బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) ప్రకారం స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, గతంలో బైపాస్ శస్త్రచికిత్స, తాజాగా ఆటోనామిక్ న్యూరోపతి నిర్ధారణ కారణంగా దీర్ఘకాలిక చికిత్స అవసరమైందని లేఖలో పేర్కొన్నారు.
2024 ఆగస్టులో జరిగిన రాజకీయ సంక్షోభం అనంతరం దేశాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడంలో తన పాత్రను సమర్థించుకున్నారు. ఆయన పదవీ కాలం 2028 ఏప్రిల్ వరకు కొనసాగాల్సి ఉండగా, మధ్యలోనే వైదొలిగారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన షహాబుద్దీన్.. ఆమెతో సీక్రెట్‌గా మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి.
షహాబుద్దీన్ రాజీనామా.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. షహాబుద్దీన్ ఈ రాజీనామాతో.. మరో ఐదు నెలల్లో తిరిగి స్వదేశానికి రావాలని భావిస్తున్న షేక్ హసీనాకు అత్యున్నత అధికార వర్గాల్లో ఇక ఏ ఒక్క మిత్రుడు కూడా మిగలనట్లయింది. 2024 నాటి తీవ్రమైన విద్యార్థి ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండి ఆమెకు చెందిన 'అవామీ లీగ్' పార్టీపై నిషేధం విధించడమే కాకుండా.. పలువురు నాయకులు, కార్యకర్తలు జైలు పాలయ్యారు.. కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
షేక్ హసీనా పాలనా సమయంలోనే షాబుద్ధిన్ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి ఉద్యమ అనంతరం కూడా రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి ఆయనే. 2024 ఆగస్టు విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ఆమె ప్రకటించారు.
కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు జాతీయ పార్లమెంట్ (జాతీయ సంసద్) స్పీకర్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 17.3 కోట్ల మంది జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో దేశాధ్యక్షుడే సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించినప్పటికీ, కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి, మంత్రి వర్గం చేతిలోనే ఉంటాయి.


