కోల్‌కతా: దేశంలో 1975 నాటి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో నిరసనల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన 325 మందికి నెలకు రూ.10,000 చొప్పున పింఛను అందజేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడి, ఆ సమయంలో ఎమర్జెన్సీలో కారాగారవాసం అనుభవించిన వీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారి త్యాగాల పునాదుల మీదే నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
‘పశ్చిమ బెంగాల్ లోకతంత్ర సేనాని సమ్మాన్’ కింద ఎమర్జెన్సీ కాలంలో జైలుపాలైన 325 మందిని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారి ఆశయాలకే కొత్త ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని గుర్తుచేసుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్య దివస్’గా పాటిస్తోంది. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇప్పటికే ఎమర్జెన్సీ ఖైదీలను సత్కరించి పింఛన్లు అందిస్తున్నాయి. కాగా ఈ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు క్విట్ ఇండియా ఉద్యమం 84వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన ‘డు ఆర్ డై’ నినాదాన్ని గుర్తుచేసుకుంటూ, స్వేచ్ఛా భారతం కోసం వేలాది మంది భారతీయులు ప్రాణత్యాగం చేశారని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఒక బైక్‌కు 500 హారన్‌లు.. ఇదేందయ్యా ఇదీ!


