న్యూఢిల్లీ: నీట్ అక్రమాలకు బాధ్యత వహించి కేంద్ర విద్యామంత్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతో ఒక్కపక్క చర్చలు జరుపుతూనే ఉద్యమాన్ని నడిపిస్తోంది. మరోవైపు విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు వస్తోంది. యువతపై పోలీసుల దమనకాండను ముక్తకంఠంతో అందరూ ఖండిస్తున్నారు. తాజాగా ఇద్దరు పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా తాము ఉద్యోగాలు వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన షేర్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్ శుక్రవారం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో తన ఉద్యోగానికి రాజీనామా ప్రకటించారు. ధర్నా వేదికపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. 'పట్వారీ' ఉద్యోగ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కిరాణా దుకాణాల్లో దొరికిందని షేర్ సింగ్ ఆరోపించారు. 2021 నుంచి ఉత్తరాఖండ్‌లో పరీక్షా పత్రాల లీకేజీకి సంబంధించి వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు.
"ఇది భగత్ సింగ్ దేశం, విప్లవం బాంబులు లేదా పిస్టల్స్ ద్వారా రాదు... మనం ఈ దుర్మార్గులను ఎదుర్కొంటాం. విప్లవం ఆలోచనల నుంచి పుడుతుంది, ఆ ఆలోచనలు ఎప్పటికీ నశించవు" అని ఆయన అన్నారు. ఆ తర్వాత తన పోలీసు బ్యాడ్జ్‌ను తీసి అభిజిత్ దిప్కేకు అప్పగించారు. అయితే, ఆ కానిస్టేబుల్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశామని ఉత్తరాఖండ్ పోలీసులు తర్వాత తెలిపారు.
ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సమక్షంలో రవి కుమార్ అనే వ్యక్తి ప్రకటించాడు. సెలువులో ఉన్న తనను విధుల్లో చేరాలని పై అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. "నాకు ప్రభుత్వ నివాసం వద్దు, ప్రభుత్వ వాహనం వద్దు, ప్రభుత్వ జీతం కూడా వద్దు" అని ప్రకటించాడు.
మాకు సంబంధం లేదు
ఢిల్లీ పోలీసులతో రవి కుమార్‌కు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక విభాగమైన 'ఢిల్లీ హోమ్ గార్డ్స్'లో అతడు వలంటీర్ మాత్రమేనని వెల్లడించింది. దుష్ప్రవర్తన కారణంగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపింది. జంతర్ మంతర్ వద్ద కుమార్ చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగత అభిప్రాయాలని, అవి ఢిల్లీ హోమ్ గార్డ్స్, ఢిల్లీ పోలీసులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అభిప్రాయాలు కాదని పేర్కొంది.


