ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌.. కారణం​ ఇదే! | Us Vice President JD Vance Calls Pm Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌.. కారణం​ ఇదే!

Aug 9 2026 6:50 AM | Updated on Aug 9 2026 7:22 AM

Us Vice President JD Vance Calls Pm Modi

ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం రాత్రి ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. కీలకమైన రంగాల్లో భారత్‌–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు గల అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అదేవిధంగా, వాన్స్, ఉష దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు.

తుర్కియే, పాకిస్తాన్, సౌదీ అరేబియాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వాన్స్‌ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర రక్షణ ఒప్పందంపై తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు సంతకాలు చేసిన కొద్ది రోజులకే ప్రధాని మోదీకి వాన్స్ ఫోన్ చేయడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వర్తకం, రక్షణ, ఇంధన భద్రత రంగాలలో భారత్-అమెరికాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడంపై కూడా చర్చించారు.

"అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కీలక రంగాల్లో భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాం" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారత అధికారిక ప్రకటన ప్రకారం.. భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని ప్రధాని మోదీ, వాన్స్ సమీక్షించారు.

ఉన్నత స్థాయి చర్చల్లో కొనసాగుతున్న పురోగతిని వారు ప్రస్తావించారు. వర్తకం, రక్షణ, సంక్లిష్ట, వర్ధమాన సాంకేతికతలు, ఇంధన భద్రత, కీలక ఖనిజాల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతంపై చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని ప్రకటన తెలిపింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి అమెరికా అధికారిక వర్గాల నుంచి ఇంకా ఎలాంటి వివరాలు వెలువడలేదు. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం గురించి ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందో లేదో స్పష్టత రాలేదు.

 ‘మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌ పేరుతో పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న ఆ దేశాలు.. ఏ దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి. ఈ కీలక రక్షణ ఒప్పందంపై ఆ దేశాలు సంతకాలు చేశాయి.

పెరుగుతున్న భద్రతా ఆందోళనల వేళ ఈ ఒప్పందం మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగానే పరిగణనలోకి తీసుకోనున్నాయి. మూడు దేశాలలో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా.. అది మూడింటిపై జరిగిన దాడిగానే భావిస్తారు. అలాగే మూడు దేశాల మధ్య రక్షణ సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను మరింత పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement