నిధులు, సిబ్బంది బదలాయింపు జరగాలి
గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి
అధికార వికేంద్రీకరణ వేగవంతం చేయాలి
కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన పంచాయతీరాజ్ సంస్థలకు మరిన్ని అధికారాలు, నిధులు, సిబ్బందిని బదలాయించాలని, వాటిని స్వయం ప్రతిపత్తి కలిగిన సమర్థవంతమైన స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీలకు రాజ్యాంగబద్ధ హోదా లభించినప్పటికీ అధికారాల వికేంద్రీకరణ విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయని పేర్కొంది.
గ్రామసభలను చైతన్యవంతం చేయడం, మహిళా ప్రజాప్రతినిధుల నిజమైన భాగస్వామ్యాన్ని పెంచడం, పంచాయతీల ఆర్థిక స్వావలంబనను పెంచడం అత్యవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు స్థాయీ సంఘం అధ్యక్షుడు సప్తగిరి శంకర్ ఉలాకా నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రెండ్రోజుల కిందట పార్లమెంట్‌కు సమర్పించింది. అందులో కేంద్రానికి పలు కీలక సిఫార్సులు చేసింది.
పేరుకే మూడంచెల వ్యవస్థ..
1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ, మధ్యంతర, జిల్లా స్థాయిల్లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ రక్షణ లభించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాటు వంటివి తప్పనిసరయ్యాయి. అయితే పంచాయతీలకు దఖలు పరిచాల్సిన విధులు, అధికారాలు, ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛ కారణంగా దేశవ్యాప్తంగా అమలులో గణనీయమైన తేడాలు ఏర్పడ్డాయని కమిటీ గుర్తించింది. పంచాయతీలకు అధికారాల బదలాయింపును కొలిచే డెవల్యూషన్ ఇండెక్స్‌లో దేశ సగటు 2013–14లో 39.9 శాతం ఉండగా.. 2021–22 నాటికి 43.9 శాతానికి పెరిగింది. పురోగతి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు మరింత అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది.
ప్రాక్సీ ప్రాతినిధ్యానికి చెక్..
గ్రామసభలు ప్రజలకు నేరుగా పాలనలో భాగస్వామ్యం కల్పించే అత్యంత కీలక వేదికలైనప్పటికీ.. సమావేశాల్లో ప్రజల పాల్గొనడం తగ్గిపోతుండటంతో అవి క్రమంగా లాంఛనప్రాయ కార్యక్రమాలుగా మారుతున్నాయని కమిటీ పేర్కొంది. మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలు గ్రామసభల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అవసరమైన చోట డిజిటల్ వేదికలను ఉపయోగించాలని పేర్కొంది.
మహిళలకు కనీసం మూడో వంతు రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించగా..అనేక రాష్ట్రాలు దాన్ని 50 శాతానికి పెంచాయి. 21 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. అయితే ఎన్నికైన మహిళా ప్రతినిధుల స్థానంలో వారి భర్తలు లేదా కుటుంబ సభ్యులు సమావేశాల్లో పాల్గొనే ‘ప్రాక్సీ ప్రాతినిధ్యం’ను అరికట్టాలని కమిటీ స్పష్టం చేసింది. మహిళా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం కల్పించాలని సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీల స్థాయిలోనే అధికారాలు, వనరులు ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నాయని కమిటీ గుర్తించింది.
మండల, జిల్లా పంచాయతీలకు తగిన అధికారాలు, నిధులు, సిబ్బంది లేకపోవడం మూడంచెల వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్న పంచాయతీలు సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో వెనుకబడి ఉన్నాయని కమిటీ పేర్కొంది. పన్నులు, రుసుములు, స్థానిక ఆదాయ వనరుల ద్వారా సొంత ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాలను రూపొందించాలని సూచించింది. పనితీరు, పారదర్శకత ఆధారంగా ప్రోత్సాహక గ్రాంట్లను అనుసంధానించే అవకాశాన్ని పరిశీలించాలని పేర్కొంది.
2026–31 కాలానికి 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల కోసం రూ.4.35 లక్షల కోట్లను కేటాయించింది. ఈ నిధులను సమర్థంగా వినియోగించేందుకు పారదర్శక లెక్కలు, డిజిటల్ ఆడిట్, పనితీరు పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని కమిటీ సూచించింది. పంచాయతీల్లో ప్రత్యేక కేడర్ లేకపోవడం, కార్యదర్శుల కొరత, సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల పథకాల అమలు, లెక్కలు, ప్రణాళికల రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిటీ గుర్తించింది. పంచాయతీలకు అవసరమైన స్థిరమైన మానవ వనరులను సమకూర్చి..ఎన్నిౖMðన ప్రతినిధులకు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే శిక్షణ అందించాలని కమిటీ సూచించింది.


