తదుపరి విచారణ సెప్టెంబర్ 1న చేపట్టనున్న ధర్మాసనం
ఎంఏ.గార్డెన్స్‌కు తాళాలు తీయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: హిమాయత్‌నగర్ పరిధిలోని హైదర్‌గూడలో ఉన్న వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఎంఏ.గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు వేసిన తాళాలను తక్షణమే తీసివేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
అసలేం జరిగిందంటే..
హైదర్‌గూడలో 5,641 చదరపు గజాల స్థలాన్ని మహేశ్‌చంద్ తదితరులు 1968లో కొనుగోలు చేశారు. అనంతరం 1969లో ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి వారి అధీనంలోనే ఉంది. 2011 నుంచి సదరు స్థలంలో ఎంఏ.గార్డెన్ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ స్థలం ప్రభుత్వానిదేనని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు 1905 చట్టం కింద చర్యలకు ఉపక్రమించారు. ఈ వివాదంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరగ్గా.. 2025 సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు స్పందిస్తూ, లీజుదారులు లేదా ట్రస్ట్ తమ హక్కుల కోసం సివిల్ కోర్టులో దావా వేసుకునే స్వేచ్ఛను కల్పించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు కనీస సమయం ఇవ్వకుండా, కేవలం 48 గంటల వ్యవధిలోనే.. అంటే 2025 సెప్టెంబర్ 11న రెవెన్యూ అధికారులు ఎంఏ.గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు తాళాలు వేశారు. అధికారుల తీరును సవాల్ చేస్తూ బాధితులు (లీజుదారులు) తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫంక్షన్ హాల్‌ను అకారణంగా మూసివేయడం ద్వారా పిటిషనర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని హైకోర్టు అభిప్రాయపడింది. ఫంక్షన్ హాల్‌కు వేసిన తాళాలను తక్షణమే తొలగించాలని, పది రోజుల పాటు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.
సుప్రీంలో వాదనలు ఇలా..
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్, ఏఓఆర్ దేవినా సెహగల్ వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరఫున న్యాయవాది అభినవ్ రావు హాజరయ్యారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.


