రెండేళ్ల క్రితం ఆరోపణలు వెలుగులోకి
విస్తృత పరిశీలన తరువాత కొట్టివేతకు డీఓజే సిఫారసు
ఆమోదించిన న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి..
న్యూయార్క్/న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన క్రిమినల్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కేసును అక్కడి ఫెడరల్ కోర్టు విచారణ జరక్కుండానే శాశ్వతంగా కొట్టివేసింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ కుట్రలకు సంబంధించిన మూడు నేరాలను కొట్టివేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) దాఖలు చేసిన రూల్ 48(ఏ)ను న్యూయార్క్ డి్రస్టిక్ట్ జడ్జి నికొలస్ గరౌఫిస్ ఆమోదించడంతో అదానీ, అల్లుడు సాగర్‌లు నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే ఇంకో రెండు నేరాలకు సంబంధించిన తీర్పులను న్యాయమూర్తి రిజర్వ్‌లో ఉంచడం గమనార్హం. ఈ రెండు కేసులూ విచారణకు హాజరుకాని నిందితులకు సంబంధించినవి. కేసు కొట్టివేత అన్నది ప్రాసిక్యూషన్ విచక్షణాధికారంపై ఆధారపడి ఇచ్చిన తీర్పు మాత్రమేనని, వారిపై ఉన్న ఆరోపణలపై తీర్పు మాత్రం కాదని న్యాయమూర్తి తన 47 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఈ తీర్పును కేసు కొట్టివేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో న్యాయస్థానం ఏకీభవించినట్లుగా భావించరాదని, కేసులోని మెరిట్స్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయంగా కూడా పరిగణించకూడదు’’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును శాశ్వతంగా కొట్టి వేయడంపై గౌతమ్ అదానీ స్పందిస్తూ... ‘నిజం గెలిచింది’అని వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణానికి, దీర్ఘకాలంలో సంపద సృష్టికి కంపెనీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రెండేళ్ల క్రితం అదానీ కంపెనీపై, అల్లుడు సాగర్‌లు 200 కోట్ల డాలర్ల లాభాలు తేగల సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు సుమారు 26.5 కోట్ల డాలర్లు చెల్లించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారు అమెరికాలో 400 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన వారిని తప్పుదారి పట్టించారని కూడా 2024 నవంబరులో బయటపడ్డ ఇండైట్‌మెంట్ ద్వారా తెలిసింది. సాక్ష్యాలను ధ్వంసం చేసి, ఫెడరల్ దర్యాప్తు అధికారులకు అబద్ధాలు చెప్పారని కూడా వీరిపై ఆరోపణలు వచ్చాయి. అయితే అదానీ గ్రూప్ అవన్నీ ఆధారాల్లేని ఆరోపణలని ఖండించింది. అయితే విస్తృత పరిశీలన తర్వాత డీఓజే కేసు కొట్టివేయాలని నిర్ణయించింది. ఈ ఆరోపణలపై భారత అధికారులు కూడా విచారించారని, ఇన్వెస్టర్లకు ఎటువంటి నష్టం జరగలేదని తేల్చారని కోర్టుకు తెలిపింది. జో బైడెన్ ప్రభుత్వం హయాం ముగిసే సమయంలో అదానీ గ్రీన్‌పై ఆరోపణలను బహిర్గతం చేశారని, కేసు విచారణ దశకు చేరే అవకాశం లేకపోయినా రాజకీయ కుట్రలో భాగంగా దీన్ని చేపట్టారని కూడా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
డీఓజే వాదనలతో ఏకీభవించని కోర్టు...
అయితే డీఓజే వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. డీఓజే కేసు కొట్టివేత నిర్ణయానికి రావడం అసాధారణంగా ఉందని వ్యాఖ్యానించారు. చూపిన కారణాలు కూడా సహేతుకంగా లేవని స్పష్టం చేశారు. భారతీయ అధికారులు చెప్పినట్లు డీఓజే చెబుతున్న వ్యాఖ్యలు నిందితులకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లుగా లేదని ఈ కేసు పూర్తిగా విదేశాలకు సంబంధించిందన్న వాదనను కూడా కొట్టివేశారు. కేసుకు సంబంధించిన లావాదేవీలు కూడా అమెరికా సెక్యూరిటీస్ పరిధిలోకి రాదన్న డీఓజే వాదనను కూడా తిరస్కరించిన న్యాయమూర్తి అమెరికాలోని పెట్టుబడిదారులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఇండైట్‌మెంట్‌లోనే ఉందని గుర్తు చేశారు. అదానీ గ్రీన్ బాండ్లు, రుణ పత్రాల్లో లంచాలు, అవినీతిని సహించేది లేదని, చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంతర్గత వ్యవస్థలు ఉన్నాయన్న వాదనతో మాత్రం ఏకీభవించింది కానీ ఇవి ఏ రకమైన చర్యలు తీసుకునేందుకూ అవకాశం లేని మాటలు మాత్రమేనని, కంపెనీలు సర్వ సాధారణంగా ఇచ్చే హామీలని వివరించింది.
కేసు కొట్టివేతకు డీఓజే స్వతంత్రంగానే నిర్ణయం తీసుకుందని, తాము ఎలాంటి హామీ, ఆఫర్, క్విడ్ ప్రో కో లేదా రహస్య అంగీకారానికి రాలేదని నిందితుల నుంచి రాతపూర్వక వాంగ్మూలం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. కొట్టివేత నిర్ణయానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌ను ఆదేశించారు. ఆ తరువాత కేసు కొట్టివేతకు పాటించాల్సిన న్యాయపరమైన అవసరాలన్ని తీరినట్టుగా భావించిన న్యాయమూర్తి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ సంస్థ మాజీ సీఈవో వినీత్ జైన్‌లపై కేసులను శాశ్వతంగా కొట్టివేసింది.


