భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సహకరించకపోవడంతో, మాజీ జిల్లా జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీని భోపాల్ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. నిందితులు వాయిస్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.
గతంలోనే నిందితుల నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, జైలులో అధికారులు శాంపిల్స్ కోసం ప్రయత్నించగా, సమర్థ్ సింగ్ నిరాకరించారని, గిరిబాల సింగ్ కేవలం పాక్షికంగా మాత్రమే సహకరించారని సీబీఐ పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాల ఫోరెన్సిక్ విశ్లేషణ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు రావాల్సి ఉందని, పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, జూలై 28 వరకు వారి కస్టడీని పొడిగిస్తూ, మరోసారి వాయిస్ శాంపిల్స్ సేకరించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాగా మే 12న భోపాల్‌లోని కతారా హిల్స్ నివాసంలో ట్విషా శర్మ మృతి చెందారు. ఇది ఆత్మహత్య అని అత్తమామలు వాదిస్తుండగా, ఆమెది హత్యేనని త్విష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


