హైదరాబాద్: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. గుడిమల్కాపూర్‌కు చెందిన మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), జవహర్ నగర్ ఫర్హాన్ నగర్‌కు చెందిన సయ్యద్ అలీ అష్రఫ్ (40), బాలాజీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ హాజీ (25), కీసర మండలం యాదగిరిపల్లికి చెందిన బైక్ మెకానిక్ మహ్మద్ సల్మాన్ (29)లు స్నేహితులు.
మునావర్ పాత నేరస్థుడు. కార్ల పెయింటింగ్, డెంటింగ్ పనుల్లో వచ్చే ఆదాయం సరిపోక.. సులభంగా డబ్బు సంపాదించాలని కుట్రపన్నాడు. ఈ ఏడాది మార్చి 26న రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఆసిఫ్‌ను నిందితులు కలిశారు. జగిత్యాలలో నివాసం ఉండే ఆసిఫ్ స్నేహితుడు ఇమ్రాన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించారు. వాటిని తీయడానికి రూ.7.5 లక్షలు తీసుకొని కనిపించకుండా పోయారు. దీంతో ఆసిఫ్ ఈ నెల 7వ తేదీన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం మహ్మద్ మునావర్, అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లను, నకిలీ బంగారు నాణేలు, బొగ్గును స్వా«దీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు వివిధ ప్రాంతాల్లో 11 మందిని ఇలాగే మోసం చేసి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. శంషాబాద్ జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. రవి, సబ్ ఇన్‌స్పెక్టర్లు మన్సూర్ అలీ, నర్సింగ్ రావు, ఎస్. శేషు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసుల సహకారంతో ఈ ముఠాను పట్టుకున్నారు.


