సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. దీంతో, రాజధాని గ్రామాల దుస్థితి బయటకు వచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమి నేతలు చెబుతున్న అమరావతి అభివృద్ధి ఎలా ఉందో స్పష్టమవుతోంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. అమరావతి గ్రామాల్లో ప్రజలు కనీస రహదారి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తోందని అసెంబ్లీలో ప్రశ్నించారు. రాజధాని గ్రామాలకు సరైన ట్రంక్ రోడ్లు, కనెక్టివిటీ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయం ఉన్న వెంకటపాలెం ప్రాంతానికి కూడా సరైన కనెక్టివిటీ లేదని తెలిపారు.
పూలింగ్‌లో భూములు ఇచ్చిన కాలనీలకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కానీ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు మాత్రం అవసరమైన సదుపాయాలు అందడం లేదని ఆరోపించారు. రాజధాని గ్రామాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం సరికాదని అసెంబ్లీ వేదికగా శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.


