దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి డబుల్ బోనస్‌ను తెచ్చిపెట్టాయి. ఒకటేమో ఎంతోకాలంగా అందని ద్రాక్షలా ఉన్న బెంగాల్‌లో విజయం సాధించడమైతే. మరోటేమే తమ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, టీఎంసీలను మట్టికరిపించి ఇండియా కూటమిని దెబ్బతీయడం.
ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత.. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్టీయే జయకేతనం ఎగురవేసింది. దానితో పాటు ఎంతో కాలంగా కాషాయ పార్టీకి కొరకరాని కొయ్యలుగా ఉన్న టీఎంసీ మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్ ఓడిపోవడంతో ఆ పార్టీకి డబుల్ బోనస్ లభించినట్లయింది. దీంతో జాతీయస్థాయిలో ఎన్డీఏకు ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమిని బలహీనపరిచి జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుంది.
టీఎంసీలో చీలిక
టీఎంసీలో మమతా బెనర్జీకి అసమ్మతి సెగ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు అసమ్మతి గళం ఎగురువేశారు.లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజా చీలికతో మమతా బెనర్జీ వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చీలిపోయారు. దీంతో మమతా బెనర్జీకి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి.
కాంగ్రెస్‌కు డీఎంకే షాక్
మరోవైపు డీఎంకే కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. హస్తం పార్టీ మిత్రధర్మాన్ని పాటించకుండా టీవీకేకు మద్దతిచ్చిందని ఆరోపించింది. దీంతో ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని స్పష్టం చేసిన డీఎంకే, భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా మరో కొత్త లౌకిక కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉందని సూచించింది.
మెజార్టీ లేక వీగిపోయిన బిల్లు
కాగా ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ లేక వీగిపోయాయి. ప్రత్యేక మెజారీటీకి 352 మంది ఎంపీల మద్దతు అవసరం ఉండగా 298 సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో బిల్లు వీగిపోయింది. కాగా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ తరువాత అత్యధిక ఎంపీ స్థానాలు తృణముల్ 28, డీఎంకే 22 స్థానాలు గెలుపొందాయి.
ప్రస్తుతం డీఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలగగా, టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తామని స్పీకర్‌కు లేఖ రాశారు. దీంతో ఇండియా కూటమికి దాదాపుగా 40 మంది ఎంపీల మద్దతు తగ్గినట్లైంది. త్వరలో జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో బీజేపీ మరోసారి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అయితే డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుండి వైదొలిగినప్పటికీ బీజేపీకి మద్దతివ్వడం అనేది దాదాపు అసంభవం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గుతుందని నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీలలో డీఎంకే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ప్రకటించదు. అయినప్పటికీ గతంతో పోలిస్తే లోక్‌సభలో బీజేపీ బలం మరింత పెరిగింది.
దీంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి విజయం ఇవ్వడంతో పాటు ప్రధాన ప్రతిపక్షాలను మట్టికరిపించాయనేది కాదనలేని సత్యం.


