌గా నటించారు. ఎన్. దేవీ ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపీ నందిగం ఈ సినిమాను నిర్మించారు.
ఆల్కహాల్ వాయిదా?
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’. ఈ కామెడీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమాకు మెహర్ తేజ్ దర్శకుడు. ఓ వ్యక్తి జీవితం ఆల్కహాల్ వల్ల ఏ విధంగా ప్రభావితమైంది? అతను ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఎలా ఉండేవాడు? ఆ తర్వాత అతని ప్రవర్తన ఏ విధంగా మారింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. రుహానీ శర్మ, నిహరిక ఎన్.ఎమ్, సత్య, గిరీష్ కులకర్ణి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. మరి... జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కాకపోతే అదే నెలలోనే మరో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారా? లేక వేరే నెలలో డేట్ ఫిక్స్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అనువాదాలూ రెడీ
అనువాద సినిమాలు కూడా ఈ జనవరి నెలలో బాగానే ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎన్‌ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తీకేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో శ్రీలీల, అధర్వ, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.
సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ లీడ్ ల్స్‌లో నటించిన ‘గత వైభవం’ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో రూపోందింది. ఈ సినిమా కన్నడ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్‌ను జనవరి 1న రిలీజ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రేమ, పునర్జన్మ వంటి అంశాల నేపథ్యంలో పోందిన ఈ సినిమాకు సునీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని అనువాద చిత్రాలు కూడా ఈ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. – ముసిమి శివాంజనేయులు


