బంతి... ఓ మంచి పనోడు!

బంతి... ఓ మంచి పనోడు!


హిట్ క్యారెక్టర్

 


చిత్రం : నువ్వు నాకు నచ్చావ్ (2001)

డెరైక్ట్ చేసింది : కె. విజయభాస్కర్   

సినిమా తీసింది : ‘స్రవంతి’ రవికిశోర్

మాటలు రాసింది : త్రివిక్రమ్ శ్రీనివాస్


 

కొంచెం చమత్కారం... కొంచెం వెటకారం కలగలిస్తే సునీల్. ప.గో.జి. మాండలికంతో... పంచ్‌తో కూడిన టైమింగ్‌తో... చాలా షార్ట్ టైమ్‌లో కమెడియన్ స్థాయి నుంచి స్టార్ స్థాయికెదిగాడు తను. ‘పాపే నా ప్రాణం’లో సర్వర్‌గా చిన్న వేషంతో సునీల్ కెరీర్ స్టార్టయ్యింది.

 ‘నువ్వే కావాలి’, ‘నువ్వు-నేను’తో ఆడియన్స్‌లో బాగా రిజిస్టరైపోయాడు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో ‘బంతి’ కేరెక్టర్‌తో పెకైగశాడు.

 

క్రికెట్ ఆటలో ముఖ్యమైనది ఏదో తెలుసా? పోనీ... హాకీలో? అదీ కాకపోతే బాల్ బ్యాడ్మింటన్‌లో... ఇంపార్టెంట్ ఐటమ్ క్యాహై? కరెస్టే. మీ ఆన్సర్ కరెస్టే. సచిన్ టెండూల్కర్ అయినా సరే ఇంత పొడుగు బ్యాట్ పట్టుకుని బాల్ లేకుండా ఏం చేయగలడు చెప్పండి? అందుకే చాలా ఆటల్లో బంతి చాలా చాలా ప్రధానం. ఆటల్లోనే కాదు... ఆ ఇంట్లో కూడా బంతి చాలా ఇంపార్టెంట్. అలాగని, ఆ ఇంట్లో వాళ్లంతా ప్లేయర్సేమో అనుకోకండి. ఆ ఇంట్లో ఎవరికేం కావాల్సినా పలికేది... పిలిచేది బంతినే.



బంతి ఏంటి? విచిత్రంగా అనుకుటున్నారా ‘బంతి’ అనేది ఆ ఇంట్లో పనివాడి పేరు. పేరులాగానే అతడు కూడా చిత్రాతిచిత్రమైన మనిషి. బంతిలాగా గుండ్రంగా ఉంటాడు. పుట్టాక ఆ పేరు పెట్టారో, పెట్టాక అలా తయారయ్యాడో అతనిక్కూడా తెలీదు.

 అతి వినయం అతనికి ఆభరణం. అతివినయం ధూర్తలక్షణం కదా అని మీరు లాజిక్ లాగితే మేమేం చేయలేం!

 ఎక్కడ ఎగరాలో... ఎక్కడ తగ్గాలో... ఎక్కడ పని చేయాలో... ఎక్కడ వినయం చూపాలో... ఎక్కడ కాలరెగరేయాలో... బాగా తెలిసినవాడే మన బంతి.

   

 ఆ ఇంటి పెద్ద శ్రీనివాసమూర్తి. అతని తమ్ముడు చంటి. పేకాట తప్ప ఇంకే ఆటా రాదాయనకు. శ్రీనివాసమూర్తి పెద్ద కూతురు నందినికి ఆ రోజు ఎంగేజ్‌మెంట్. ఇంటి నిండా చుట్టాలు. చంటికి కాఫీ తాగాలనిపించింది. అటుగా వెళ్తున్న బంతిని పిలిచాడు. వాడి చేతిలో కాఫీ గ్లాసు ఉంది. గబుక్కున లాగేసుకుని చటుక్కున తాగేశాడు చంటి. అయినా ఏం మాట్లాడలేదు బంతి. ‘‘పంచదార ఎక్కువైనట్టుందేంట్రా?’’ అనడిగాడు చంటి మూతి తుడుచుకుంటూ. ‘‘నేను కొంచెం ఎక్కువ షుగర్ తాగుతాను’’ చెప్పాడు బంతి చాలా క్యాజువల్‌గా.

 చంటి ఖంగు తిన్నాడు. ‘‘అంటే... ఇది నువ్వు తాగిందా?’’ అవునన్నట్టుగా తలూపాడు బంతి. ‘‘ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదా’’ అన్నాడు చంటి చిరాగ్గా. ‘‘ఆ ముక్క ముందు అడగొచ్చు కదా’’ అనేసి తాపీగా వెళ్లిపోయాడు బంతి.



చంటికి బీపీ వచ్చేసింది. ‘‘ఇక్కడో పెద్ద మనిషి మాట్లాడుతుంటే వెళ్లిపోతావేంట్రా?’’ దానికి బంతి ఏం చెప్పాడో తెలుసా?’’ పళ్లు తోముకుని వస్తా సార్.’’ అంటే.. బంతి పాచిమొ హంతో ఎంగిలి చేసిన కాఫీని చంటి తాగాడన్న మాట. థూ... యాక్... ఇలానే ఉంటాయ్ బంతిగాడి చేష్టలు.

   

ఆ ఫంక్షన్‌కి బ్యాగేసుకుని దిగాడు వెంకీ. పైన మేడ మీద గదిలోకి తీసుకెళ్లమని బంతిని పురమాయించాడు శ్రీనివాసమూర్తి. వెంకీ బ్యాగ్‌ని చాలా వినయంగా మోస్తూ ముందుకు దారితీశాడు. ‘‘పెళ్లికొడుకు ఏం చేస్తుంటాడు?’’ అడిగాడు వెంకీ. ‘‘అమెరికాలో ఇంజినీర్ సార్’ అని చెప్పి, ‘‘మరి మీరు?’’ అని ఆసక్తి కొద్దీ అడిగాడు బంతి. ‘‘అనకాపల్లిలో గ్రాడ్యుయేట్‌ని’’ అని గొప్పగా చెప్పాడు వెంకీ. అంతే... బంతి బాడీలాంగ్వేజ్ మారిపోయింది. మోస్తున్న బ్యాగ్ వెంకీకిచ్చేసి, ‘‘పైన గది ఉంటుంది... అక్కడికెళ్లండి’’ అని చెప్పేసి చక్కాపోయాడు. చూశారా! నిరుద్యోగి అంటే పనోడికి కూడా లోకువే అన్నమాట.

   

ఈ వెంకీ, శ్రీనివాసమూర్తి క్లోజ్‌ఫ్రెండ్‌కి కొడుకు. ఉద్యోగం కోసం అనకాపల్లి నుంచి హైదరాబాదొచ్చాడు. అవుట్‌హౌస్‌లోనే ఉండమన్నాడు మూర్తి. వెంకీని అవుట్‌హౌస్‌కి తీసుకెళ్లాడు బంతి. వెళ్లీవెళ్లగానే వెంకీ తన బ్యాగ్‌ను డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.వెంటనే బంతి మొహం చిట్లించి ‘‘బ్యాగులూ బట్టలూ ఎక్కడబడితే అక్కడ పడేయడం అయ్యగారికి నచ్చదు’’ అన్నాడు. దాంతో వెంకీ ఆ బ్యాగ్ తీసి కింద పెట్టేసి, ఫ్యాన్ స్విచాన్ చేశాడు. ‘‘అనవసరంగా లైట్లూ, ఫ్యాన్లూ వేయడం కూడా అయ్యగారికి నచ్చదు’’ అని బంతి చాలా గీర్వాణంగా చెప్పాడు. వెంకీ వెంటనే ఫ్యాన్ ఆపేసి, కిటికీ తలుపులు తెరవడానికెళ్తూ డౌట్‌కొద్దీ... ‘‘కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా?’’ అడిగాడు.



 బంతి చాలా స్టయిల్‌గా ‘‘నాకు నచ్చదు’’ అని చెప్పాడు. వెంకీకి ఈ బంతిగాడు అస్సలు అర్థం కావడం లేదు. పేరుకి పనోడే కానీ, మరీ వీరవిహారం చేస్తున్నట్టుగా అనిపించింది. ‘‘అయ్యగారికి నీట్‌నెస్ అన్నా, డిసిప్లిన్ అన్నా ప్రాణం. నీకు హనుమంతుడు తెలుసా? ఈ ఇంట్లో నేను అదే టైపు. అయ్యగారు రాముడైతే, అమ్మగారు సీత. అందుకే ఈ ఇంటికి ‘అయోధ్య’ అని పేరు పెట్టారు’’ అని బంతి తెగ బిల్డప్ ఇస్తూ స్పీచ్ ఇచ్చాడు. వెంకీ కొంటెగా ‘‘ఈ అవుట్ హౌస్ పేరు లంకా?’’ అనడిగాడు. బంతికి బాగా కాలి, ‘‘ఏం జోకా? ఊరికే ఎర్రబస్సెక్కి వచ్చేస్తుంటారు’’ అని డైలాగేసేసి వెళ్లిపోయాడు.

   

 కిరాణా షాపు నుంచి సరుకులు తీసుకుని ఆటోలో దిగాడు బంతి. ఈ లగేజ్ అంతా మోసుకుని లోపలకెళ్లాలి. కొంచెం కష్టమే. ఎవడైనా బకరా దొరికితే బాగుణ్ణు.బంతి ఇలా అనుకుంటున్నాడో లేదో, ఎదురుగా వెంకీ వస్తున్నాడు. రెండు బరువైన బ్యాగులు చూపించి ‘‘ఏమీ అనుకోకపోతే ఈ రెండూ కొంచెం లోపల పెడతారా? మిగతా సరుకులు నేను తీసుకొస్తా’’ అనడిగాడు బంతి. పాపం వెంకీ జాలితో ఆ రెండు బ్యాగుల్నీ మోసుకుంటూ వెళ్లాడు. వెనుక బంతి చిన్న క్యాన్ తీసుకుని వస్తున్నాడు. హాలు దగ్గరకు రాగానే ఈ క్యాన్ వెంకీ చేతికిచ్చేసి, ఆ రెండు బ్యాగులూ తనే మోసుకుంటూ లోపలికెళ్లాడు. ఇలా చెమటలు కారుస్తూ బ్యాగులు మోస్తున్న బంతిని చూసి ఇంట్లో వాళ్లంతా తెగ జాలిపడిపోయారు.‘‘పాపం... ఎంత పని చేస్తున్నాడో! ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు!’’ అని బంతికి అందరూ కలిసి సర్టిఫికెట్లు ఇచ్చేశారు.ఇలా ఉంటాయండీ బంతి బిల్డప్పులు.

   

శ్రీనివాసమూర్తి ఇద్దరు కూతుళ్లకీ వెంకీ అంటే పడడం లేదు. బంతి ఇదే అదను అనుకుని వెంకీని ఓ పట్టు పడదామని అవుట్‌హౌస్‌కి వెళ్లాడు. లోపలంతా చిందరవందరగా ఉంది. ఎక్కడబడితే అక్కడ మాసిన బట్టలు, డ్రాయర్లు, సాక్స్‌లు. బంతికి కోపం వచ్చేసింది. ‘‘ఏంటిది?’’ ‘‘అది అడగడానికే వచ్చావా? ఫ్రిజ్జు’’ ‘‘నేనడుగుతోంది దాని గురించి కాదు. దాని మీద ఏంటది?’’ ‘‘సాక్సు’’ ‘‘ఫ్రిజ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశావ్?’’ ‘‘దండెం మీద ఖాళీ లేదు’’ ‘‘అంటే.. దండెం మీద ఖాళీ లేదని తాజ్‌మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తావా? అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు... జబ్బలు కనిపించేలా బనియన్లు... ఎక్స్‌పోజింగా? చూస్తున్నా... అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా’’ అంటూ బంతి తెగ చెలరేగిపోతున్నాడు. వెంకీ ఏం మాట్లాడకుండా వెళ్లి తలుపులేసేశాడు. ‘‘ఏంటి తలుపులేసేస్తున్నావ్. ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి’’ అని బంతి అనే లోపే, వెంకీ వచ్చి పీక పట్టుకుని గోడకేసి ఒక్క నొక్కు నొక్కాడు. అప్పటిదాకా తెగ బీరాలు పోయిన బంతిగాడు కాస్తా గాలి తీసిన బెలూన్‌లాగా అయిపోయి, ఊ ఊ... అని ఏడవడం మొదలెట్టాడు.



