బీఆర్‌ఎస్ హయాంలో ముడుపులు తీసుకొనే కంపెనీలకు భూములిచ్చారా?
వారి పాలనలో లీజు భూముల్ని క్రమబద్దీకరించినప్పుడు కేటీఆర్‌కు తప్పనిపించలేదా?
గత భూకేటాయింపులపై విచారణ చేయిస్తాం
మీడియాతో మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ‘దోపిడీ చేసింది మీరా, మేమా? మీ పాలనలో లీజు భూములను క్రమబద్ధీకరించారు. అప్పుడు తప్పనిపించలేదా?’అని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. సీఎం సోదరులకు భూకేటాయింపులు చేశారంటూ కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ‘ఎవరో చెబితే పనిచేసే రకం కాదు నేను. నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయమూ నాకు తెలుసు’అని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ. 90 లక్షలకు ఎకరం ఇస్తే తాము రూ. కోటిన్నరకు ఇచ్చామని తెలిపారు. బోర్డు నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదన్నారు. 32 దరఖాస్తుల్లో టెస్సరాక్ట్ కంపెనీ ఒకటని వివరించారు. ఏ కంపెనీ ప్రారంభంలో అయినా పెట్టుబడి తక్కువ ఉంటుందని వెల్లడించారు. టెస్సరాక్ట్ కంపెనీకి, సీఎం సోదరులకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు.
ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి..
సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. 5 ఎకరాల్లో రూ. 34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల కంపెనీ అని కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ముడుపులు తీసుకొనే కంపెనీలకు భూములిచ్చారా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వం తక్కువ ధరకు భూములు ఎందుకు ఇచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెస్సరాక్ట్‌కు నిబంధనల ప్రకారమే భూకేటాయింపులు జరిగాయని.. దీనిపై ప్రతిపక్షాలు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పత్రికల్లో రాస్తారని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
హిడెన్ ఎజెండాతోనే..
పీఎం ఏక్తా మాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని మంత్రి శ్రీధర్‌బాబు మరోసారి స్పష్టం చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం మాల్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రూ. 200 కోట్ల రుణం తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపారు. ప్రీ బిడ్డింగ్‌లో ఏడుగురు బిల్డర్లు పాల్గొంటే ఇద్దరిని ఎంపిక చేశారని వివరించారు. పీఏం ఏక్తా మాల్ నిర్మాణంలో ప్రభుత్వంపై భారం లేకుండా లాభం జరుగుతుందని చెప్పారు. పరిశ్రమలు రావొ ద్దనే హిడెన్ ఎజెండాతో కేటీఆర్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కల..
నిరుపయోగంగా ఉన్న క్రమబద్దీకరించిన భూములను హిల్ట్–పీ ద్వారా బదలాయింపునకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కలేనన్నారు. ఆ పారీ్టపై కక్షతో ముందుకెళ్లే ఉద్దేశం ఉంటే కేటీఆర్ సహా ఇతరులంతా ఎక్కడో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు రెండున్నరేళ్లుగా దుష్ప్రచారం చేస్తున్నా, భయపెట్టినా పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు.


