ఒకే ఇంట్లో కలి'విడి'గా! | Silent divorces on the rise | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో కలి'విడి'గా!

Aug 12 2026 5:06 AM | Updated on Aug 12 2026 5:06 AM

Silent divorces on the rise

పెరుగుతున్న సైలెంట్‌ డైవోర్స్‌.. 

కలిసే ఉంటూ విడిపోతున్న టెకీ జంటలు..  

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెంచిన భావోద్వేగపరమైన దూరం 

మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో 38% మందికి జీవిత భాగస్వామితో గొడవలు

ఓ సర్వేలో వెల్లడి

బెంగళూరుకు చెందిన యువ దంపతులుమల్టీనేషనల్‌ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగాపనిచేస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో, వేర్వేరు షిఫ్ట్‌లలో పనిచేయడం మొదలు పెట్టారు. అలసటకు గురై నిద్రపోయేవేళలోనే ఓ 10 నిమిషాలు మాట్లాడుకొనేవారు. అలా వారి మధ్య దూరం పెరగడంతో 6 నెలల క్రితం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  

హైదరాబాద్‌కు చెందిన ఓ జంట సైతం స్టార్టప్‌ కంపెనీలో పని ఒత్తిడి, టార్గెట్లు, వారాంతాల్లోనూ పనివేళల వల్ల ఒకరికొకరు మాట్లాడుకోవడం బాగా తగ్గించేశారు. మానసిక వైద్యుడి వద్ద కౌన్సెలింగ్‌కు వెళ్తే కౌన్సెలర్‌ చెప్పిన మాట ఒక్కటే  ‘‘మీరు భాగస్వాముల కంటే కొలీగ్స్‌లా ప్రవర్తిస్తున్నారు’’. భావోద్వేగపరంగా కనెక్ట్‌ కాకపోవడంతో ఇద్దరూ విడిగా ఉండాలని డిసైడయ్యారు. ఇది లీగల్‌గా విడాకులు కాదు.. ఎమోషనల్‌ విడాకులు! 

సాక్షి, హైదరాబాద్‌: భార్యాభర్తలిద్దరికీ తీరికలేని ఉద్యోగాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు మీటింగ్‌లు, డెడ్‌లైన్లు... ఒకే ఇంట్లో ఉంటున్నా మాటలు కరువవుతున్న తీరు. ఆఫీసు కష్టాలు చెప్పుకుందామన్నా.. ఇంట్లో సంతోషాలు పంచుకుందామన్నా మెసేజ్‌లే దిక్కు. ఇదే ఇప్పుడు మె ట్రో నగరాల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణుల కుటుంబాల్లో కనిపిస్తున్న విచిత్ర పరిస్థితి. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా దంపతుల మధ్య మనసులు మాత్రం దూరమవుతున్నాయి. దీన్నే వైద్య నిపుణులు సైలెంట్‌ డైవోర్స్‌ అంటున్నారు. 

కోవిడ్‌ తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి పెరగడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని అంటున్నారు. గతంలో ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో మాట్లాడుకునేందుకు సమయం ఉండేది. ఇప్పుడు 24 గంటలూ నాలుగు గోడల మధ్యఉన్నా కమ్యూనికేషన్‌ మాత్రం తగ్గిపోయింది. జాతీయ మానసిక ఆరోగ్య, నాడీ శా్రస్తాల సంస్థ 2025 సర్వే ప్రకారం మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో 38 శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల భాగస్వామితో గొడవలుపెరిగాయని చెప్పారు. 

బంధం పెంచుకుంటేనే.. 
సైలెంట్‌ డైవోర్స్‌కు పరిష్కారం చట్టంలో కాదు..  కమ్యూనికేషన్‌లో ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పని విధానం వల్ల ఇంట్లో ఉండేందుకు లభించిన సమయాన్ని భార్యాభర్తలు పరస్పరం తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. 

మాటల్లోనే పరిష్కారం.. 
‘సైలెంట్‌ డైవోర్స్‌’సమస్యలతో చాలా జంటలు మా వద్దకు వస్తున్నాయి. భిన్న కుటుంబ నేపథ్యాలకు చెందిన దంపతుల్లో, భర్తకన్నా భార్య సంపాదనఎక్కువగా ఉన్న సందర్భాల్లో, సాంస్కృతిక తేడాలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న దంపతులు ఇలాంటి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి మా సలహా ఒకటే. దంపతులుమనసువిప్పి మాట్లాడుకుంటే సమస్యలకుపరిష్కారం లభిస్తుంది. సమస్యను తొలిదశలోనే గుర్తించి పరిష్కరించుకుంటే విడాకుల దాకా పరిస్థితి వెళ్లదు.  – డా.సి. వీరేందర్, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement