breaking news
Dr Priyanka
-
బడా బాబులైనా శిక్ష పడాల్సిందే...
‘‘ఒక్కరోజులో మా భవిష్యత్తు కళ్లెదుటనే కుప్పకూలిపోయింది. డాక్టరుగా పుట్టిన గడ్డకు ఎంతో సేవ చేయాలని తపించిన మా కూతురిని మాకు లేకుండా చేశారు. తప్పతాగి .. రోడ్ల మీదకు వచ్చి, ఇతరుల బిడ్డలను పొట్టన పెట్టుకోకండి..’’ అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకుంటున్నారు డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక, మూడు రోజుల క్రితం మద్యం మత్తులో కారుతో ఉన్మాదులు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, చేసిన వీరంగానికి బలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా అయిజ మండంలోని ఎక్లాస్పురంలో పుట్టి పెరిగిన పెరిగింది ప్రియాంక. దోషులకు శిక్ష పడాలని, సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వాలు తమ బిడ్డకు న్యాయం చేయాలని వెంకటేశ్, చంద్రమ్మలు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు..చదువులో టాపర్‌గా ఉండే ప్రియాంక మెడిసిన్‌లో ర్యాంకు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించింది.. మరికొన్నాళ్లలో పీజీ పూర్తి చేసి, వైద్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ‘‘కానీ ఆ కలలను కొందరు దుర్మార్గులు గద్దల్లా ఎత్తుకుపోయారు. మా అమ్మాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా మా అమ్మాయి తిరిగి రాదు. కానీ, వాళ్లను శిక్షిస్తేనే మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఉన్న ఊరును వదిలి, అయినవారందకీ దూరంగా పిల్లల చదువుల కోసం శ్రమిస్తాం. ఎంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నాం. కానీ, కొందరు తమ తండ్రులకు, కుటుంబాలకు పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనల్లో ఉంటారు. తాగినవాళ్లు ఇంటిదగ్గర ఉండకుండా బయట పెద్ద పెద్ద కార్లు వేసుకొని షికార్లు చేస్తారు. డబ్బు, హోదా ఉందనే పొగరు, సంపన్నులకు శిక్షలు ఉండవనే ధైర్యం వారిది. రాజకీయ పలుకుబడి ఉందనే ధీమా వారిది. కొవ్వెక్కి చేసిన పనులకు తగిన శిక్ష పడాలి. ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు. దోషులను కఠినంగా శిక్షించి, ఉరి తీయందే మా కడుపు మంట చల్లారదు’ అని తెలిపారు చంద్రమ్మ.చట్టపరంగా శిక్షించాల్సిందే..! వెంకటేష్ మాట్లాడుతూ –‘‘దోషులకు మరణ శిక్ష పడాల్సిందే. ఇలాంటి శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అప్పుడే మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు, ఆర్తనాదాలు ఉండవు. ఇంకా ఎంతమందికి ఇలాంటివి జరుగుతాయో. దోషులకు సరైన శిక్ష పడకపోతే ‘మేం ఏం చేసినా చెల్లుతుంది’ అని తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి పోకిరీగాళ్లు ‘మాకు ఏమవుతుందిలే, మా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది’ అనుకుంటారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తే భయం ఉంటుంది. ఇలాంటి దోషులకు మరణశిక్ష , యావజ్జీవ కారాగార శిక్ష పడితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. శిక్షలు కరెక్ట్‌గా అమలు అవ్వాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తాం అని పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి అన్యాయాలు జరగడం సరికాదని పదే పదే చెబుతున్నారు. కరెక్ట్‌గా శిక్షలు పడితే సరే, లేదంటే మా గొంతు, మా కడుపుకోత, మా బాధ రాజమండ్రి వేదికగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతూనే ఉంటాం. మాలాంటి ఎంతోమంది తల్లిదండ్రల మద్దతుతో అందరి ముం దుకు వస్తాం’’ అన్నారు వెంకటేష్.తీరని లోటు...తల్లితండ్రులు ఇద్దరూ తమ కూతురు గురించి వివరిస్తూ –‘‘మా ప్రియాంక ఎవరినీ నొప్పించేది కాదు. అందరితో కలివిడిగా ఉండేది. తొందరపడి ఎవరినీ ఎమీ అనేది కాదు. ప్రాపర్‌గా పనులు జరగాలి. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉండేది. మా ఊరు నుంచి కానీ, మా కుటుంబంలో కానీ ఎవరూ డాక్టర్లు లేరు. అలాంటిది ప్రియాంక డాక్టర్ అయి ఆ పేరు నేను నిలబెడతా అనేది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పీజీ సీటు కూడా మంచి ర్యాంకుతో తెచ్చుకుంది. ఎక్కడా ఒక్క రిమార్క్ లేదు. చదువు చక్కగా సాగుతున్న సమయంలో, మరో రెండేళ్లలో స్పెషలిస్ట్‌గా బయటకు వచ్చేది. ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరిగింది. మా జీవితాంతం తీరని లోటు మిగిలింది. మాకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిసినా ఊరుకోం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మా బిడ్డకు ఆత్మ శాంతి కలిగిస్తాం’’ అని తమ ఆవేదనను, ఆవేశాన్ని మన ముందు ఉంచారు వెంకటేష్, చంద్రమ్మలు. ఏ మాత్రం సహించం..మా కమ్యూనిటీలోనే డాక్టర్లు ఎవరూ లేరు. అమ్మాయిలను చదివించడం అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఏ కుటుంబంలోనూ 28 ఏళ్లుగా లేదు. ఇరవై ఏళ్లు రాగానే పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేస్తారు. అలాంటిది ప్రియాంకకు చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆమె కలకే ప్రాముఖ్యం ఇచ్చాం. తను మా ఊరుకు పెళ్లి చూపులకని వచ్చి, తిరిగి కాలేజీకి వెళ్లిపోయింది. ఇంకో ఆర్నెల్లలో పెళ్లి అవుతుందని, అమ్మాయి జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాం. ఊరు నుంచి వెళ్లిన ఒక్కరోజులోనే.. ‘మీ అమ్మాయి ప్రియాంకకు యాక్సిడెంట్ అయ్యింది, తీవ్ర రక్త స్రావం అవుతోంది’ అని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ఇన్నాళ్లూ తను పడిన కష్టానికి తగిన ఫలితం రాకుండానే దుర్మార్గులు మాకు దూరం చేశారు. తనకు సరైన న్యాయం జరగకపోతే ఏ మాత్రం సహించం. – చంద్రమ్మ, ప్రియాంక తల్లి– నిర్మలారెడ్డి, ఇన్పుట్స్ వాగు గడ్డ నరసింహారెడ్డి, సాక్షి, గద్వాల్ -
ప్రియాంక ఘటనలో ఎందుకీ గోప్యత? తెర వెనుక ఎవరు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడం.. రోజుల తరబడి మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందిన ఘటనలో ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ జవాబు లేనివిగానే కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఈ దారుణం రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ విషయం వెలుగులోకి రాలేదు. దీనికి తెర వెనుక అధికార పార్టీ నగర నాయకులు కథ నడిపారనే విమర్శలు వచ్చాయి. వారెవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ అపవాదును తుడుచుకునేందుకు అటు పోలీసులు, ఇటు నగర ప్రజాప్రతినిధులు పోటీ పడిన తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి, చావుబతుకుల్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె బంధువులు ఈ నెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సాక్షికి ఈ సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెర వెనుక వ్యక్తులెవరు? ఆ రోజు ప్రసాదిత్య మాల్ వద్ద సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఎడ్వర్డ్ మద్యం తాగి, తమ కారుతో ప్రియాంక ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగానే మూడుసార్లు ఢీకొన్నారు. అనంతరం, ఆమె తలపై నుంచి కారు ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘోరంపై అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఆ రోజు రాత్రి స్థానిక స్వతంత్ర ఆసుపత్రికి వెళ్లి, ఈ సంఘటనలో గాయపడిన ప్రియాంక స్నేహితుడి వాంగ్మూలం సేకరించారు. ప్రియాంకను ఢీకొన్న వెంటనే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన కారును పోలీసులు ఆ మర్నాడు కానీ సీజ్ చేయలేదు. తీవ్రమైన ఈ సంఘటన సమాచారాన్ని పోలీసులు తొలుత బహిర్గతం చేయలేదు. దీంతో, కొంత మంది కూటమి నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని చిన్న ప్రమాదంగా కూడా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీని వెనుక ఉన్న పెద్దలెవరనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఆ సమయంలో దర్యాప్తు అధికారికి వచ్చిన ఫోన్లపై సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదం పెద్దది అవుతూండటంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుల్ని అరెస్టు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్ వద్ద ప్రదర్శనకు పెట్టారు. ఆ సమయంలో కారు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయతి్నంచారనే విషయం స్పష్టమవుతోంది. ప్రసాదిత్య మాల్లో సీసీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదై ఉండకపోతే ఈ సంఘటన వెలుగులోకే వచ్చేది కాదని పలువురు అంటున్నారు. ఒకరిపై ఒకరు నింద వేస్తూ.. కారు ఢీకొన్న సమయంలో అక్కడే కొందరు మీడియా ప్రతినిధులున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వారెవరనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. నిందితుల్లో ఒకరు విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణ ఘటనలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను చిన్నదిగా చూపించేందుకు ఎవరి ప్రయత్నం వారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రియాంక తండ్రి విలేకర్లతో మాట్లాడిన రోజే ఆయనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడిగా హైదరాబాద్‌కు వెంట పెట్టుకుని వెళ్లారని, దీనిలో ఆంతర్యమేమిటనే ప్రశ్న కూడా జవాబు లేనిదిగానే మిగిలింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకేనా హైదరాబాద్‌కు?కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స అందించారు. ఈ దారుణాన్ని సాక్షి మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం, సోషల్ మీడియాలో కారు ఢీకొన్న ఘటన వీడియో క్లిప్పింగ్‌లు హల్చల్ చేయడంతో విద్యార్థి వర్గాలు ఆవేదన, ఆపై ఆగ్రహంతో రగిలిపోయాయి. ఇది మరింత ముదిరి ఆందోళనకు దారి తీస్తుందనే భయంతోనే ప్రియాంకను మెరుగైన చికిత్స పేరుతో హైదరాబాద్‌కు పంపించారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రధాన ఆసుపత్రి అయిన జీఎల్ఎస్ ట్రస్టు ఆ మాత్రం వైద్యం అందించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి తరలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు.. బోరుమన్న ఎక్లాస్పూర్
కన్నవారి కలలు.. కల్లలుఉన్నత చదువులు చదివిన కూతురు.. త్వరలోనే ప్రయోజకురాలై వస్తుందనుకున్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. చెదిరిన.. చదువుల తల్లి ఆశలు బాగా చదువుకోవాలి.. డాక్టర్ కావాలి.. నిరుపేదలకు సేవ చేయాలి.. అనుకున్న ఆ చదువుల తల్లి ఆశలు చెదిరిపోయాయి.ఎక్లాస్పూర్.. కన్నీరుమున్నీరు మా ఊరి బిడ్డ ఉన్నత చదువులు చదువుతోంది.. భవిష్యత్‌లో పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటుందనుకున్న ఎక్లాస్పురం.. ఆ వైద్య విద్యార్థిని మాంసపు ముద్దగా తిరిగిరావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకను దురదృష్టం వెంటాడింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన చదువుల తల్లి చివరికి ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఎక్లాస్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చారు. అయిజలో అంతిమ యాత్ర.. ప్రియాంక మృతదేహాన్ని వైకుంఠ రథంపై అయిజ పట్టణంలో ఊరేగించారు. అంతిమయాత్రలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రియాంక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతిమ యాత్రలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అఖిలపక్ష నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి.. ఏపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని, ప్రభుత్వం సత్వరమే స్పందించి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కృషిచేసి ఉంటే ప్రియాంక బతికి ఉండేదని అఖిలపక్ష పారీ్టల నాయకులు, గ్రామస్తులు మండిపడ్డారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని ఏపీ ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బోరుమన్న ఎక్లాస్పూర్.. వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం స్వగ్రామం ఎక్లాస్పూర్కు చేరుకోగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వైద్యురాలివై పేదలకు సేవ చేస్తావని ఆశిస్తే.. మృత్యువుతో పోరాడి మాంసపు ముద్దగా తిరిగొచ్చావా అంటూ కన్నీరుమున్నీ రుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలను సంప్రదాయపరంగా చేశారు. సొంత పంట పొలంలో మృతదేహాన్ని మట్టిలో కలిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రియాంక తండ్రి వెంకటేష్‌కు రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం
తూర్పు గోదావరి జిల్లా: జీఎస్ఎల్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ కళాశాలలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. పీజీలో డెర్మటాలజీ ఫస్టియర్ చదువుతున్న ఆమె ఇకలేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని, ఆమె కుటుంబానికి మనోధైర్యాన్ని అందించి, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని దేవుడిని ప్రార్థించారు. ఆఖరి నిమిషం వరకు ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆమె చిత్రపటం వద్ద సహ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని జీఎస్ఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి ఈడీ డాక్టర్ గన్ని సాధిక ద్వారా త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గన్ని సారిక, డాక్టర్ సీతారామ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ సుభాషిణి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతిపై వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
వ్యవస్థలు నిర్వీర్యం.. ప్రియాంక కేసే నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో నిర్వీర్యమైపోయాయో రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి ఘటన మరోసారి రుజువు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఓ షాపింగ్‌మాల్ గేటు బయట ఘటన జరిగినా, నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసినా పోలీసులు వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారని జగన్ పేర్కొన్నారు. కానీ, ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, నిందితులను కూడా వదిలేసి చేతులు దులుపుకోవడం అత్యంత దారుణమన్నారు. నిందితులు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారుతో ఢీకొట్టడమే కాకుండా, ఆ తర్వాత కూడా అమానవీయంగా ప్రవర్తించారని జగన్ ఆరోపించారు. బాధితురాలి మీదుగా కారు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎందుకు ఇంత అలసత్వంగా వ్యవహరించిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సామాన్యుల కేసుల్లో చట్టం ఎందుకు పనిచేయదు?ప్రతిపక్ష నేతలపైనా, ప్రశ్నించేవారిపైనా, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిపైనా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టప్రకారం వ్యవహరించడంలో ఘోరంగా విఫలమవుతోందని జగన్ విమర్శించారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయ వేధింపులు, కక్షసాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కూడా రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి కారణమని ఆరోపించారు.తల్లిదండ్రుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలిఎన్నో త్యాగాలు, కష్టాలను ఎదుర్కొని కుమార్తెను డాక్టర్‌గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు.. ఆమె ఎండీ చదువులు పూర్తి చేసి పదిమందికి వైద్య సేవలందించే స్థాయికి ఎదుగుతున్న సమయంలోనే తీవ్ర విషాదం ఎదురుకావడం అత్యంత బాధాకరమని జగన్ పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ప్రియాంక కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులందరినీ సమానంగా చూడాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అనే ధోరణులను తీసుకురావడం వల్లే వ్యవస్థల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు..వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం దుకాణాలు, ప్రతి వీధి చివర బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యం, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు. గుడి, బడి, బీచ్ అనే తేడా లేకుండా మద్యం అందుబాటును పెంచడం వల్లే ఇలాంటి ఘటనలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని విమర్శించారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో ఆ కంటెంట్‌ను తొలగిస్తోందని జగన్ ఆరోపించారు. -
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
జాతి సిగలో నగర కీర్తి
► సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మెరిసిన మనోళ్లు ► ఉభయ రాష్ట్రాల్లో ఉత్తమ ర్యాంకు నగరవాసికే సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నగర ఆణిముత్యం మెరిసింది. నగర ‘కీర్తి’ని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 14 వర్యాంకు సాధించిన సీహెచ్.కీర్తి అత్యుత్తమ ప్రతిభను చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ర్యాంకే అత్యుత్తమం కావడం విశేషం. వైజాగ్‌కు చెందిన కీర్తి కుటుంబం పదేళ్ల కిందటే నగరానికి వచ్చి స్థిరపడింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ నగరంలోనే అభ్యసించిన ఆమె.. ఉత్తమ ర్యాంకు వచ్చే వరకు విశ్రమించలేదు. రెండు సార్లు ఓ మాదిరి ర్యాంకు పొందినా అసంతృప్తే వెంటాటింది. మరింత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని చదివి మూడో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకును అందుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. ఈ తరహాలోనే మరిన్ని ర్యాంకులు నగరాన్ని వరించాయి. నగరానికి చెందిన యువతీ యువకులే కాకుండా.. ఇక్కడ శిక్షణ పొందిన వారు మెరిశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా శిక్షణ కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి... విజయ కీర్తి పతాకం ఎగురవేశారు. నగరానికి చెందిన ఎడ్మ రిషాంత్‌రెడ్డికి 180, ప్రవళిక 232, ఉప్పల్‌కు చెందిన డాక్టర్ ప్రియాంక 529వ ర్యాంకు సాధించారు. వివిధ జిల్లాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. వందలోపు ర్యాంకులు సాధించిన వల్లూరి క్రాంతి (65వ ర్యాంకు), సీహెచ్. రామకృష్ణ (84వ ర్యాంకు)లు కూడా ఇతర జిల్లాల వారే. ఇలా వెయ్యిలోపు 50కిపైగా ర్యాంకులు పొందిన వారు నగరంలోని శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న వారేనని ఆయా ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. స్టడీ సెంటర్ల కేంద్రాల నిర్వాహకులు, ర్యాంకులు పొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.


