అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.
న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


