2023–26 ఫీజులే 2026–29కీ కొనసాగింపు
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఏ–కేటగిరీకి ఏడాదికి రూ. 60వేలు
బీ కేటగిరీలో రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు
సీ కేటగిరీలో బీ ఫీజుకు రెట్టింపు వసూలు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజులు మరో మూడేళ్లపాటు యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–29 బ్లాక్ పీరియడ్‌కు కొత్తగా ఫీజులు పెంచకుండా.. 2023–26 కాలానికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనారిటీ, నాన్‌మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు వర్తిస్తాయి.
సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు కూడా ఇదే వర్తించనుంది. ప్రభుత్వం 2023–26 బ్లాక్ పీరియడ్‌కు జారీ చేసిన జీవో 106, అనంతరం డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 132లోని నిబంధనలనే 2026–29 కాలానికీ కొనసాగిస్తోంది. కొత్తగా అనుబంధ గుర్తింపు పొందే కాలేజీలకు మాత్రం ఇప్పటికే నిర్దేశించిన ఫీజు నిర్మాణాల్లో అత్యల్ప ఫీజు వర్తింపజేయనున్నట్లు కాళోజీ వర్సిటీ స్పష్టం చేసింది. దీంతో కొత్తగా వచ్చే కాలేజీలు తమకు అనుకూలంగా అధిక ఫీజును నిర్ణయించుకునే అవకాశం ఉండదు.
ఏ కేటగిరీలో రూ.60 వేలే
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఏ–కేటగిరీ సీట్లకు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.60 వేలుగా ఉంది. బీ–కేటగిరీ సీట్ల విషయంలో కాలేజీని బట్టి ఫీజు మారుతుంది. ప్రస్తుతం ఎక్కువ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ–కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఉంది. హైదరాబాద్‌లోని డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు 2023లో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా బీ–కేటగిరీ ఫీజును రూ.13.90 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం పునర్నిర్ణయించింది. సీ–కేటగిరీ సీట్లకు బీ–కేటగిరీ ఫీజుకు గరిష్టంగా రెండింతలు వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో రూ.11.55 లక్షల బీ కేటగిరీ ఫీజు ఉన్న కాలేజీలో సీ కేటగిరీ గరిష్ట ఫీజు రూ.23.10 లక్షలు అవుతుంది. ఇలా ఆయా కాలేజీల బీ–కేటగిరీ ఫీజులను బట్టి సీ–కేటగిరీ ఫీజులు రెట్టింపు అవుతాయి.
నాలుగున్నరేళ్లకే ఫీజు చెల్లింపు
ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నరేళ్ల విద్యతోపాటు ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ట్యూషన్ ఫీజు వసూలు విషయంలో 2026లో ఈ అంశంపై హైకోర్టులో విచారణ కూడా జరిగింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఐదేళ్లకు ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. కాళోజీ వర్సిటీ, తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) తరఫు న్యాయవాదులు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఫీజు ఉత్తర్వుల్లో మొత్తం ట్యూషన్ ఫీజును ఐదు సమాన వాయిదాల్లో చెల్లించే విధా నం ఉందని చెప్పారు.
ఐదేళ్లకు ఒక్కో ఏడాది పూర్తి ట్యూషన్ ఫీజు చొప్పున వసూలు చేయాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు. ఉదాహరణకు రూ.11.55 లక్షలు బీ–కేటగిరీ ఫీజుగా ఉన్న కాలేజీలో నాలుగున్నరేళ్లకు రూ.51,97,500 అవుతాయి. అయితే ఈ మొత్తాన్ని ఐదు సమాన వాయిదాల్లో చెల్లించే విధానం అమల్లో ఉందనేది అధికారుల వివరణ. కానీ కొన్ని ప్రైవేటు కాలేజీలు, వర్సిటీలుగా గుర్తింపు ఉన్న కాలేజీల్లో ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్ల కేటాయింపులు జరుగుతుండటం గమనార్హం.
దరఖాస్తులకు నేడు ఆఖరు
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. ఆగస్టు 5న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ కు ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు అవసరమైన ధ్రువపత్రాల స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగానే రాష్ట్రస్థాయి మెరిట్ జాబితా రూపొందిస్తారు. నీట్‌లో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 213, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 177 కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.


