రాజకీయ పార్టీల్లో ‘సర్’ డర్.. 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతవడంతో కలవరం
ఈ ఓట్లన్నీ గతంలో ఏ పార్టీకి పడినవోనన్న సంశయం.. తమ పార్టీ ఓట్లు ఏమైనా పోయాయా అనే ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుండగా.. రాష్ట్రంలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం కన్పిస్తుండటం రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. ఆయా పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ టికెట్ ఆశావహుల్లో గుండెదడకు కారణమవుతోంది. గతంలో ఏ పార్టీకి పడిన ఓట్లు గల్లంతయ్యాయో, పలు ఎన్నికల్లో సంప్రదాయంగా ఆ ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతయిన వాటిల్లో తమ పార్టీ ఓట్లు ఉన్నాయా? అనేది ఆయా పార్టీల నేతలను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి పోలింగ్ బూత్‌స్థాయి సమీక్షలకు పూనుకుంటున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు లోపలి భాగంలో ఉన్న 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 లక్షలకు పైగానే ఓట్లు గల్లంతయ్యాయని లెక్కలు చెబుతుండడంతో.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ఎంఐఎంకు నష్టం కలుగుతుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అనామలిస్ ఓట్లు (సందేహాలున్నవి) కూడా సుమారు 60 లక్షలు దాటడంతో అందులో ఎన్ని మళ్లీ ఓటరు జాబితాలో చేరతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్యూమరేషన్ ఫారం నింపిన తర్వాత ఓటరు పక్షాన తప్పులు దొర్లడం, 2002 ఎస్‌ఐఆర్‌తో లింకు కుదరకపోవడంతో ఈ ఓటర్ల పేర్లను అనామలిస్ జాబితాలో ఉంచారు. గల్లంతయిన ఓట్లకు ఈ అనామలిస్ తోడు కావడంతో ఇంకెన్ని లక్షల ఓట్లు మాయమవుతాయో, ఈ మాయమైన ఓట్ల సమీకరణలు ఏ రాజకీయ పార్టీ తలరాతను ఏ విధంగా మారుస్తుందోననే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో కనిపిస్తోంది.
ఆ 26 నియోజకవర్గాలు ఏమవుతాయో?
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 26 నియోజకవర్గాల్లో అత్యధికంగా, అత్యల్పంగా ఓటర్లు గల్లంతయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ఇద్దరు బీఆర్‌ఎస్, ఒకరు బీజేపీ, ముగ్గురు జంపింగ్ ఎమ్మెల్యేలుండగా, మిగిలిన అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. 50 వేల కంటే ఎక్కువ ఓట్లు గల్లంతయిన నియోజకవర్గాల్లో ఎక్కువగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంచిర్యాల (64,980), ఇబ్రహీంపట్నం (85267), చేవెళ్ల (55609), పరిగి (52856), వికారాబాద్ (52195), తాండూరు (65531), వరంగల్ వెస్ట్ (82617), ఖమ్మం (80663), మహబూబ్‌నగర్ (50647), వరంగల్ ఈస్ట్ (50791) అసెంబ్లీ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఉన్న నిజామాబాద్ అర్బన్ (83283), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గెలిచిన కరీంనగర్ (100622) స్థానాల్లోనూ భారీ ఎత్తున ఓట్లు గల్లంతు కావడం గమనార్హం. ఇక అత్యల్పంగా 20వేల లోపు ఓటర్లు గల్లంతయిన నియోజకవర్గాల్లో భువనగిరి (15892), ఆలేరు (10227), పాలేరు (19156 ), వైరా (17153 ), భద్రాచలం (19873), అశ్వారావుపేట (15451), పరకాల (19081), నర్సంపేట (18331), స్టేషన్ ఘన్‌పూర్ (17055), పాలకుర్తి (19777), డోర్నకల్ (19080), మునుగోడు (17035), బాన్సువాడ (19882), మానగకొండూరు (19658), మెదక్ (18722), దుబ్బాక (17835) ఉన్నాయి. వీటిలో దుబ్బాక నుంచి బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, స్టేషన్‌ఘన్‌పూర్, బాన్సువాడ, భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలున్నారు.
మిగిలిన అన్నిచోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. తాజాగా ఈ 26 చోట్ల ఫలితం ఏ మేరకు తారుమారవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 39715 ఓట్లు గల్లంతయ్యాయి. మంత్రుల విషయానికొస్తే చెన్నూరు (27942), మంథని (23841), హుస్నాబాద్ (24321), కొల్లాపూర్ (35101), మధిర (20638), పాలేరు (19156), ఖమ్మం (80663), వరంగల్ ఈస్ట్ (50791), హుజూర్‌నగర్ (22506), నల్లగొండ (31890), మక్తల్ (39757), ములుగు (27842 ), ధర్మపురి (18638), ఆంథోల్ (32503)లలోనూ పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. వీటితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష కంటే ఎక్కువ మంది చొప్పున ఓటర్లు గల్లంతయ్యారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 3.29 లక్షల ఓటర్లు కనిపించకుండా పోయారు.


