మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
కర్నూలు (సెంట్రల్)/కల్లూరు: డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోందని.. కానీ, వాటిని ప్రశ్నించకూడదన్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉంటోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులోని కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నిస్తుంటే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో ర్యాలీలకు తెరతీశారన్నారు.
డీఎస్సీ–2025లో ఉద్యోగాలు పొందిన వారందరూ అక్రమ మార్గాల్లో పోస్టులు సాధించినట్లు తమ పార్టీ ఎక్కడా చెప్పలేదని బుగ్గన స్పష్టంచేశారు. అయితే వారు తమ పార్టీపై అభాండాలు వేస్తూ ర్యాలీల్లో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, ఏదో ఒక ఫెడరేషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుబాటవుతుందని ఆయన ప్రశ్నించారు. సర్టిఫికెట్లను రూ.15 లక్షలు నుంచి రూ.25 లక్షల వరకు అమ్ముకున్నారని, ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నదే తమ పార్టీ ఆరోపణ అన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేశ్ రాజీనామా చేసేవరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు.


