ఫ్లైదుబాయ్‌ ఘటనపై బిగ్‌ బ్లాస్ట్‌.. ఇరాన్‌ సంచలన ఆరోపణలు! | Iran big charge On Netanyahu And UAE President plotted flydubai incident | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్‌ ఘటనపై బిగ్‌ బ్లాస్ట్‌.. ఇరాన్‌ సంచలన ఆరోపణలు!

Oct 2 2026 12:26 PM | Updated on Oct 2 2026 12:43 PM

Iran big charge On Netanyahu And UAE President plotted flydubai incident

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఫ్లైదుబాయ్‌ విమాన ఘటన మరో వివాదానికి దారితీసింది. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఉన్నారంటూ ఇరాన్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా సృష్టించిన ‘ఫాల్స్‌ ఫ్లాగ్‌’ ఆపరేషన్‌గా అభివర్ణించింది. దీంతో, ఈ ఘటన మరో టర్న్‌ తీసుకుంది.

ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ టీవీ కథనం ప్రకారం.. ఫ్లైదుబాయ్‌ ఘటనను ఉపయోగించుకుని అక్టోబర్‌ 7 హమాస్‌ దాడిపై నెతన్యాహుపై వస్తున్న విమర్శల నుంచి దృష్టి మళ్లించడం, ఆయన రాజకీయ స్థితిని బలోపేతం చేయడం, ఇరాన్‌తో మరోసారి ఘర్షణకు కారణాన్ని సృష్టించడం లక్ష్యంగా ఈ ఘటనను రూపొందించారని ఆరోపించింది. అయితే ఈ వాదనను సమర్థించే ఆధారాలను మాత్రం సదరు కథనం వెల్లడించలేదు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన విమానంలో భద్రతా ఘటనను సృష్టించి, దాన్ని ఉగ్రదాడిగా చూపడం ద్వారా ఇరాన్‌పై అనుమానాలు వచ్చేలా చేయాలని కుట్ర పన్నారని ఆరోపించింది. ఈ ఘటనను నెతన్యాహు రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించారని పేర్కొంది. అదే సమయంలో నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు బిన్‌ జాయెద్‌ మధ్య ఈ ఘటనకు ముందు జరిగిన సమావేశాన్ని కూడా ఇరాన్‌ మీడియా ప్రస్తావించింది.

సోషల్‌ మీడియాలోనూ ‘ఫాల్స్‌ ఫ్లాగ్‌’ ప్రచారం
ఫ్లైదుబాయ్‌ ఘటన జరిగిన కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలోనూ దీనిని ‘ఫాల్స్‌ ఫ్లాగ్‌ ఆపరేషన్‌’గా పేర్కొంటూ పోస్టులు భారీగా వైరల్‌ అయ్యాయి. ఇజ్రాయెల్‌, మొసాద్‌, నెతన్యాహు ఈ ఘటనను కావాలనే సృష్టించారంటూ పలువురు ఆరోపణలు చేశారు. అయితే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సంస్థలు, అధికారిక వర్గాలు ఇటువంటి వాదనలకు ఇప్పటివరకు ఆధారాలు లేవని పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్‌ ఖండన
మరోవైపు ఇజ్రాయెల్‌ ఈ ‘ఫాల్స్‌ ఫ్లాగ్‌’ ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ఆరోపణలు కుట్ర సిద్ధాంతాలేనని, సోషల్‌ మీడియాలో నిరాధారమైన ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ముందుగానే ఎలాంటి నిర్ణయానికి రావడం సరికాదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఈ ఘటనలో ఇరాన్‌ ప్రమేయం ఉండొచ్చని వ్యాఖ్యానించారు. తనకు అందుతున్న సమాచారాన్ని బట్టి కో-పైలట్‌కు ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశం ఉందని, అయితే దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇరాన్‌ ప్రమేయం నిర్ధారణ అయితే ఆ దేశంపై అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అయితే ఇరాన్‌ ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు తుది నిర్ధారణకు రాలేదు. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విమాన ఘటనకు గల కారణాలు, ఉద్దేశం, ముందస్తు ప్రణాళిక లేదా ఉగ్రవాద సంబంధాలపై విచారణ చేపట్టింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలు, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయొద్దని యూఏఈ అధికారికంగా కోరింది.

అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ విమానం FZ1073లో కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ దాడి చేశాడు. కెప్టెన్‌ గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇతర పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తీసుకుని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement