మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు | Another Rs 3800 crore budget debt on Tuesday | Sakshi
Sakshi News home page

మంగళవారం ఖాతాలో మరో రూ.3,800 కోట్లు

Aug 12 2026 5:17 AM | Updated on Aug 12 2026 5:18 AM

Another Rs 3800 crore budget debt on Tuesday

రోజుకు రూ.472 కోట్లు అప్పు చేస్తున్న బాబు సర్కార్‌ 

రాష్ట్రంపై నెలకు రూ.14,160 కోట్లు రుణభారం 

26 నెలల్లోనే రూ.3,68,126 కోట్లకు చేరిన అప్పులు

సాక్షి, అమరావతి: సంక్షేమం, ఎన్నికల హామీల ఊసు విస్మరించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట అనే తేడా లేకుండా దొరికిన చోటల్లా అప్పులు చేయడమే ధ్యేయంగా సాగుతున్నారు. ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర రాబడిని మాత్రం పెంచడం లేదు. 26 నెలల పాలనలో చంద్రబాబు సర్కారు రోజుకు దాదాపు రూ.472 కోట్లు, నెలకు సుమారు రూ.14,160 కోట్లు చొప్పున అప్పులు చేసింది. 

తాజాగా మంగళవారం మరో రూ.3,800 కోట్లు బడ్జెట్‌ అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట, రాజధాని పేరుతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు ఏకంగా రూ.3,68,126 కోట్లకు చేరాయి.  

చేబదుళ్లకు సైతం వడ్డీలు..! 
కాగ్, ఆర్‌బీఐ గణాంకాల మేరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్‌ అప్పులే రూ.2,06,415 కోట్లకు చేరాయి. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్ధల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,14,024 కోట్లకు చేరాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.47,687 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా రోజూ ఆర్‌బీఐ నుంచి చేబదుళ్లు, ఓడీలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. 

చేబదుళ్లకు కూడా వడ్డీలను చెల్లిస్తున్నట్లు ఇటీవల కాగ్‌ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంత అప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాటే లేదు. నిరుద్యోగులకు హామీ మేరకు భృతిగానీ ఉద్యోగాలుగానీ ఇవ్వలేదు. సూపర్‌ సిక్స్, సెవెన్‌ హామీలు గాలికి ఎగిరిపోయాయి. మరోపక్కఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్‌ పరం చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా పీపీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement