సముద్రం నుంచి అంతరిక్షం వరకు చైనా సీక్రెట్ సెన్సార్లు! | Chinas Global Espionage How the Dragon Spies Across Oceans Cyber Space and Skies | Sakshi
Sakshi News home page

సముద్రం నుంచి అంతరిక్షం వరకు చైనా సీక్రెట్ సెన్సార్లు!

Aug 12 2026 7:19 AM | Updated on Aug 12 2026 7:26 AM

Chinas Global Espionage How the Dragon Spies Across Oceans Cyber Space and Skies

సముద్ర గర్భం నుంచి అత్యాధునిక అంతరిక్షం వరకు చైనా సాగిస్తున్న గూఢచర్య కార్యకలాపాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. బ్రిటన్ నావికాదళం ఉపయోగిస్తున్న నిఘా డ్రోన్ల ద్వారా కీలక డేటా నేరుగా బీజింగ్‌కు చేరడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. అమెరికా, తైవాన్‌, జపాన్ సహా అనేక యూరోపియన్ దేశాలు డ్రాగన్‌పై ఇప్పటికే ఇలాంటి ఆరోపణలే చేశాయి. ఈ నేపథ్యంలో చైనా గూఢచర్య నెట్‌వర్క్ ఎందుకు అంత శక్తివంతంగా మారుతోంది? సముద్రాలు, సైబర్ స్పేస్, ఆకాశాన్ని డ్రాగన్ ఎలా ఆయుధాలుగా మలుచుకుంటోంది?

బ్రిటన్ డ్రోన్లలో చైనా గుట్టు రట్టు!
బ్రిటన్ నావికాదళం నిఘా కోసం వినియోగిస్తున్న 'క్రాకెన్ కే3 స్కౌట్‌' డ్రోన్లలో భారీ భద్రతా లోపం బయటపడింది. 'ది టెలిగ్రాఫ్' నివేదిక ప్రకారం, ఈ డ్రోన్లు పంపుతున్న ఆన్‌లైన్ హార్ట్‌బీట్ కమ్యూనికేషన్ డేటా నేరుగా చైనాలోని ఐపీ (ఐపీ) చిరునామాలకు మళ్లించినట్లు తేలింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం బ్రిటన్ రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేసింది. కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా అమెరికా, తైవాన్, జపాన్ దేశాలు కూడా చైనాపై ఇలాంటి నిఘా ఆరోపణలను చాలా కాలంగా మోపుతున్నాయి.

చైనా నేషనల్ ఇంటెలిజెన్స్ చట్టం కారణంగా..
పాశ్చాత్య దేశాల నిఘా వర్గాలు చైనాపై చేస్తున్న ఆరోపణలకు 2017 నాటి చైనా జాతీయ నిఘా చట్టమే ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఈ వివాదాస్పద చట్టం ప్రకారం... చైనాలోని ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు దేశ నిఘా అవసరాలకు సహకరించడం చట్టబద్ధంగా తప్పనిసరి. దీనివల్ల చైనాకు చెందిన రీసెర్చర్లు, కార్పొరేట్ కంపెనీలు తమకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్‌ఫర్మేషన్ సేకరించాల్సి వస్తోందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్‌ఏ) న్యాయ శాఖ పదేపదే స్పష్టం చేశాయి.

సముద్ర గర్భాన్ని నిఘా కేంద్రంగా..
సాధారణంగా సముద్రంలో గూఢచర్యం చేయడం అత్యంత కష్టతరమైన పనిగా భావిస్తారు. అయితే చైనా మాత్రం మహాసముద్రాలనే తన ప్రధాన ఆయుధంగా మార్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం... గడిచిన ఐదేళ్లలో పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాలలో కనీసం 42 చైనా పరిశోధనా నౌకలు సముద్ర అంతర్భాగంపై సర్వేలు నిర్వహించాయి. అమెరికన్ నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సముద్ర గర్భపు మ్యాపింగ్ ద్వారా భవిష్యత్తులో తమ సబ్‌మెరైన్‌లను సులభంగా దాచడానికి, సముద్ర అడుగున సీక్రెట్ సెన్సార్లు, ఆయుధాలను మోహరించడానికి చైనా ప్లాన్ చేస్తోంది.

సైబర్ స్పేస్ ద్వారా డిజిటల్ దండయాత్ర
భౌతిక సరిహద్దులతో సంబంధం లేకుండా వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని దాడులు చేసేందుకు చైనా సైబర్ స్పేస్‌ను శక్తివంతమైన అస్త్రంగా మలచుకుంది. ఫిషింగ్, మాల్వేర్ దాడుల ద్వారా లక్షిత సంస్థల ఉద్యోగులను మోసగించి అత్యంత సున్నితమైన పాస్‌వర్డ్‌లు, రహస్య ఫైళ్లను హ్యాకర్లు తస్కరిస్తున్నారు. అమెరికన్ ఏజెన్సీలు  వెల్లడించిన నివేదిక ప్రకారం... చైనాకు చెందిన 'వోల్ట్ టైఫూన్' అనే హ్యాకర్ గ్రూప్ అమెరికా రవాణా, ఇంధనం, జలవనరుల వంటి క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి చొరబడి సంవత్సరాల తరబడి రహస్యంగా నిఘా ఉంచింది.

అంతరిక్షంలో నిఘా.. గూఢచార బెలూన్లు
చైనా తన శాటిలైట్ నెట్‌వర్క్‌ను అనూహ్యంగా విస్తరిస్తూ సిగ్నల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామిగా మారుతోంది. శత్రు దేశాల రేడియో సంభాషణలు, మిస్సైల్ సిస్టమ్స్, రాడార్ల ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ను శాటిలైట్లు, డ్రోన్ల సహాయంతో చైనా ఇట్టే పసిగట్టగలదు. దీనికితోడు 2023 జనవరిలో అమెరికా గగనతలంలో ప్రత్యక్షమైన భారీ చైనా స్పై బెలూన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి, నేరుగా బీజింగ్‌కు చేరవేయగలగడం రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేసింది.

తాము కూడా బాధితులమే అంటున్న చైనా వాదన
పశ్చిమ దేశాల ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. చైనా రక్షణ, గూఢచార సంస్థ ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ’ ప్రకారం... చైనా ఎవరిపై గూఢచర్యం చేయడం లేదు, స్వయంగా తామే అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ)సైబర్ దాడికి బలవుతున్నామని వాదిస్తోంది. విదేశీ మొబైల్ బ్రాండ్లలోని లోపాలను ఆసరాగా చేసుకుని అమెరికా సంస్థలు తమ సిబ్బంది ఫోన్లను హ్యాక్ చేశాయని, కీలకమైన రక్షణ, ఇంధన రంగ సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడ్డాయని చైనా గట్టిగా ఆరోపిస్తోంది.

ఇది కూడా చదవండి: 23న ఏకంగా 377 పెళ్లిళ్లు.. ‘గురువాయూర్‌’లో సరికొత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement