వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం | YS Jagan Slams Chandrababu Government Over Rajahmundry Doctor Priyanka’s Death, Demands Probe Into Police Lapses | Sakshi
Sakshi News home page

వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం

Aug 9 2026 10:52 PM | Updated on Aug 10 2026 9:42 AM

YS Jagan expresses concern over Priyanka death and fires on Chandrababu Govt

సీసీ కెమెరాల్లో దృశ్యాలు స్పష్టంగా ఉన్నా పోలీసుల నిర్లక్ష్యం.. యాక్సిడెంట్‌గా చూపి నిందితులను తప్పించేందుకు ప్రయత్నం 

పోలీసుల అలసత్వంపై విచారణ జరపాలి..

మద్యం, గంజాయికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా చంద్రబాబు తీరు.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్‌మాల్‌ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్‌ పేర్కొన్నారు. 

కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్‌ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్‌ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?
ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్‌ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.

తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్‌ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్‌ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్‌ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. 

మద్యం, గంజాయికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు..
వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలో­మీటర్‌కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్‌ అండ్‌ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్ర­బాబు తీరు ఉందని జగన్‌ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్‌ అనే తేడా లేకుండా మద్యం అందు­బాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్ప­డు­తోందని విమర్శించారు. డాక్టర్‌ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్‌ను తొలగిస్తోందని జగన్‌ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement