ఢిల్లీ: పంజాబ్ బీజేపీ నేత, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ శుక్రవారం తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 2024 నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆయన.. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఉన్న ఈ సరిహద్దు రాష్ట్రంలో వచ్చే ఏడాది బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడైన బిట్టూ.. 2024లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అనంతరం కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఖాళీ చేసిన రాజస్థాన్ రాజ్యసభ స్థానానికి నామినేట్ కావడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమాపై బిట్టూ విమర్శలు గుప్పించారు. పంజాబ్‌కు సంబంధించిన పలు సున్నిత అంశాలున్నాయని.. ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందన్నారు.


