యూరప్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం | Qormi Crash Victim Identified As Mohammed Abdul Jawad | Sakshi
Sakshi News home page

యూరప్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..జగిత్యాల యువకుడు దుర్మరణం

Aug 12 2026 12:00 AM | Updated on Aug 12 2026 12:00 AM

Qormi Crash Victim Identified As Mohammed Abdul Jawad

జగిత్యాల: బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల మహ్మద్ జావెద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆయన మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్‌ గత ఏడాది కాలంగా మాల్టాలోని పావోలా పట్టణంలో ఒక సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ మాల్టాలోని కోర్మి ప్రాంతంలో జావెద్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక భారీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జవ్వద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మహ్మద్ జావెద్‌కు మూడు నెలల క్రితమే స్వదేశానికి వచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకల అనంతరం జీవితంలో స్థిరపడాలనే ఆశతో ఆయన తిరిగి మాల్టాకు వెళ్లాడు. ఇంతలోనే ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో జావెద్‌ మృతి చెందారనే వార్త వినడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement