డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు | Massive irregularities in DSC recruitment | Sakshi
Sakshi News home page

డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు

Aug 10 2026 4:55 AM | Updated on Aug 10 2026 4:55 AM

Massive irregularities in DSC recruitment

వీటిపై కోర్టులో 330 రిట్‌ పిటిషన్లు 

ఇందులో 60 స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించినవే 

బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి 

స్పోర్ట్స్‌ కోటా, పేపర్‌ లీకేజీలపై సీబీఐ లేదా జ్యుడీషియల్‌ విచారణ చేయాలి 

విద్యార్థి, నిరుద్యోగ, యువజన జేఏసీ డిమాండ్‌

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఏపీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ కూటమి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ ఎంబేటి రామచంద్ర, నిరుద్యోగ జేఏసీ కో–కన్వినర్‌ రామ్‌ షా మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. అర్హతలు, పరీక్షలు లేకుండానే కొంతమందికి సబ్జెక్ట్‌ టీచర్‌ పోస్టులు కల్పించేందుకు జీఓ నెం.4ను తీసుకురావడం.. స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అవకతవకలు.. 1:1 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల పరిశీలన అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే..  

ఎందుకింత వివాదానికి తెరలేపారు? 
ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా కేటాయింపులు, జీఓ నెం.4 తెచ్చిన మార్పులు, పేపర్‌ లీకేజీ అనుమానాలు లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీపై కోర్టులో 330 రిట్‌ పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిలో 60కి పైగా స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించినవే. ఇంత వివాదానికి ఎందుకు తెరలేపారు? ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి. 

అసలు డీఎస్సీలో దాదాపు 32 వేల వినతిపత్రాలు, అభ్యంతరాలు ఎందుకొచ్చాయి? 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచారంటేనే ఉద్యోగం వస్తుందని అభ్యర్థులు ఆశపడతారు. కానీ, చివరికి స్పోర్ట్స్‌ కోటా పేరుతో వారిని బయటకు పంపడం ఎంతవరకు సమంజసం? డీఎస్సీకి సరిగ్గా ఒకరోజు ముందు (ఏప్రిల్‌ 19న) తీసుకొచ్చిన జీఓ.4 తీవ్ర వివాదాస్పదమైంది. ఎటువంటి పరీక్షలు, అర్హతలు లేకపోయినా సబ్జెక్ట్‌ టీచర్లుగా పోస్టులిచ్చేలా ఈ జీఓ తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఇలా ఎలా మినహాయింపులు ఇస్తారు?  

రహస్యంగా డీఎస్సీ ప్రక్రియ ముగింపు.. 
ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్, కటాఫ్‌ మార్కులు, సెలెక్షన్‌ లిస్టులను డిస్ట్రిక్ట్  సెలెక్షన్‌ కమిటీ హెడ్‌ క్వార్టర్లలో లేదా వెబ్‌సైట్‌లో బహిరంగంగా పెట్టలేదు. కేవలం వ్యక్తిగత లాగిన్స్, మొబైల్స్‌కు మాత్రమే సమాచారం పంపి గోప్యంగా ప్రక్రియ ముగించారు. ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహకుడి భార్యకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం వెనుక ఉన్న అంతర్గత లింకులు బయటకు రావాలి. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఐక్య కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement