ఆయిల్‌ఫెడ్‌ భూములపై కన్నేశారు | Two Acres Land for TDP office in Anantapur | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌ భూములపై కన్నేశారు

Aug 18 2026 6:15 AM | Updated on Aug 18 2026 6:15 AM

Two Acres Land for TDP office in Anantapur

అనంతపురం టీడీపీ జిల్లా కార్యాలయానికి రెండెకరాలు 

ఎకరానికి ఏడాదికి రూ.వెయ్యి, 66 ఏళ్లకు లీజుకు ధారాదత్తం

మిగిలిన భూములూ కాజేతకు కుట్రలు 

పెదవేగి ఫ్యాక్టరీ భూములపైనే టీడీపీ నేతల కన్ను

సాక్షి, అమరావతి: రైతుల కోసం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను నిర్విర్యం చేసి, దాని విలువైన ఆస్తులను దశలవారీగా కబ్జా చేసేందుకు అధికార టీడీపీ నేతలుపావులు కదుపుతున్నారు. అనంతపురం నగర నడి»ొడ్డున రూ.50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆయిల్‌ఫెడ్‌ భూమిని టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం లీజుకిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు లాభాల్లో నడుస్తోన్న ఏలూరు జిల్లా పెదవేగిలో ఆయిల్‌ఫెడ్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ పేరిట నిర్విర్యం చేసి వందల కోట్ల విలువైన భూములను కాజేయాలనే కుట్ర జరుగుతోంది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

బైలా నిబంధనలకు పాతరేస్తూ  
నూనెగింజల రైతుల అభివృద్ధి, ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, రైతులకు మార్కెట్‌ మద్దతు కల్పన కోసం ఏర్పాటైన ఏపీ కో–ఆపరేటివ్‌ ఆయిల్‌సీడ్స్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ (ఆయిల్‌ఫెడ్‌)కు రాష్ట్రవ్యాప్తంగా రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అనంతపురంలో 21.84 ఎకరాలు, సర్వేపల్లిలో 50 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 18.5 ఎకరాలు, కాకినాడలో 3 ఎకరాలు సహా అనేక విలువైన భూములు సంస్థ సొంతం. వీటి మొత్తం విలువ రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. వీటిలో అత్యంత విలువైనది అనంతపురంలోని ఎ.నారాయణపురంలో ఉన్న 21.84 ఎకరాల భూమి. 

ఇక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.25 కోట్లు పలుకుతోంది. అంటే మొత్తం భూమి విలువ దాదాపు రూ.550 కోట్ల పై మాటే. అలాంటి ఈ భూమిలో 2 ఎకరాలను ఏడాదికి కేవలం రూ.1000 చొప్పున లీజు ప్రాతిపదికన టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు.టీడీపీ కార్యాలయానికి భూమి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆయిల్‌ఫెడ్‌ నిద్ద్వంద్వంగా తిరస్కరించింది. పైగా ఈ భూములు ప్రభుత్వం కేటాయించినవి కావు..సొంత నిధులతో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ సమకూర్చున్నవే. బైలా నిబంధనల ప్రకారం వీటిని ఇవ్వడానికి ఎంతమాత్రం కుదరదని తేల్చి చెప్పినా పట్టించుకోలేదు. ఈప్రతిపాదన కోసం ఏకంగా ఐదుగురు ఎండీలను మార్చి తమకు అనుకూలమైన అధికారిని ఎండీ స్థానంలో కూర్చోబెట్టి తతంగమంతా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు.

 తొలుత టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయించగా, ఇదే ప్రాంగణంలో ఉన్న మిగిలిన భూమిని కూడా దశలవారీగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వాస్తవానికి ఈ భూముల్లో ప్యాకింగ్‌ స్టేషన్, పీనట్‌ బటర్‌ ప్లాంట్, వేరుశనగ నూనె మిల్లు ఏర్పాటు చేయాలని ఆయిల్‌ఫెడ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాయలసీమతో పాటు కర్ణాటక వరకు కార్యకలాపాలు విస్తరించాలని ఏపీఆయిల్‌ఫెడ్‌ సంకల్పించింది.ఈ భూమిని మార్ట్‌గేజ్‌  ద్వారా రూ.250 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్‌సీడీసీ, ఎన్‌డీడీబీ సూత్ర ప్రాయంగా అంగీకరించింది. మరొక వైపు ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రూ.150 కోట్లకుపైగా బకాయిలు ఒత్తిడి తీసుకొచి్చంది. 

ఇలా సమకూరే రూ.400 కోట్ల నిధులతో పెదవేగిలోని అత్యాధునిక ఆయిల్‌ ఫెడ్‌ ఫ్యాక్టరీ నిరి్మంచేందుకు డీపీఆర్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే ఆయిల్‌ ఫెడ్‌ భూములను దొడ్డి దారిన కాజేయాలనే కుట్రతో ఈ ప్రతిపాదనలను రెండేళ్లుగా బుట్టదాఖలు చేస్తున్నారు. రైతుల అభివృద్ధి కోసం ఏర్పడిన  ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి నిర్విర్యం చేస్తూ వందల కోట్ల విలువైన భూములను కాజేయాలనే కుట్రలకు పాల్పడడం పట్ల రైతులు మండిపడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement