న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ దాదాపు 500 మంది సాధువులు, మతాచార్యులు సోమవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్నారు. ప్రకాశానంద గిరి మహారాజ్ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శన జరుగుతోంది. మండి హౌస్ సమీపంలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. విరాళాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి సాధువులు వినతిపత్రం సమర్పించనున్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో పెద్దఎత్తున ఆర్థిక మోసాలు, నిధుల స్వాహా జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సాధారణ సిబ్బందిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా ఉందని, ఇందులో కీలక వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మరోవైపు ఈరోజు రామమందిర విరాళాల గోల్‌మాల్‌పై సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. అలాగే లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.


