భారత్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు.. రానున్న రబీ పంటలపై ప్రభావం చూపే అవకాశాలు పెంచుతున్నాయి. బలమైన ఎల్‌నినో పరిస్థితులు, తగ్గుతున్న నీటి నిల్వలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ ఉత్పత్తికి సవాళ్లు విసరడంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీయొచ్చని సిటీ రీసెర్చ్ నివేదిక హెచ్చరించింది.
2015 తర్వాత అత్యంత లోటు
2026 నైరుతి రుతుపవనాలు దీర్ఘకాలిక సగటు (LPA) కంటే 12 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసే అవకాశం ఉందని సిటీ తెలిపింది. దీంతో 2015 ఎల్ నినో సంవత్సరం తర్వాత ఇదే అత్యంత లోటుతో ముగిసే రుతుపవనాల సీజన్ అవుతుందని పేర్కొంది. సెప్టెంబర్ చివర్లో కురిసిన భారీ వర్షాలు వర్షపాత లోటును కొంతమేర తగ్గించినప్పటికీ.. ఉత్తర, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు తలెత్తాయి. పంట కోతకు సమీపంలో కురిసిన ఈ భారీ వర్షాలు ఇప్పటికే పొలాల్లో ఉన్న ఖరీఫ్ పంటలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవచ్చని సిటీ అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు విస్తృతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 36 వాతావరణ ఉపవిభాగాల్లో 23 చోట్ల 10 శాతానికి మించి లోటు నమోదైంది. మరో 15 ఉపవిభాగాల్లో 20 శాతానికి పైగా వర్షపాతం లోటు ఉంది. సెప్టెంబర్ 23 నాటికి దేశంలో దాదాపు సగం ప్రాంతం కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సిటీ తెలిపింది. 2023లో ఎల్‌నినో ప్రభావం ఉన్న సమయంలో ఈ వాటా 30 శాతంగా ఉండగా.. ప్రస్తుతం సుమారు 10 శాతం ప్రాంతాన్ని తీవ్రమైన లేదా అసాధారణంగా పొడి పరిస్థితులు ఉన్న ప్రాంతాలుగా వర్గీకరించినట్లు పేర్కొంది.
రబీపై నీటి నిల్వల ప్రభావం
ఇక ఆందోళన అంతా రబీ సీజన్‌పైకి మళ్లింది. దేశంలోని నీటి రిజర్వాయర్లలో ప్రస్తుతం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో కేవలం 71 శాతం నీరు మాత్రమే ఉన్నట్లు సిటీ నివేదిక వెల్లడించింది. పదేళ్ల సగటు 80 శాతంతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ. 2016 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి అని తెలిపింది.
గోధుమల సాగులో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తక్కువ నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే దేశ గోధుమ ఉత్పత్తిలో దాదాపు మూడో వంతు వాటా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అక్కడ రిజర్వాయర్లలో నీటి నిల్వలు సుమారు 84 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
బలమైన ఎల్‌నినో.. వేడి ముప్పు
మరోవైపు ఈసారి ఎల్‌నినో అసాధారణంగా బలంగా ఉండొచ్చని సిటీ అంచనా వేస్తోంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా ప్రకారం 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ కూడా నినో 3.4 సూచీ 1950లో విశ్వసనీయ పరిశీలనలు ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన అత్యంత వెచ్చని స్థాయికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సిటీ తెలిపింది.
వెచ్చని, పొడి శీతాకాలం కొనసాగితే 2027 మార్చి-ఏప్రిల్‌లో పంటలపై వేడి గాలుల (హీట్‌వేవ్) ప్రభావం పెరగొచ్చు. ముఖ్యంగా గోధుమలు, ఇతర రబీ పంటలకు ఇది నష్టం కలిగించే అవకాశం ఉంది. 2022లో వచ్చిన తీవ్ర వేడిగాలులను ఈ సందర్భంగా సిటీ ప్రస్తావించింది. ఆ సమయంలో గోధుమ దిగుబడులు దెబ్బతినడంతో ఆహార ధరలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది.
ఉల్లి, పప్పులు, బియ్యంపైనా ఒత్తిడి
ఇప్పటికే కొన్ని కీలక పంటల్లో ఒత్తిడి కనిపిస్తున్నట్లు సిటీ నివేదిక పేర్కొంది. దేశ ఉల్లి ఉత్పత్తిలో సుమారు 75 శాతం, పప్పుధాన్యాల ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు, బియ్యం ఉత్పత్తిలో సగం వాటాను అందించే రాష్ట్రాలు 10 శాతానికి మించిన వర్షపాత లోటును ఎదుర్కొన్నట్లు తెలిపింది.
దీంతో ఉల్లి, చక్కెర, బియ్యం, పప్పుధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని సిటీ అంచనా వేసింది. సెప్టెంబర్ వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం స్థాయికి చేరే దిశగా ఉందని పేర్కొంది. సిటీ ఉదహరించిన రోజువారీ ధరల గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో ఉల్లి ధరలు దాదాపు రెట్టింపయ్యాయి.


