కరువుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లదే బాధ్యత | Congress and BRS are responsible for the drought | Sakshi
Sakshi News home page

కరువుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లదే బాధ్యత

Aug 12 2026 4:25 AM | Updated on Aug 12 2026 4:25 AM

Congress and BRS are responsible for the drought

తుమ్మిడిహెట్టి నిర్మాణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జాప్యం 

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు  

లక్డీకాపూల్‌(హైదరాబాద్‌): తుమ్మిడిహెట్టి నిర్మాణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ జాప్యం, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం బరాజ్‌ల వైఫల్యంతో ఏర్పడిన కరువుకు ఆయా పార్టీలే బాధ్యత వహించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మించి యుద్ధ ప్రాతిపదికన ఎల్లంపల్లికి అనుసంధానం చేయాలనే డిమాండ్‌పై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధన సమితి, తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. 

జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ నైనాల గోవర్దన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జస్టిస్‌ చంద్రకుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, టి.హనుమంతరావు, నీటిపారుదల విశ్లేషకులు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందన్నారు. కేవలం ముగ్గురు ఇంజనీర్ల దగ్గర రూ.1,000 కోట్లు అవినీతి నిరోధక శాఖ దాడిలో లభించాయన్నారు. కేసీఆర్‌ రీడిజైనింగ్‌ పేరిట తుమ్మిడిహెట్టిలో కూడా తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. 

18 ఏళ్లయినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రారంభించిన పెండింగ్‌ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయి నేటికీ పూర్తి కాలేదని చెప్పారు. ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బరాజ్‌లను ఇప్పటికిప్పుడు ఉపయోగించడం ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం సాధ్యం కాదని చెప్పారు. హైదరాబాద్‌కు నీళ్లు అందించేది కేవలం ప్రాణహిత నది మాత్రమే అన్నారు. తక్షణమే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టి.శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి ఎం. హన్మేశ్, సజయ, సంధ్య, రామన్న, ఝాన్సీ, జైపాల్‌సింగ్, లాల్కుమార్‌ శ్రీనివాస్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement