breaking news
nuvu naku nachav
-
కొత్త సంవత్సరం... జోరుగా హుషారుగా...
క్యాలెండర్లో కొత్త సంవత్సరం కనిపించే సమయం ఆసన్నమైంది. అలాగే టాలీవుడ్ వెండితెర కూడా ప్రేక్షకులకు జోరుగా హుషారుగా సినిమాలు అందించేందుకు సిద్ధమైంది. ఆడియన్స్‌కు మస్త్ మజానిచ్చే సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. సో... జనవరిలో సినిమాల జాతర అనొచ్చు. మరి... న్యూ ఇయర్ రోజు ఏయే సినిమాలు రెడీ అవుతున్నాయి... సంక్రాంతి బరిలో నిలిచిన స్టార్స్ సినిమాలు, వాటి ఫైనల్ రిలీజ్ డేట్లపై ఓ లుక్ వేయండి.మీలాంటి యువకుడి కథ శ్రీనందు, యామినీ భాస్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్‌ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబరు 12న ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమా విడుదల కావడంతో ‘సైక్ సిద్ధార్థ్’ను జనవరి 1కి వాయిదా వేశారు. ఓ కుర్రాడి ప్రేమ, వ్యాపారం, వ్యాపారంలో అతని ఫెయిల్యూర్, అతని కెరీర్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నరసింహా, ప్రియాంకా, రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ, సాక్షి ఆత్రీ చతుర్వేది ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.వన వీర అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘వన వీర’. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్రిస్మస్ ఫెస్టివల్‌కు ఆరేడు సినిమాలు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను జనవరి 1కి వాయిదా వేశారు.అలాగే ఈ సినిమాకు తొలుత ‘వానర’ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ సెన్సార్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ‘వన వీర’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నందు విలన్ రోల్ చేశారు. కోన వెంకట్, సత్య, ఆమని, ‘ఖడ్గం’ పృథ్వీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఓ కుర్రాడి ప్రేమ, ఆ కుర్రాడి బైక్ దొంగతనం జరగడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలిసింది.సీఐడీ ఆఫీసర్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ సినిమాకు రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మించిన ఈ సినిమా జనవరి 2న రిలీజ్ కానుంది. యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీనివాస్, రాజేంద్రన్, అషు రెడ్డి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వరుస మిస్సింగ్ కేసులను సీఐడీ శివానీ రాథోడ్ ఎలా సాల్వ్ చేసింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివానీగా సన్నీ లియోన్ నటించారు.చేయని తప్పుకు నిందిస్తే... బాలనటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. తాను తప్పు చేయకపోయినా ఊరు ఊరంతా హీరోని నిందిస్తే, ఆ హీరో తనపై పడిన నిందను ఎలా తుడిపేసుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఎమ్. మమత, ఎమ్. రాజరాజేశ్వరిల సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మించారు. రాకేశ్ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ది రాజా సాబ్ రెడీ జనవరి నెల అంటే సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా పండగ. వెండితెరపై ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో ముందుగా రాజా సాబ్‌గా ప్రభాస్ థియేటర్స్‌లోకి వస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపోందిన ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇందులో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ హారర్ కామెడీ సినిమా ప్రధానంగా తాతా–మనవడి ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో తాతగా సంజయ్ దత్, మనవడిగా ప్రభాస్ నటించారని తెలిసింది. అలాగే వారసత్వపు ఆస్తి అనేది కూడా ఈ సినిమాలోని ప్రధాన కథాంశమని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమౌతోంది. మన శంకర వరప్రసాద్‌గారు వస్తున్నారు చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్‌గా చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, శశిరేఖ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలు భార్యాభర్తలుగా కనిపిస్తారు. హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, క్యాథరీన్, వీటీవీ గణేశ్ ఇతర పాత్రల్లో నటించారు.ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ తొలిసారిగా సిల్వర్‌స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబినేషన్లో ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కూడా ఉంది. ఈ పాట అభిమానులకు వెండితెరపై ఓ ఫీస్ట్ అనే చెప్పవచ్చు. అలాగే చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఈ సినిమాలో విలన్స్‌పై చేసే ఫైట్ కూడా హైలైట్‌గా ఉండనుందని సమాచారం. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి పండక్కి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు రవితేజ. ఆ విజ్ఞప్తి ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. హాస్యనటుడు సత్య, వెన్నెల కిశోర్, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామసత్య నారాయణ అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. రవితేజ, డింపుల్ హయతి భార్యా భర్తలుగా కనిపిస్తారు. ఆల్రెడీ వివాహం చేసుకున్న రామసత్యానారాయణ స్పెయిన్ వెళ్లడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం కావడం, అలా పరిచయమైన అమ్మాయి రామసత్యనారాయణ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయడం వంటి ఆసక్తికర, వినోదాత్మక సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నారీ నారీ నడుమ మురారి! ఒకే ఆఫీసులో మాజీ ప్రేమికురాలు, ప్రజెంట్ లవర్ ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో చూడొచ్చంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన ఈ వినోదాత్మక చిత్రం జనవరి 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.రాజుగారి కథ ఏంటో! ‘అనగనగా ఒక రాజు’ అంటూ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో వినోదాల విందు పంచబోతున్నాం అంటున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో నటించిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమ, పెళ్లి, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుసాయని తెలిసింది. ఓం శాంతి శాంతి శాంతిః భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు... వంటి అంశాలతో రూపోందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. సృజన్ ఎర్రబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్, కిశోర్, బాల సౌమిత్రి నిర్మించిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది.ఇలా జనవరి నెలలో రిలీజ్ కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.⇒ 2025లో రీ రిలీజ్‌ల హవా జోరుగా సాగింది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం’, నాగార్జున ‘శివ’, మహేశ్‌బాబు ‘ఖలేజా’, ప్రభాస్ ‘వర్షం’ వంటి టాప్ హీరోల సినిమాల రీ–రిలీజ్లు బాగానే జరిగాయి. ఇక 2026 ఏడాది ప్రారంభంలోనే రీ–రిలీజ్‌ల హవా మొదలైపోయింది. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ సినిమా 2026 జనవరి 1న రీ రిలీజ్ కానుంది.అలాగే మహేశ్‌బాబు హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ 4కే వెర్షన్‌ను న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందుగానే... అంటే ఈ డిసెంబరు 31న రీ రిలీజ్ కానుంది. అంటే... జనవరి 1న కూడా ‘మురారి’ సినిమా థియేటర్స్‌లో ఉంటుంది. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సోనాలీ బ్రిందే హీరోయిన్గా నటించారు. ఎన్. దేవీ ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపీ నందిగం ఈ సినిమాను నిర్మించారు.ఆల్కహాల్ వాయిదా?‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’. ఈ కామెడీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమాకు మెహర్ తేజ్ దర్శకుడు. ఓ వ్యక్తి జీవితం ఆల్కహాల్ వల్ల ఏ విధంగా ప్రభావితమైంది? అతను ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఎలా ఉండేవాడు? ఆ తర్వాత అతని ప్రవర్తన ఏ విధంగా మారింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. రుహానీ శర్మ, నిహరిక ఎన్.ఎమ్, సత్య, గిరీష్ కులకర్ణి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. మరి... జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కాకపోతే అదే నెలలోనే మరో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారా? లేక వేరే నెలలో డేట్ ఫిక్స్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.అనువాదాలూ రెడీఅనువాద సినిమాలు కూడా ఈ జనవరి నెలలో బాగానే ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తీకేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో శ్రీలీల, అధర్వ, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ లీడ్ ల్స్‌లో నటించిన ‘గత వైభవం’ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో రూపోందింది. ఈ సినిమా కన్నడ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్‌ను జనవరి 1న రిలీజ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రేమ, పునర్జన్మ వంటి అంశాల నేపథ్యంలో పోందిన ఈ సినిమాకు సునీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని అనువాద చిత్రాలు కూడా ఈ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
బంతి... ఓ మంచి పనోడు!
