జనం జేజేలు  | Special prayers at Varanasi and Somnath Temple for pilot Smit Machchhar | Sakshi
Sakshi News home page

జనం జేజేలు 

Oct 2 2026 6:08 AM | Updated on Oct 2 2026 6:08 AM

Special prayers at Varanasi and Somnath Temple for pilot Smit Machchhar

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష 

వారణాసి, సోమనాథ్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు  

ముంబైలో ఇంటి వద్దకు భారీగా తరలివచి్చన జనం 

శౌర్య చక్ర లేదా భారతరత్న అవార్డు ప్రదానం చేయాలని వినతి  

న్యూఢిల్లీ:  స్మిత్‌ మచ్ఛార్‌. ఒక రోజు క్రితం వరకు అతడు ఎవరో చాలామందికి తెలియదు. కానీ, నేడు నేషనల్‌ హీరోగా మారిపోయాడు. విమానంలో 174 మంది ప్రయాణికులను కాపాడినందుకు జనం జేజేలు పలుకుతున్నారు. కో–పైలట్‌ కత్తితో దాడి చేయడంతో గాయపడిన స్మిత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఆలయం, గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

స్మిత్‌ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ప్రశంసించారు. ప్రచారానికి దూరంగా సాధారణ జీవితాన్ని గడిపేందుకు స్మిత్‌ ఇష్టపడుతుంటాడు. ఆయనకు సంబంధించిన సమాచారం కోసం జనం సోషల్‌ మీడియాను శోధించారు. ప్రమాద సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసిస్తూ మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. భయంకరమైన సవాలును ఎదుర్కొనే క్రమంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించాడని కొనియాడారు.  

స్మిత్‌ అకుంఠిత స్ఫూర్తికి వందనం: ముర్ము  
స్మిత్‌ మచ్ఛార్‌ ప్రదర్శించిన వీరోచిత ధైర్యాన్ని, అద్భుతమైన సమయస్ఫూర్తిని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. దేశం ఆయనను చూసి గర్వపడుతోందని సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో ఆయన నిలబడ్డారని పేర్కొన్నారు. స్మిత్‌ ధైర్యం, సమయస్ఫూర్తి మనందరినీ ఎంతగానో కదిలించాయని ఉద్ఘాటించారు. స్మిత్‌ను ప్రశంసిస్తూ ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.  

స్మిత్‌కు ‘విశిష్ట గుజరాత్‌ గరిమ అవార్డు’ 
అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన స్మిత్‌ మచ్ఛార్‌కు ‘విశిష్ట గుజరాత్‌ గరిమ అవార్డు’ను ప్రదానం చేస్తామని గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడం స్ఫూర్తిదాయకమైన, ప్రశంసనీయమైన చర్య అని పేర్కొంది. ‘‘గుజరాత్‌కు చెందిన వీరపుత్రుడు స్మిత్‌ తన సాహసంతో గుజరాత్‌కు, దేశానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తెచ్చాడు. అతని నరనరాల్లో ప్రవహించే గుజరాతీ స్ఫూర్తి మనందరికీ గర్వకారణం’’అని సీఎం భూపేంద్ర పటేల్‌ పేర్కొన్నారు. స్మిత్‌ గుజరాత్‌కు చెందినవారని, ఆయన కుటుంబం చాలా కాలం క్రితమే ముంబైకి వలస వెళ్లిందని అధికారులు తెలిపారు.  

స్మిత్‌ ఇంటి వద్ద జనం నినాదాలు  
ముంబైలో తిలక్‌నగర్‌ ప్రాంతంలో స్మిత్‌ ఇల్లు ఉంది. గురువారం ఆ ఇంటి వద్దకు వందలాది మంది జనం తరలివచ్చారు. ఇంటి బయట త్రివర్ణ పతాకాలు చేతబూని, భారత్‌ మాతా కీ జై అని నినదించారు. స్మిత్‌ చిత్రపటాలను ప్రదర్శించారు. ఆయనకు శౌర్య చక్ర వంటి పురస్కారాన్ని లేదా దేశ అత్యున్నత పౌర పురస్కారం∙భారత రత్నను ప్రదానం చేయాలని కోరారు. స్మిత్‌ మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇరుగుపొరుగువారు, స్నేహితులు అతడి చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. బాల్యం నుంచే స్మిత్‌ ప్రశాంతమైన, నిబ్బరమైన వ్యక్తి అని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement