పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో వేడి నీరు అసాధారణంగా పెరగటాన్ని ఎల్‌నినో అంటారు. దీనివల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చి వర్షాలు తగ్గిపోవడం, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం, కరువు పరిస్థితులు ఏర్పడటంతో వ్యవసాయ రంగం అనేక అదనపు సవాళ్లను ఎదుర్కొంటున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల మామిడి తోటల్లో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, తేనెమంచు పురుగులు, తామర పురుగుల ఉధృతి పెరిగి పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉంది. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకుని, ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో తోటను కాపాడుకోవటానికి ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
నేలలో తేమను నిలబెట్టుకోవటం: ∙చెట్టు మొదలు చుట్టూ (డ్రిప్ లైన్ పరిధిలో) ఎండు గడ్డి, వరి పొట్టు లేదా రాలిన ఆకులను 4–6 అంగుళాల మందంలో పరచాలి. ఇది నేలలో తేమ ఆవిరి కాకుండా చూస్తుంది. వేర్ల దగ్గర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ∙నెలకు రెండుసార్లు జీవామృతం (100 లీటర్లు ఎకరాకు) నీటి ద్వారా అందించటం వల్ల నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరిగి, వేర్లు తక్కువ నీటితో కూడా బలంగా పెరుగుతాయి.
పూత, పిందెలను కాపాడుకోవటం: ∙10 లీటర్ల నీటికి 300 మి.లీ. 3% పంచగవ్య ద్రావణాన్ని కలిపి పూత దశకు ముందు ఒకసారి, పిందె కట్టిన తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. ఇది పిందె రాలటాన్ని తగ్గించి, కాయ పరిమాణాన్ని పెంచుతుంది ∙10 లీటర్ల నీటిలో 1 లీటరు పులిసిన మజ్జిగ, 10 గ్రాముల ఇంగువ కలిపి పిచికారీ చేస్తే చెట్టుకు బలం చేకూరి పూత నిలబడుతుంది.
తెగుళ్లు, పురుగుల నివారణ: ∙తేనెమంచు పురుగులు, తామర పురుగుల నివారణకు 10,000 పీపీఎం వేప నూనె (లీటరు నీటికి 2–3 మి.లీ.)ను సబ్బు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి ∙500 గ్రా. అల్లం, 500 గ్రా. వెల్లుల్లి, 500 గ్రా. పచ్చిమిర్చిలను బాగా నూరి, 10 లీటర్ల నీటిలో మరిగించి తయారుచేసుకున్న ద్రావణాన్ని లీటరు నీటికి 20 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులు నాశనమవుతాయి ∙ఎకరాకు 15–20 పసుపు జిగురు అట్టలను తోటలో అమర్చటం ద్వారా తేనెమంచు, రెక్కల పురుగులను నివారించవచ్చు.
వడగాడ్పుల నుంచి రక్షణ: ∙చెట్టు ప్రధాన కాండానికి (కింద నుంచి 3–4 అడుగుల ఎత్తు వరకు) సున్నం, నీరు, కొద్దిగా వేపనూనె కలిపిన ద్రావణాన్ని పూయాలి. ఇది సూర్యరశ్మి తీవ్రత నుంచి కాండాన్ని కాపాడుతుంది ∙వేస్ట్ డీ–కంపోజర్ ద్రావణాన్ని లీటరు నీటికి 50 మి.లీ. చొప్పున ఆకులపై పిచికారీ చేయటం ద్వారా చెట్లు అధిక ఉష్ణోగ్రతను, ఎండ వేడిని తట్టుకుంటాయి.
గుమ్మడాపురం రఫీ
(98480 02221)
సీనియర్ సేంద్రియ మామిడి రైతు
ఎగుమతిదారు


