సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు | Sai Krishna Case: Suspended CI Nagaraju Alleges Frame up by SIT | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు

Jul 3 2026 10:52 AM | Updated on Jul 3 2026 11:25 AM

Sai Krishna Case: Suspended CI Nagaraju Alleges Frame up by SIT

సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సిట్‌ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్‌) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు.

సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు. 

సాయికృష్ణ కేసులో తనను సిట్‌ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్‌ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు.

నేటి నుంచి నాగరాజును సిట్‌ కస్టడీ విచారణ జరపాల్సి ఉంది. సాయికృష్ణ కేసులో ఎనిమిది రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. కాసేపట్లో సిట్‌ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఈలోపే సంచలన ఆరోపణలతో లేఖ బయటకు రావడం కలకలం రేపుతోంది.

ఇదిలా ఉంటే.. నాగరాజు కస్టడీ కోరుతూ సిట్‌ దాఖలు చేసిన మెమోలో సంచలన విషయాలు ఉన్నాయి. కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినట్లు సిట్‌ పేర్కొంది. అలాగే కృష్ణలంక పీఎస్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించినట్లు పేర్కొంది. రక్తపు గుర్తులు ఉన్న లాఠీ, ఎముకలు, బూడిద, కాలిన ఇనుప హ్యాండ్‌ గొలుసు స్టేషన్ టెర్రస్‌ నుంచి సీజ్‌ చేశామని చెప్పింది. ఇక సాయికృష్ణ కస్టడీలోనే తీవ్ర గాయాలతోనే మరణించాడని తేలిందని తెలిపింది. 

సాయికృష్ణ మృతదేహాన్ని అసలేం చేశారు? అనేదానిపై నాగరాజు నోరు విప్పితేనే బయటకు వస్తుందని.. అందుకే కస్టడీకి అప్పగించాలని సిట్‌ కోర్టును కోరింది. కస్టడీ నేపథ్యంలో నాగరాజు నోరు విప్పుతాడా? ఇందులో మిగతా పోలీసుల పాత్ర గురించి చెబుతాడా? లేదంటే తాజా లేఖ కలకలం నేపథ్యంలో ఏదైనా సంచలన విషయం బయటపెడతాడా? అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement