ఫ్లైదుబాయ్‌ ఘటనలో ఇరాన్‌ హస్తం? ట్రంప్‌‌ అనుమానాలు | Trump Suspects Iran Link Flydubai Plane Attack Warns Severe Retaliation | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ఇరాన్‌ హస్తం? ట్రంప్‌‌ అనుమానాలు

Oct 2 2026 4:36 AM | Updated on Oct 2 2026 4:50 AM

Trump Suspects Iran Link Flydubai Plane Attack Warns Severe Retaliation

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న దాడి వెనుక ఇరాన్‌ ప్రమేయం ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రాథమికంగా తనకు అందిన సమాచారం ప్రకారం ఇరాన్‌తో సంబంధం ఉండే అవకాశాలున్నాయని గురువారం వైట్‌హౌస్‌లో విలేకరులకు తెలిపారు.

ఇరాన్‌ ప్రమేయం ఉంటే తీవ్ర పరిణామాలు

ఈ ఘటన వెనుక ఇరాన్‌ ఉన్నట్లు దర్యాప్తులో తేలితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నకు ట్రంప్‌ స్పందిస్తూ.. ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేస్తామని హెచ్చరించారు.

సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానం ఎఫ్‌జెడ్‌1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణిస్తున్న సమయంలో కోపైలట్‌ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకుని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. దాడిలో గాయపడిన భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ప్రతిఘటించి కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

విమానం తీవ్రంగా కిందకు దిగడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అనంతరం ప్రత్యామ్నాయ సిబ్బంది విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా, గాయపడిన పైలట్లకు చికిత్స అందించారు.

దర్యాప్తులో అసలు కారణాలపై ఆరా

ఈ ఘటనకు సంబంధించి నిందితుడి నేపథ్యం, దాడికి దారితీసిన పరిస్థితులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కోపైలట్‌ తీవ్రవాద భావజాల ప్రభావానికి లోనై ఉండొచ్చని వ్యాఖ్యానించినప్పటికీ, దాడి వెనుక అసలు ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement