సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలక గణాంకాలు వెలువడ్డాయి. ఓటర్ల వివరాల సేకరణ, పరిశీలన అనంతరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య, ఎన్యుమరేషన్ ఫారాల స్థితిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి వివరాలను మంగళవారం మీడియాకు రిలీజ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది(3.38 కోట్ల) ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 2,64,87,214 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటైజ్ చేయగా.. 78.30 శాతం ప్రక్రియ పూర్తయింది. మరో 73,39,234 ఫారాలు (21.70 శాతం) అన్‌కలెక్టబుల్‌గా నమోదయ్యాయి. అన్‌కలెక్టబుల్ ఫారాల్లో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారిగా గుర్తించారు. దీంతో వీరి ఓటరు వివరాలపై తదుపరి పరిశీలన అవసరమని అధికారులు భావిస్తున్నారు.
ఇక 11,25,546 మంది గైర్హాజరు లేదంటే ఆచూకీ లేని వారిగా(అన్ ట్రేస్) నమోదు కాగా.. 9,22,230 మంది మరణించినవారిగా గుర్తించారు. సర్ పరిశీలనలో 6,70,203 మంది ఇప్పటికే మరోచోట ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. వీరితో పాటు 1,02,294 ఫారాలు ఇతరుల కేటగిరీలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఓటరు జాబితా ప్రక్షాళనపై దృష్టి
ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు SIR ప్రక్రియ చేపట్టినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు కొనసాగిస్తూ.. శాశ్వతంగా తరలివెళ్లిన వారు, మరణించిన వారు, ఇతర చోట్ల నమోదైన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో SIR ప్రక్రియలో వెలువడిన ఈ గణాంకాలు రాష్ట్ర ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 73 లక్షలకు పైగా ఫారాలు అన్‌కలెక్టబుల్‌గా నమోదు కావడం ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది.
ఇదీ చదవండి: తెలంగాణలో సర్- అత్యధిక ఓట్ల గల్లంతు ఎక్కడంటే..


