బడా బాబులైనా  శిక్ష పడాల్సిందే... | sakshi interview with Dr Priyanka parents Venkatesh and Chandramma | Sakshi
Sakshi News home page

బడా బాబులైనా  శిక్ష పడాల్సిందే...

Aug 13 2026 1:04 AM | Updated on Aug 13 2026 1:04 AM

sakshi interview with Dr Priyanka parents Venkatesh and Chandramma

న్యాయం కోసం...

‘‘ఒక్కరోజులో మా భవిష్యత్తు కళ్లెదుటనే కుప్పకూలిపోయింది. డాక్టరుగా పుట్టిన గడ్డకు ఎంతో సేవ చేయాలని తపించిన మా కూతురిని మాకు లేకుండా చేశారు. తప్పతాగి .. రోడ్ల మీదకు వచ్చి, ఇతరుల బిడ్డలను పొట్టన పెట్టుకోకండి..’’ అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకుంటున్నారు డాక్టర్‌ ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ.  

రాజమండ్రి జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్‌ ప్రియాంక, మూడు రోజుల క్రితం మద్యం మత్తులో కారుతో ఉన్మాదులు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, చేసిన వీరంగానికి బలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్‌ జిల్లా అయిజ మండంలోని ఎక్లాస్‌పురంలో పుట్టి పెరిగిన పెరిగింది ప్రియాంక. దోషులకు శిక్ష పడాలని, సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వాలు తమ బిడ్డకు న్యాయం చేయాలని వెంకటేశ్, చంద్రమ్మలు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు..

చదువులో టాపర్‌గా ఉండే ప్రియాంక మెడిసిన్‌లో ర్యాంకు తెచ్చుకొని ఫ్రీ సీట్‌ సంపాదించింది.. మరికొన్నాళ్లలో పీజీ పూర్తి చేసి, వైద్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 

‘‘కానీ ఆ కలలను కొందరు దుర్మార్గులు గద్దల్లా ఎత్తుకుపోయారు. మా అమ్మాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా మా అమ్మాయి తిరిగి రాదు. కానీ, వాళ్లను శిక్షిస్తేనే మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఉన్న ఊరును వదిలి, అయినవారందకీ దూరంగా పిల్లల చదువుల కోసం శ్రమిస్తాం. ఎంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నాం. 

కానీ, కొందరు తమ తండ్రులకు, కుటుంబాలకు పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనల్లో ఉంటారు. తాగినవాళ్లు ఇంటిదగ్గర ఉండకుండా బయట పెద్ద పెద్ద కార్లు వేసుకొని షికార్లు చేస్తారు. డబ్బు, హోదా ఉందనే పొగరు, సంపన్నులకు శిక్షలు ఉండవనే ధైర్యం వారిది. రాజకీయ పలుకుబడి ఉందనే ధీమా వారిది. కొవ్వెక్కి చేసిన పనులకు తగిన శిక్ష పడాలి. ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు. దోషులను కఠినంగా శిక్షించి, ఉరి తీయందే మా కడుపు మంట చల్లారదు’ అని తెలిపారు చంద్రమ్మ.

చట్టపరంగా శిక్షించాల్సిందే..! 
వెంకటేష్‌ మాట్లాడుతూ –‘‘దోషులకు మరణ శిక్ష పడాల్సిందే. ఇలాంటి శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అప్పుడే మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు, ఆర్తనాదాలు ఉండవు. ఇంకా ఎంతమందికి ఇలాంటివి జరుగుతాయో. దోషులకు సరైన శిక్ష పడకపోతే ‘మేం ఏం చేసినా చెల్లుతుంది’ అని తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి పోకిరీగాళ్లు ‘మాకు ఏమవుతుందిలే, మా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది’ అనుకుంటారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తే భయం ఉంటుంది. 

ఇలాంటి దోషులకు మరణశిక్ష  , యావజ్జీవ కారాగార శిక్ష పడితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. శిక్షలు కరెక్ట్‌గా అమలు అవ్వాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తాం అని పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి అన్యాయాలు జరగడం సరికాదని పదే పదే చెబుతున్నారు. కరెక్ట్‌గా శిక్షలు పడితే సరే, లేదంటే మా గొంతు, మా కడుపుకోత, మా బాధ రాజమండ్రి వేదికగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతూనే ఉంటాం. మాలాంటి ఎంతోమంది తల్లిదండ్రల మద్దతుతో అందరి ముం దుకు వస్తాం’’ అన్నారు వెంకటేష్‌.

తీరని లోటు...
తల్లితండ్రులు ఇద్దరూ తమ కూతురు గురించి వివరిస్తూ –‘‘మా ప్రియాంక ఎవరినీ నొప్పించేది కాదు. అందరితో కలివిడిగా ఉండేది. తొందరపడి ఎవరినీ ఎమీ అనేది కాదు. ప్రాపర్‌గా పనులు జరగాలి. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉండేది. మా ఊరు నుంచి కానీ, మా కుటుంబంలో కానీ ఎవరూ డాక్టర్లు లేరు. అలాంటిది ప్రియాంక డాక్టర్‌ అయి ఆ పేరు నేను నిలబెడతా అనేది. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పీజీ సీటు కూడా మంచి ర్యాంకుతో తెచ్చుకుంది. 

ఎక్కడా ఒక్క రిమార్క్‌ లేదు. చదువు చక్కగా సాగుతున్న సమయంలో, మరో రెండేళ్లలో స్పెషలిస్ట్‌గా బయటకు వచ్చేది. ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరిగింది. మా జీవితాంతం తీరని లోటు మిగిలింది. మాకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిసినా ఊరుకోం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మా బిడ్డకు ఆత్మ శాంతి కలిగిస్తాం’’ అని తమ ఆవేదనను, ఆవేశాన్ని మన ముందు ఉంచారు వెంకటేష్, చంద్రమ్మలు. 

ఏ మాత్రం సహించం..
మా కమ్యూనిటీలోనే డాక్టర్లు ఎవరూ లేరు. అమ్మాయిలను చదివించడం అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఏ కుటుంబంలోనూ 28 ఏళ్లుగా లేదు. ఇరవై ఏళ్లు రాగానే పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేస్తారు. అలాంటిది ప్రియాంకకు చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆమె కలకే ప్రాముఖ్యం ఇచ్చాం. తను మా ఊరుకు పెళ్లి చూపులకని వచ్చి, తిరిగి కాలేజీకి వెళ్లిపోయింది. ఇంకో ఆర్నెల్లలో పెళ్లి అవుతుందని, అమ్మాయి జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాం. ఊరు నుంచి వెళ్లిన ఒక్కరోజులోనే.. ‘మీ అమ్మాయి ప్రియాంకకు యాక్సిడెంట్‌ అయ్యింది, తీవ్ర రక్త స్రావం అవుతోంది’ అని ఫోన్‌ వచ్చింది. ఆ తర్వాత బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని చెప్పారు. ఇన్నాళ్లూ తను పడిన కష్టానికి తగిన ఫలితం రాకుండానే దుర్మార్గులు మాకు దూరం చేశారు. తనకు సరైన న్యాయం జరగకపోతే ఏ మాత్రం సహించం. 
– చంద్రమ్మ, ప్రియాంక తల్లి

– నిర్మలారెడ్డి, 
ఇన్‌పుట్స్‌ వాగు గడ్డ నరసింహారెడ్డి, సాక్షి, గద్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement