ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై మీడియాలో వస్తున్న కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. కోర్టు సమయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. దీని వెనుక ఉన్న అసలు సందర్భాన్ని వివరించారు. ఈ పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందంటూ వస్తున్న వార్తలను సీజేఐ పూర్తిగా కొట్టిపారేశారు. అత్యున్నత న్యాయస్థానం ఏనాడూ ఏ కేసు విచారణను కూడా తిరస్కరించదు. ప్రజలకు న్యాయం చేసేందుకు మేము 24 గంటలూ అందుబాటులో ఉంటాము అని ఆయన తేల్చి చెప్పారు.
అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇస్తూ.. మా ముందుకు అధికారికంగా పిటిషనే రానప్పుడు, మేము దేనిపై విచారణ జరుపుతాము? కేవలం ఒక పేజీ లేఖ ఇచ్చి, దానిపై వెంటనే అత్యవసర విచారణ చేపట్టమంటే కుదరదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కొన్ని నిర్దిష్ట నిబంధనలు, ప్రక్రియలు ఉంటాయి. వాటిని మేము ఉల్లంఘించలేము. పిటిషన్‌ను సరైన పద్ధతిలో దాఖలు చేయాలని నేను వారికి చెప్పాను. కానీ వారు తక్షణమే విచారణ కావాలని పట్టుబట్టారు. అందుకే నిబంధనల ప్రకారం సరైన పిటిషన్ ఫైల్ చేయాలని వారికి స్పష్టం చేయాల్సి వచ్చింది అని సీజేఐ వివరించారు.
చట్టం అందరికంటే ముందు సుప్రీంకోర్టుకు అత్యున్నతమైనదని, దానిని మనమందరం అనుసరించాల్సిందేనని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు నిబంధనల ప్రకారం సరైన రూపంలో దాఖలైన ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించిందని ఆయన తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, కార్యకర్తలపై పోలీసులు జరిపిన దాడిని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరపనుంది.


