ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వాదన
కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయి
దీన్ని పేపర్ లీక్‌గా పరిగణించకూడదు
మా వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదు
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణలో వెల్లడి
న్యూఢిల్లీ: నీట్ (యూజీ)–2026 ప్రశ్నపత్రం మొత్తం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టంచేశారు. కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయి కాబట్టి ఈ వ్యవహారాన్ని పేపర్ లీక్‌గా భావించవద్దని పేర్కొ న్నారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదని తేల్చిచెప్పారు. ఆయనతోపాటు ఎన్‌టీఏ అధికారులు గురువారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. గతంలో జరిగిన పేపర్ లీక్ ఉదంతాలను ప్రస్తావించారు. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగారు. అక్రమాలను అరికట్టడానికి భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నామని ఎన్‌టీఏ అధికారులు బదులిచ్చారు.
అభిషేక్ సింగ్‌కు ఎన్డీయే ఎంపీల మద్దతు
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారణకు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషీ, ఎన్‌టీఏ చైర్‌పర్సన్ ప్రదీప్ కుమార్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎన్‌టీఏలో సంస్కరణలపై రాధాకృష్ణన్ నివేదికలోని సిఫార్సులపై ప్రజంటేషన్ ఇచ్చారు. కొన్ని సిఫార్సులను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్‌కు అధికార ఎన్డీయే ఎంపీలు మద్దతుగా నిలిచినట్లు సమాచారం.
సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత సంబంధిత నివేదికను స్టాండింగ్ కమిటీకి సమరి్పంచాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, బీజేపీ ఎంపీలు అందుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని పేర్కొన్నారు. ఆ సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఎన్‌టీఏలో ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని స్టాండింగ్ కమిటీ సభ్యులు సూచించారు. పేపర్ లీకేజీలు జరగకుండా, ఏజెన్సీ పూర్తి సామర్థ్యంతో పని చేయాలంటే సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ఉండాలన్నారు.
బయటకు వెల్లడించలేం: దిగ్విజయ్
మే 3న నీట్(యూజీ) నిర్వహించగా, పేపర్ లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నీట్(యూజీ) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తు సాగుతోంది. ఒకరి చేతి నుంచి మరొకరికి నీట్ ప్రశ్నలు అందినట్లు గుర్తించారు.
అయితే, నీట్(యూజీ) పేపర్ లీకైనట్లు ఎన్‌టీఏ అధికారులు అంగీకరించడం లేదు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని, పేపర్ లీకేజీ జరిగినట్లు సీబీఐ అధికారికంగా ధ్రువీకరిస్తేనే తాము అంగీకరిస్తామని అంటున్నారు. విచారణ అనంతరం పార్లమెంటరీ కమిటీ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎలాంటి చర్చలు జరిగినా వాటిని బయట చర్చించలేమని అన్నారు. గురువారం సమావేశం చాలా బాగా జరిగిందని, సభ్యులందరి నుంచి అభిప్రాయాలు అందాయని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ పై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.