హిట్ క్యారెక్టర్ చిత్రం : నువ్వు నాకు నచ్చావ్ (2001) డెరైక్ట్ చేసింది : కె. విజయభాస్కర్ సినిమా తీసింది : ‘స్రవంతి’ రవికిశోర్ మాటలు రాసింది : త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంచెం చమత్కారం... కొంచెం వెటకారం కలగలిస్తే సునీల్. ప.గో.జి. మాండలికంతో... పంచ్‌తో కూడిన టైమింగ్‌తో... చాలా షార్ట్ టైమ్‌లో కమెడియన్ స్థాయి నుంచి స్టార్ స్థాయికెదిగాడు తను. ‘పాపే నా ప్రాణం’లో సర్వర్‌గా చిన్న వేషంతో సునీల్ కెరీర్ స్టార్టయ్యింది. ‘నువ్వే కావాలి’, ‘నువ్వు-నేను’తో ఆడియన్స్‌లో బాగా రిజిస్టరైపోయాడు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో ‘బంతి’ కేరెక్టర్‌తో పెకైగశాడు. క్రికెట్ ఆటలో ముఖ్యమైనది ఏదో తెలుసా? పోనీ... హాకీలో? అదీ కాకపోతే బాల్ బ్యాడ్మింటన్‌లో... ఇంపార్టెంట్ ఐటమ్ క్యాహై? కరెస్టే. మీ ఆన్సర్ కరెస్టే. సచిన్ టెండూల్కర్ అయినా సరే ఇంత పొడుగు బ్యాట్ పట్టుకుని బాల్ లేకుండా ఏం చేయగలడు చెప్పండి? అందుకే చాలా ఆటల్లో బంతి చాలా చాలా ప్రధానం. ఆటల్లోనే కాదు... ఆ ఇంట్లో కూడా బంతి చాలా ఇంపార్టెంట్. అలాగని, ఆ ఇంట్లో వాళ్లంతా ప్లేయర్సేమో అనుకోకండి. ఆ ఇంట్లో ఎవరికేం కావాల్సినా పలికేది... పిలిచేది బంతినే. బంతి ఏంటి? విచిత్రంగా అనుకుటున్నారా ‘బంతి’ అనేది ఆ ఇంట్లో పనివాడి పేరు. పేరులాగానే అతడు కూడా చిత్రాతిచిత్రమైన మనిషి. బంతిలాగా గుండ్రంగా ఉంటాడు. పుట్టాక ఆ పేరు పెట్టారో, పెట్టాక అలా తయారయ్యాడో అతనిక్కూడా తెలీదు. అతి వినయం అతనికి ఆభరణం. అతివినయం ధూర్తలక్షణం కదా అని మీరు లాజిక్ లాగితే మేమేం చేయలేం! ఎక్కడ ఎగరాలో... ఎక్కడ తగ్గాలో... ఎక్కడ పని చేయాలో... ఎక్కడ వినయం చూపాలో... ఎక్కడ కాలరెగరేయాలో... బాగా తెలిసినవాడే మన బంతి. ఆ ఇంటి పెద్ద శ్రీనివాసమూర్తి. అతని తమ్ముడు చంటి. పేకాట తప్ప ఇంకే ఆటా రాదాయనకు. శ్రీనివాసమూర్తి పెద్ద కూతురు నందినికి ఆ రోజు ఎంగేజ్మెంట్. ఇంటి నిండా చుట్టాలు. చంటికి కాఫీ తాగాలనిపించింది. అటుగా వెళ్తున్న బంతిని పిలిచాడు. వాడి చేతిలో కాఫీ గ్లాసు ఉంది. గబుక్కున లాగేసుకుని చటుక్కున తాగేశాడు చంటి. అయినా ఏం మాట్లాడలేదు బంతి. ‘‘పంచదార ఎక్కువైనట్టుందేంట్రా?’’ అనడిగాడు చంటి మూతి తుడుచుకుంటూ. ‘‘నేను కొంచెం ఎక్కువ షుగర్ తాగుతాను’’ చెప్పాడు బంతి చాలా క్యాజువల్‌గా. చంటి ఖంగు తిన్నాడు. ‘‘అంటే... ఇది నువ్వు తాగిందా?’’ అవునన్నట్టుగా తలూపాడు బంతి. ‘‘ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదా’’ అన్నాడు చంటి చిరాగ్గా. ‘‘ఆ ముక్క ముందు అడగొచ్చు కదా’’ అనేసి తాపీగా వెళ్లిపోయాడు బంతి. చంటికి బీపీ వచ్చేసింది. ‘‘ఇక్కడో పెద్ద మనిషి మాట్లాడుతుంటే వెళ్లిపోతావేంట్రా?’’ దానికి బంతి ఏం చెప్పాడో తెలుసా?’’ పళ్లు తోముకుని వస్తా సార్.’’ అంటే.. బంతి పాచిమొ హంతో ఎంగిలి చేసిన కాఫీని చంటి తాగాడన్న మాట. థూ... యాక్... ఇలానే ఉంటాయ్ బంతిగాడి చేష్టలు. ఆ ఫంక్షన్‌కి బ్యాగేసుకుని దిగాడు వెంకీ. పైన మేడ మీద గదిలోకి తీసుకెళ్లమని బంతిని పురమాయించాడు శ్రీనివాసమూర్తి. వెంకీ బ్యాగ్‌ని చాలా వినయంగా మోస్తూ ముందుకు దారితీశాడు. ‘‘పెళ్లికొడుకు ఏం చేస్తుంటాడు?’’ అడిగాడు వెంకీ. ‘‘అమెరికాలో ఇంజినీర్ సార్’ అని చెప్పి, ‘‘మరి మీరు?’’ అని ఆసక్తి కొద్దీ అడిగాడు బంతి. ‘‘అనకాపల్లిలో గ్రాడ్యుయేట్‌ని’’ అని గొప్పగా చెప్పాడు వెంకీ. అంతే... బంతి బాడీలాంగ్వేజ్ మారిపోయింది. మోస్తున్న బ్యాగ్ వెంకీకిచ్చేసి, ‘‘పైన గది ఉంటుంది... అక్కడికెళ్లండి’’ అని చెప్పేసి చక్కాపోయాడు. చూశారా! నిరుద్యోగి అంటే పనోడికి కూడా లోకువే అన్నమాట. ఈ వెంకీ, శ్రీనివాసమూర్తి క్లోజ్ఫ్రెండ్కి కొడుకు. ఉద్యోగం కోసం అనకాపల్లి నుంచి హైదరాబాదొచ్చాడు. అవుట్హౌస్లోనే ఉండమన్నాడు మూర్తి. వెంకీని అవుట్హౌస్కి తీసుకెళ్లాడు బంతి. వెళ్లీవెళ్లగానే వెంకీ తన బ్యాగ్‌ను డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.వెంటనే బంతి మొహం చిట్లించి ‘‘బ్యాగులూ బట్టలూ ఎక్కడబడితే అక్కడ పడేయడం అయ్యగారికి నచ్చదు’’ అన్నాడు. దాంతో వెంకీ ఆ బ్యాగ్ తీసి కింద పెట్టేసి, ఫ్యాన్ స్విచాన్ చేశాడు. ‘‘అనవసరంగా లైట్లూ, ఫ్యాన్లూ వేయడం కూడా అయ్యగారికి నచ్చదు’’ అని బంతి చాలా గీర్వాణంగా చెప్పాడు. వెంకీ వెంటనే ఫ్యాన్ ఆపేసి, కిటికీ తలుపులు తెరవడానికెళ్తూ డౌట్కొద్దీ... ‘‘కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా?’’ అడిగాడు. బంతి చాలా స్టయిల్‌గా ‘‘నాకు నచ్చదు’’ అని చెప్పాడు. వెంకీకి ఈ బంతిగాడు అస్సలు అర్థం కావడం లేదు. పేరుకి పనోడే కానీ, మరీ వీరవిహారం చేస్తున్నట్టుగా అనిపించింది. ‘‘అయ్యగారికి నీట్నెస్ అన్నా, డిసిప్లిన్ అన్నా ప్రాణం. నీకు హనుమంతుడు తెలుసా? ఈ ఇంట్లో నేను అదే టైపు. అయ్యగారు రాముడైతే, అమ్మగారు సీత. అందుకే ఈ ఇంటికి ‘అయోధ్య’ అని పేరు పెట్టారు’’ అని బంతి తెగ బిల్డప్ ఇస్తూ స్పీచ్ ఇచ్చాడు. వెంకీ కొంటెగా ‘‘ఈ అవుట్ హౌస్ పేరు లంకా?’’ అనడిగాడు. బంతికి బాగా కాలి, ‘‘ఏం జోకా? ఊరికే ఎర్రబస్సెక్కి వచ్చేస్తుంటారు’’ అని డైలాగేసేసి వెళ్లిపోయాడు. కిరాణా షాపు నుంచి సరుకులు తీసుకుని ఆటోలో దిగాడు బంతి. ఈ లగేజ్ అంతా మోసుకుని లోపలకెళ్లాలి. కొంచెం కష్టమే. ఎవడైనా బకరా దొరికితే బాగుణ్ణు.బంతి ఇలా అనుకుంటున్నాడో లేదో, ఎదురుగా వెంకీ వస్తున్నాడు. రెండు బరువైన బ్యాగులు చూపించి ‘‘ఏమీ అనుకోకపోతే ఈ రెండూ కొంచెం లోపల పెడతారా? మిగతా సరుకులు నేను తీసుకొస్తా’’ అనడిగాడు బంతి. పాపం వెంకీ జాలితో ఆ రెండు బ్యాగుల్నీ మోసుకుంటూ వెళ్లాడు. వెనుక బంతి చిన్న క్యాన్ తీసుకుని వస్తున్నాడు. హాలు దగ్గరకు రాగానే ఈ క్యాన్ వెంకీ చేతికిచ్చేసి, ఆ రెండు బ్యాగులూ తనే మోసుకుంటూ లోపలికెళ్లాడు. ఇలా చెమటలు కారుస్తూ బ్యాగులు మోస్తున్న బంతిని చూసి ఇంట్లో వాళ్లంతా తెగ జాలిపడిపోయారు.‘‘పాపం... ఎంత పని చేస్తున్నాడో! ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు!’’ అని బంతికి అందరూ కలిసి సర్టిఫికెట్లు ఇచ్చేశారు.ఇలా ఉంటాయండీ బంతి బిల్డప్పులు. శ్రీనివాసమూర్తి ఇద్దరు కూతుళ్లకీ వెంకీ అంటే పడడం లేదు. బంతి ఇదే అదను అనుకుని వెంకీని ఓ పట్టు పడదామని అవుట్హౌస్కి వెళ్లాడు. లోపలంతా చిందరవందరగా ఉంది. ఎక్కడబడితే అక్కడ మాసిన బట్టలు, డ్రాయర్లు, సాక్స్‌లు. బంతికి కోపం వచ్చేసింది. ‘‘ఏంటిది?’’ ‘‘అది అడగడానికే వచ్చావా? ఫ్రిజ్జు’’ ‘‘నేనడుగుతోంది దాని గురించి కాదు. దాని మీద ఏంటది?’’ ‘‘సాక్సు’’ ‘‘ఫ్రిజ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశావ్?’’ ‘‘దండెం మీద ఖాళీ లేదు’’ ‘‘అంటే.. దండెం మీద ఖాళీ లేదని తాజ్‌మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తావా? అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు... జబ్బలు కనిపించేలా బనియన్లు... ఎక్స్‌పోజింగా? చూస్తున్నా... అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా’’ అంటూ బంతి తెగ చెలరేగిపోతున్నాడు. వెంకీ ఏం మాట్లాడకుండా వెళ్లి తలుపులేసేశాడు. ‘‘ఏంటి తలుపులేసేస్తున్నావ్. ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి’’ అని బంతి అనే లోపే, వెంకీ వచ్చి పీక పట్టుకుని గోడకేసి ఒక్క నొక్కు నొక్కాడు. అప్పటిదాకా తెగ బీరాలు పోయిన బంతిగాడు కాస్తా గాలి తీసిన బెలూన్లాగా అయిపోయి, ఊ ఊ... అని ఏడవడం మొదలెట్టాడు. ‘‘ఎందుకేడుస్తున్నావ్?’’ అడిగాడు వెంకీ. ‘‘కొడతారేమోనని’’ చెప్పాడు బంతి. అక్కడున్న బెల్ట్ తీసి గట్టిగా గాలిలో ఊపాడు. దాంతో కెవ్వుమని అరిచాడు బంతి. ‘‘ఏంటి నాన్నా! ముందే అరుస్తున్నావ్?’’ ‘‘తర్వాత అరవలేనేమోనని’’ అని దీనంగా చెప్పాడు బంతి.‘‘అసలేంట్రా నీ ప్రాబ్లమ్? రూమ్ నీట్‌గా లేదు. అంతే కదా! దానికింత గొడవెందుకు. నీకెలా కావాలో అలా రూమ్ సర్దుకో. ఇంతకూ షూస్ ఎక్కడుండాలి?’’ అనడిగాడు వెంకీ. బంతి కంగారుగా ‘‘స్టాండ్‌లో’’ అని చెప్పాడు. ‘‘సాక్స్?’’ ‘‘దండెం మీదుండాలి’’ ‘‘అండర్వేర్?’’ ‘‘ఎక్కడైనా ఉండొచ్చు’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘కంట్రోల్లో ఉండాలి’’ ‘‘కరెస్ట్. నువ్వు చాలా మంచోడివిరా. నేను స్నానానికి వెళ్లొస్తా. ఈలోపు రూమ్ మొత్తం నీట్‌గా సర్దెయ్యాలి’’ అని టవల్ తీసుకుని బాత్రూమ్లోకెళ్లాడు వెంకీ. అతను బయటకొచ్చేలోపు రూమ్ మొత్తం తళతళలాడిపోతోంది. ఒక్క బంతి ఫేస్ తప్ప. రామాయణంలో రాముడికి హనుమంతుడే కాదు. చిన్న ఉడుత కూడా సాయం చేసింది. ఇక్కడ కూడా అంతే. మన బంతిగాడి అతి తెలివితేటల వల్ల, ‘మిస్టర్’ కమ్యూనికేషన్ వల్ల వెంకీ దగ్గరకు వెళ్లాల్సిన ఫొటో, పెళ్లికొడుకు దగ్గరకెళ్లింది. దాంతో పెళ్లాగిపోయింది. వెంకీ, నందినిల ప్రేమ లీకయిపోయింది. ఫైనల్‌గా వెంకీ-నందిని ఒక్కటయ్యారు. దీనికంతటికీ అనుకోకుండా కారకుడైన బంతిగాణ్ణి మెచ్చుకోవాలి కదా! వెంకీ మెచ్చుకోలేదు సరికదా... కోపంగా దగ్గరకొచ్చి ‘‘బెల్ట్ పెట్టుకున్నావా?’’ అనడిగాడు.ఆ ప్రశ్నకే బంతిగాడిలో దడ... వణుకు... అన్నీనూ! ‘బాబోయ్’ అనుకుంటూ బయటకు ఒకటే గ్యాలప్. - పులగం చిన్నారాయణ తమాషాగా ఉంటుందనే ‘బంతి’ పేరు పెట్టాం ‘నువ్వే కావాలి’లో సునీల్ కోసమే ఓ కేరెక్టర్ సృష్టించాం. ‘నువ్వు నాకు నచ్చావ్’లో మాత్రం ఈ పాత్రే సునీల్‌ను సెలక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇందులో పనివాడి పాత్రకు కొంచెం మూర్ఖత్వం, కొంచెం బోళాతనం కావాలి. ఆ రెండూ సునీల్ బాగా పండించగలడనిపించింది. ఇంటిలిజెంట్ ఇడియట్లాగా ఆ పాత్రలోని రకరకాల షేడ్స్‌ని బాగా ఆవిష్కరించాడు. ఆ పాత్రకు తమాషాగా ఉంటుందనే ‘బంతి’ అనే పేరు పెట్టాం. మామూలుగా పనివాళ్లను ఇంట్లోవాళ్లు అలా ఇలా ఆడుకుంటూ ఉంటారు కదా. ఏది ఏమైనా ఇంత చిన్న పాత్రను కూడా ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారంటే పాత్ర ఎంత సక్సెస్ అయ్యిందో అర్థమౌతోంది. - విజయ భాస్కర్, దర్శకుడు


