నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీలు
చంద్రబాబు ప్రభుత్వ ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలు విజయవంతం
రిలే దీక్షల్లో జెన్–జీ కదంతొక్కడంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు
డీఎస్సీ అక్రమాలపై యువత, ప్రజల్లో రోజురోజుకూ పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు
అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్
డీఎస్సీలో ఘోరాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టు
తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు బెంబేలు
పోలీసులతో ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్ర
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు, యువత స్వచ్ఛందంగా ర్యాలీల్లో పాల్గొని సర్కారుకు తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీసింది.
దమనకాండను దాటుకుని రిలే దీక్షలు విజయవంతం
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేశారని... డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలపై చంద్రబాబు సర్కారు దమనకాండ సాగించింది. 175 నియోజకవర్గాల్లో గాంధేయ మార్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే టెంట్లను తొలగించేందుకు కుట్ర చేసింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలతో పాశవికంగా దాడులు చేయించడంతోపాటు పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడింది.
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీని ఈడ్చుకెళ్లడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, విజయవాడలో దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా దాడి చేయడం, ఆ పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న వర్గం బెదిరింపులకు దిగడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అయినప్పటికీ ఈ దీక్షలు విజయవంతం కావడం, జెన్–జీ(యువత) కదం తొక్కడంతో రోజురోజుకూ ఉద్యమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది.
అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్లు దీక్షా శిబిరాల్లో పెద్ద ఎత్తున వినిపించాయి. యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జెన్–జీ మండిపడింది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించింది.
ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాల్సిందే...
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో డీఎస్సీలో అక్రమాలకు పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత అభ్యర్థులు వెల్లడిస్తున్నందువల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ జెన్–జీ, రాష్ట్ర ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో తన తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్‌పై చంద్రబాబులో తీవ్ర ఆందోళన నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై జెన్–జీ, ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను డైవర్ట్ చేసేందుకు ఆయన కొత్త పన్నాగాలు పన్నుతున్నారు.
దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లుగా చంద్రబాబు చిత్రీకరించారు. అయినా యువత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘పోలీసులతో అడ్డుకున్నా... మాపై అక్రమ కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. రిలే దీక్షలు ముగిసినా సోమవారం 175 నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యవాదులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం’ అని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మలిదశ ఉద్యమంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను సోమవారం వైఎస్సార్‌సీపీ ప్రకటించనుంది.
శాంతియుత ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులు
ఇదిలా ఉండగా, వైఎస్సార్‌సీపీ ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆయా నియోజకవర్గ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా చేపట్టే ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని చట్టబద్ధంగా పోలీసులను వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.


