సాక్షి, తాడేపల్లి: కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లేని మద్యం స్కాంలో కారుమూరి సునీల్‌ని అక్రమంగా అరెస్టు చేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘బీసీల అణచివేతకే సునీల్ అరెస్టు. అసలు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఏ అధికారైనా చెప్పారా?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.
కాగ్ లాంటి సంస్థలు ఏమైనా అభ్యంతరం తెలిపాయా?. శాఖాపరమైన విచారణ ఏమైనా జరిగిందా?. అవేమీ లేకుండానే విజిలెన్స్ విచారణకు ఎలా ఆదేశించారు?. సాయిశ్రీనివాస్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగానే గంటలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించటం దుర్మార్గం. దమ్ముంటే నారా లోకేషే ఫిర్యాదు చేయొచ్చుగా?. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఎపిసోడ్ జరుగుతుంది. ఫిర్యాదు, విచారణ ఎలా జరగాలో టీడీపీ ఆఫీసులోనే స్క్రిప్టు రెడీ అవుతోంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.
‘‘వైఎస్ జగన్ హయాంలో పారదర్శకంగానే రవాణా టెండర్లు జరిగాయి. తక్కువ ప్రైస్ చూపిన వారికే టెండర్లు దక్కాయి. అందులో నేరం ఏం ఉంది?. కేవలం కారుమూరి కుటుంబాన్ని వేధించటానికే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసులకు సోషల్ మీడియా కార్యకర్తలే భయపడలేదు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడతారా?’’ అంటూ నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు.


