భారత్‌ నుంచి హసీనా తిరిగి బంగ్లా వెళ్తాననడానికి కారణాలేంటి? | why Sheikh Hasina want to go Bangladesh | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి హసీనా తిరిగి బంగ్లా వెళ్తాననడానికి కారణాలేంటి?

Jul 15 2026 9:27 PM | Updated on Jul 15 2026 9:37 PM

why Sheikh Hasina want to go Bangladesh

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాకు తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఢాకాకు తిరిగి వస్తానని ప్రకటించారు. "నేను తిరిగి వచ్చిన వెంటనే నన్ను అరెస్టు చేయవచ్చు. నన్ను చంపేయవచ్చు కూడా... అయినా నేను వెళ్లాల్సిందే" అని ఆమె చెప్పారు. ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన, ప్రవాస జీవితం గడుపుతున్న, కోర్టు ఎదుట హాజరు కాకుండానే మరణశిక్ష ఎదుర్కొన్న హసీనా తనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న స్వదేశానికి ఎందుకు తిరిగి రావాలనుకుంటున్నారు? "మరణం వస్తే అది నా స్వదేశంలోనే రావాలి. నా తల్లిదండ్రులు సమాధి అయిన నేలలోనే రావాలి. వారి రక్తం చిందిన నేలలోనే రావాలి" అని ఆమె చెప్పారు.

ఈ నిర్ణయాన్ని 6 నెలల ముందే ప్రకటించడం వెనుక కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా లేదు. హసీనా ప్రకటన ఢాకాలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలను అర్థం చేసుకునే అవకాశం ఇస్తోంది. ముందుగా ఆమె పార్టీ అవామీ లీగ్‌ను పరిశీలిద్దాం.

ఆ పార్టీపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటర్లు మద్దతు పలికారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అవామీ లీగ్‌కు మద్దతు ఉన్నా, మళ్లీ ప్రధాన రాజకీయాల్లోకి వచ్చే స్పష్టమైన మార్గం కనిపించడం లేదు. పార్టీ నాయకుల్లో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు ప్రవాసంలో ఉన్నారు. మరికొందరు బెయిల్‌పై బయట ఉన్నారు.

ఈ పరిస్థితి పార్టీలో రెండు వర్గాలను సృష్టించింది. ఒక వర్గం ఇప్పటికీ హసీనాకు పూర్తి మద్దతు ఇస్తోంది. మరో వర్గం మాత్రం హసీనా కంటే పార్టీ సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రెండు వర్గాలూ అవామీ లీగ్ తిరిగి బలపడాలని కోరుకుంటున్నాయి. అయితే అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాత్రం హసీనా విధేయుల కంటే సంస్కరణవాదులను తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది. వారిని తక్కువ ప్రమాదకరంగా భావిస్తోంది.

మాజీ పరిశ్రమల మంత్రి అమీర్ హొస్సేన్ అమూ, మాజీ న్యాయశాఖ మంత్రి అనిసుల్ హక్ హసీనా విధేయులుగా గుర్తింపు పొందారు. మరోవైపు, తక్కువ వయసున్న మాజీ పర్యావరణ శాఖ మంత్రి సాబెర్ హొస్సేన్ చౌధురీ సంస్కరణవాదిగా గుర్తింపు పొందారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రెండూ కలిసి చౌధురీ నేతృత్వంలో "సంస్కరించిన" అవామీ లీగ్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి. అయితే చౌధురీ ఆ బాధ్యత స్వీకరించకపోవడానికి జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ వ్యతిరేకత కంటే, హసీనా విధేయుల ప్రతీకారం భయం ఎక్కువ కారణమైంది.

అవామీ లీగ్‌పై నిషేధాన్ని చట్టబద్ధం చేయాలన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం హసీనా విధేయులను రాజకీయంగా పక్కన పెట్టి, సంస్కరణవాదులకు మాత్రం అవకాశం ఇవ్వడమే. హసీనా ప్రవాసంలో ఎక్కువ కాలం ఉంటే పార్టీలో విభేదాలు మరింత పెరుగుతాయని ఆమెకు తెలుసు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో కూడా అవామీ లీగ్ పునరాగమనంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

సీనియర్ నాయకులు సలాహుద్దీన్ అహ్మద్, మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్, ఇక్బాల్ హసన్ మహ్ముద్, అమీర్ ఖస్రు మహ్ముద్ చౌధురీ లాంటి వారు సంస్కరణవాదులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అలా చేస్తే జమాత్-ఇ-ఇస్లామీ–నేషనల్ సిటిజన్స్ పార్టీ కూటమి రాజకీయ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, బలహీనమైన అవామీ లీగ్‌ను తమకు అనుకూలంగా మలచుకోవచ్చని వారి అంచనా. ఈ ఆలోచనకు ప్రధానమంత్రి తారెక్ రెహ్మాన్ కూడా కొంత మద్దతు ఇస్తున్నట్టు భావిస్తున్నారు. అయితే యువ నాయకత్వం మాత్రం అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగాలనే కఠిన వైఖరిలో ఉంది.

అశాంతి చెలరేగే ప్రమాదం 
ఆ పార్టీ తిరిగి వస్తే వీధుల్లో మళ్లీ అశాంతి చెలరేగే ప్రమాదం, స్థానిక స్థాయిలో రాజకీయ పోటీ పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడటం, ఎన్నో ఏళ్ల అశాంతి తర్వాత నెలకొన్న ప్రశాంతతను కొనసాగించడం ప్రభుత్వానికి ప్రాధాన్యంగా మారింది. అవామీ లీగ్ పాలనలో జరిగిన దుర్వినియోగాల జ్ఞాపకాలు ఇంకా ప్రజల్లో సజీవంగా ఉండటంతో, ఆ పార్టీని తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావడం ప్రజల్లో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ కారణంగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ ప్రస్తుతం అవామీ లీగ్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే నిర్ణయంపై ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

జమాత్-ఇ-ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీలు అవామీ లీగ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2024 జూలైలో విద్యార్థులు కాల్పులను ఎదుర్కొంటే, జమాత్-ఇ-ఇస్లామీ మాత్రం హసీనా పాలనలో చాలా కాలంగా వేధింపులు ఎదుర్కొంది. హసీనా అధికారం కోల్పోయిన తర్వాత తమకు దక్కిన పరిమిత రాజకీయ అవకాశాలను కూడా అవామీ లీగ్ తిరిగి వస్తే కోల్పోతామనే ఆందోళన ఈ పార్టీల్లో ఉంది. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ రాజకీయాలకు పరిమిత ప్రజాదరణ మాత్రమే ఉందని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పటికీ బలమైన స్థితిలో ఉందని అవి గుర్తించాయి.

అందుకే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తొలి పాలనా కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని అవి భావించడం లేదు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతుతో సంస్కరణవాదుల నేతృత్వంలో అవామీ లీగ్ తిరిగి బలపడితే, అది తమకు తక్షణ రాజకీయ ముప్పుగా మారుతుందని ఈ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే అవి మళ్లీ వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉంది. అది కొత్త రాజకీయ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది.

ఇదే నేపథ్యంలో షేక్ హసీనా మరో 6 నెలల్లో ప్రవాస జీవితం ముగించి స్వదేశానికి వస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది స్వదేశానికి తిరిగి రావాలనే వయసు మీద పడిన ఆ నాయకురాలి వ్యక్తిగత కోరికా? తన పార్టీని కాపాడాలనే ప్రయత్నమా? లేక ప్రస్తుతం ఉన్న మూడు పార్టీల అవగాహనను దెబ్బతీయాలనే రాజకీయ ఎత్తుగడా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement