ధీరోదాత్త
తమ ప్రాణాల కంటే ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం అనుకుని విమానయాన సిబ్బందిలో కొందరు చరిత్రలో నిలబడిపోయారు. తాజా ‘ఫ్లయ్ దుబాయ్’ ఘటనలో కత్తి పోట్లకు వెరవలేదు కెప్టెన్ స్మిత్ మచ్చార్. 40 ఏళ్ల క్రితం 1986లో ప్రాణాలొడ్డడానికి వెనుకాడలేదు ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్. ఇద్దరూ కీలక సమయంలో తలుపు తెరవడం వల్లే ప్రయాణికులు బతికారు. స్మిత్‌ను ఆలింగనం చేసుకుంటూ నీర్జాకు అంజలి ఘటించాల్సిన సందర్భం ఇది.
విమానం... ఆకాశంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం అనుకుంటాం. కానీ ఆ ఇనుప పక్షి లోపలే అత్యంత ప్రమాదం పొంచి ఉన్నప్పుడు? కాక్‌పిట్‌లో కూర్చున్న వ్యక్తే కూల్చాలనుకున్నప్పుడు?హైజాకర్లు తుపాకీ పట్టుకుని క్యాబిన్ లో నిలబడినప్పుడు? ఆ క్షణంలో టెక్నాలజీ కాదు, ఒక మనిషి ధైర్యమే ప్రయాణికుల ప్రాణాలకు ఆక్సిజన్ అవుతుంది. అలాంటి ధైర్యానికి రెండు పేర్లు – నీర్జా భానోట్, స్మిత్ మచ్చర్. ఒకరు ధీరోదాత్తుడిగా నిలబడితే 1986లో మరొకరు తన సాహసంతో చిరంజీవి అయ్యారు.
నేడు 2026
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం 1073. గాల్లో 174 మంది ప్రయాణికులు, అందులో 27 మంది చిన్న పిల్లలు. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కలకలం. పక్క సీట్‌లో ఉన్న కో–పైలట్.... పైలెట్‌గా విధుల్లో ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేయడానికి ప్రయత్నించాడు. విమానం 30 సెకన్లలోనే దాదాపు 14,000 అడుగులు కిందకు దూసుకుపోయింది. ఆ క్షణంలో స్మిత్ ఒంటినిండా రక్తం. నేలపై పడిపోయి ఉన్నాడు. కానీ స్పృహ తప్పలేదు. ఎలాగోలా శక్తి కూడదీసుకున్నాడు. సమయస్ఫూర్తితో స్పందించాడు.
అతి కష్టమ్మీద రక్తపు చేతులతో కాక్‌పిట్ డోర్ రిలీజ్ బటన్ నొక్కాడు. ఆ ఒక్క క్లిక్ చారిత్రక ఘట్టం అయ్యింది. వెంటనే బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది లోపలికి దూసుకొచ్చి కో–పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు దుబాయ్ పైలట్లు కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్మిత్‌ను ప్రాణదాత’ అని పొగిడాడు. స్పైస్‌జెట్ యాజమాన్యం ‘ఇండియా గర్విస్తోంది’ అంది. ప్రస్తుతం తబుక్ ఆసుపత్రిలో సర్జరీ తర్వాత స్మిత్ కోలుకుంటున్నారు.
నాడు 1986
సరిగ్గా 40 ఏళ్ల క్రితం జరిగిన ఇలాంటి ఘటనను దేశం మర్చిపోలేదు. 1986 సెప్టెంబర్ 5న ముంబై నుంచి కరాచీ మీదుగా ఫ్రాంక్‌ఫర్ట్ వెళుతున్న పాన్ ఆమ్ ఫ్లైట్ 73 కరాచీలో ల్యాండ్ అయిన వెంటనే నలుగురు సాయుధ హైజాకర్లు విమానాన్ని హైజాక్ చేశారు. అప్పుడు ఆ విమానంలో సీనియర్ ఫ్లైట్ పర్సన్ గా ఉన్నది 23 ఏళ్ల ముంబై అమ్మాయి నీర్జా భానోట్. హైజాకర్ల ఉద్దేశం అమెరికన్లను చంపడం. వారిని గుర్తించడానికి అందరి దగ్గరా పాస్‌పోర్ట్‌లు లాక్కుంటుంటే నీర్జా తన తోటి సిబ్బందితో కలిసి వాటిని దాచేసింది.
కొన్నింటిని చెత్త కుండీలో పడేసింది. దాంతో హైజాకర్లకు ప్రయాణికుల్లో అమెరికన్లు ఎవరో తెలియలేదు. 17 గంటల తర్వాత వాళ్లు సహనం కోల్పోయి కాల్పులు మొదలుపెట్టినప్పుడు నీర్జా ధైర్యంచేసి ఎమర్జెన్సీ డోర్ తెరిచింది. ఆ ఒక్క నిర్ణయం చరిత్రలో నిలబడిపోయింది. డోర్ తెరవడమే కాదు నీర్జా ప్రయాణికులను బయటకు తోసేసింది. కాని చివర్లో ముగ్గురు చిన్నపిల్లలను తన శరీరంతో తూటాలకు అడ్డుగా కప్పి ఆమె ప్రాణాలు కోల్పోయింది. విమానంలోని 379 మందిలో 359 మంది బతికారు.
ఇద్దరినీ కలిపే దారం
నీర్జా... క్యాబిన్ క్రూ. స్మిత్... కాక్‌పిట్ క్రూ. ఒకరు హైజాకర్ల నుంచి, ఒకరు సొంత కో–పైలట్ నుంచి ప్రయాణికులను కాపాడారు. ఇద్దరూ చేసింది ఒకటే... తలుపు తెరవడం. నీర్జా తలుపు తెరిచి ప్రయాణికులను బయటకు పంపింది, స్మిత్ తలుపు తెరిచి ప్రయాణికులను లోపలికి రానిచ్చాడు. ఇది విధి నిర్వహణలో భారత విమానయాన సిబ్బంది నిబద్ధత.
నీర్జా భానోట్‌కు మరణానంతరం అశోకచక్ర వచ్చింది. ఆమె పేరుమీద ఇప్పటికీ ధైర్యానికి అవార్డు ఇస్తారు. స్మిత్ మచ్చర్ ఇంకా బతికే ఉన్నాడు, ఆసుపత్రి మంచం మీద ఉన్నాడు. 40 ఏళ్ల తర్వాత చరిత్ర మళ్లీ ఒక హీరోను ఇచ్చింది. కానీ ఈసారి ఆ హీరోను మనం సన్మానించే అవకాశం ఉంది. విమానంలో సాంకేతిక లోపం వస్తే ఇంజినీర్లు చూసుకుంటారు, వాతావరణం బాగోలేకపోతే రాడార్ చూసుకుంటుంది. కానీ మనిషిలోని మృగం మేల్కొన్నప్పుడు మనిషి ధైర్యమే రన్ వే అవుతుంది. అలాంటి ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రదర్శించిన నీర్జాను తలుచుకుంటూ, స్మిత్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.