 ‘‘ఎందుకేడుస్తున్నావ్?’’ అడిగాడు వెంకీ. ‘‘కొడతారేమోనని’’ చెప్పాడు బంతి. అక్కడున్న బెల్ట్ తీసి గట్టిగా గాలిలో ఊపాడు. దాంతో కెవ్వుమని అరిచాడు బంతి. ‘‘ఏంటి నాన్నా! ముందే అరుస్తున్నావ్?’’ ‘‘తర్వాత అరవలేనేమోనని’’ అని దీనంగా చెప్పాడు బంతి.‘‘అసలేంట్రా నీ ప్రాబ్లమ్? రూమ్ నీట్‌గా లేదు. అంతే కదా! దానికింత గొడవెందుకు. నీకెలా కావాలో అలా రూమ్ సర్దుకో. ఇంతకూ షూస్ ఎక్కడుండాలి?’’ అనడిగాడు వెంకీ. బంతి కంగారుగా ‘‘స్టాండ్‌లో’’ అని చెప్పాడు. ‘‘సాక్స్?’’ ‘‘దండెం మీదుండాలి’’ ‘‘అండర్‌వేర్?’’ ‘‘ఎక్కడైనా ఉండొచ్చు’’ ‘‘మరి నువ్వు?’’ ‘‘కంట్రోల్‌లో ఉండాలి’’ ‘‘కరెస్ట్. నువ్వు చాలా మంచోడివిరా. నేను స్నానానికి వెళ్లొస్తా. ఈలోపు రూమ్ మొత్తం నీట్‌గా సర్దెయ్యాలి’’ అని టవల్ తీసుకుని బాత్‌రూమ్‌లోకెళ్లాడు వెంకీ. అతను బయటకొచ్చేలోపు రూమ్ మొత్తం తళతళలాడిపోతోంది. ఒక్క బంతి ఫేస్ తప్ప.

   

రామాయణంలో రాముడికి హనుమంతుడే కాదు. చిన్న ఉడుత కూడా సాయం చేసింది. ఇక్కడ కూడా అంతే. మన బంతిగాడి అతి తెలివితేటల వల్ల, ‘మిస్టర్’ కమ్యూనికేషన్ వల్ల వెంకీ దగ్గరకు వెళ్లాల్సిన ఫొటో, పెళ్లికొడుకు దగ్గరకెళ్లింది. దాంతో పెళ్లాగిపోయింది. వెంకీ, నందినిల ప్రేమ లీకయిపోయింది. ఫైనల్‌గా వెంకీ-నందిని ఒక్కటయ్యారు. దీనికంతటికీ అనుకోకుండా కారకుడైన బంతిగాణ్ణి మెచ్చుకోవాలి కదా! వెంకీ మెచ్చుకోలేదు సరికదా... కోపంగా దగ్గరకొచ్చి ‘‘బెల్ట్ పెట్టుకున్నావా?’’ అనడిగాడు.ఆ ప్రశ్నకే బంతిగాడిలో దడ... వణుకు... అన్నీనూ! ‘బాబోయ్’ అనుకుంటూ బయటకు ఒకటే గ్యాలప్.

 - పులగం చిన్నారాయణ

 

తమాషాగా ఉంటుందనే ‘బంతి’ పేరు పెట్టాం

‘నువ్వే కావాలి’లో సునీల్ కోసమే ఓ కేరెక్టర్ సృష్టించాం. ‘నువ్వు నాకు నచ్చావ్’లో మాత్రం ఈ పాత్రే సునీల్‌ను సెలక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇందులో పనివాడి పాత్రకు కొంచెం మూర్ఖత్వం, కొంచెం బోళాతనం కావాలి. ఆ రెండూ సునీల్ బాగా పండించగలడనిపించింది. ఇంటిలిజెంట్ ఇడియట్‌లాగా ఆ పాత్రలోని రకరకాల షేడ్స్‌ని బాగా ఆవిష్కరించాడు. ఆ పాత్రకు తమాషాగా ఉంటుందనే ‘బంతి’ అనే పేరు పెట్టాం. మామూలుగా పనివాళ్లను ఇంట్లోవాళ్లు అలా ఇలా ఆడుకుంటూ ఉంటారు కదా. ఏది ఏమైనా ఇంత చిన్న పాత్రను కూడా ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారంటే పాత్ర ఎంత సక్సెస్ అయ్యిందో అర్థమౌతోంది.

 - విజయ భాస్కర్, దర్శకుడు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top