న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్‌లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు.
మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.
ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారు
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్ధోషి
2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్‌తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది


