నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సిల నుంచి దాదాపు 80 లక్షల వ్యక్తిగత, పూచీకత్తులేని రుణాలు తీసుకుని, గత మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్, చిన్న స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాను. ప్రస్తుతం నా నెలవారీ ఈఎంఐలు నా జీతం కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి కూడా ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదు. వచ్చే నెల నుంచి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి బ్యాంకు వారు వేధిస్తారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుపగలరు?
– నరేష్, హైదరాబాదు
రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు లోను కట్టని పక్షంలో రుణదాత/బ్యాంకు ముందుగా డిమాండ్ నోటీసు పంపవచ్చు. అలాంటి నోటీసు వచ్చినప్పుడు, మీ నిజమైన ఆర్థిక పరిస్థితిని వివరించి, చెల్లింపు కోసం సహేతుకమైన గడువు లేదా రాజీ కోరుతూ సమాధానం ఇవ్వండి. నిజానికి అంతవరకూ వేచి చూడకుండా మీరే ముందుగా బ్యాంకు వారితో, ఎన్‌బీఎఫ్‌సిలతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. సమస్యను దాచిపెట్టకుండా, మీ ఆర్థిక పరిస్థితిని లిఖితపూర్వకంగా తెలియజేయడం ఉత్తమ మార్గం. మీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, స్టాక్ ట్రేడింగ్‌లో జరిగిన నష్టాలను వివరించి, ఈఎంఐల పునర్వ్యవస్థీకరణ, వాయిదాల పునర్నిర్ణయం లేదా ఒకేసారి రాజీ వంటి అవకాశాలను పరిశీలించాలని అభ్యర్థించండి.
బ్యాంకులు ప్రతి కేసును దాని పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తాయి. మీకు కావాల్సిన విధంగా ఇవ్వాలి అనే రూల్ లేదు. రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, బ్యాంకువారు వసూళ్లకు ఇబ్బంది పెడతారు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్‌బీఐ జారీ చేసిన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్, రికవరీ ఏజెంట్ల ప్రవర్తనా మార్గదర్శకాల ప్రకారం, రుణగ్రహీతను బెదిరించడం, అవమానించడం, బలవంతంగా వసూలు చేయడం లేదా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతి లేదు.
అలాంటి పరిస్థితుల్లో సంబంధిత బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సి ఫిర్యాదు వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అవసరమైతే పోలీసులకు లేదా ఆర్‌బీఐ సమగ్ర ఫిర్యాదు వ్యవస్థ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఖచ్చితంగా వసూలు చేయాలని కానీ, అందుకు వేధించడాన్ని కానీ చట్టం ఒప్పుకోదు. కేసులు వేసినాక కూడా బ్యాంకు వారితో రాజీ కుదుర్చుకోవచ్చు. నోటీసులు లేదా కోర్టు ప్రక్రియ ప్రారంభమైనా, చట్టబద్ధమైన సమాధానం ఇవ్వడం, సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)


